షర్మిలమ్మ సుద్దులు వినతరమా...!?

ఏపీ రాజకీయాలు చూస్తే గత రెండు దశాబ్దాలుగా వైఎస్ నారా కుటుంబాల మధ్య విడిపోయాయి. రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత స్థాయిలో అవి బలమైన శతృ భావనతో సాగుతున్నాయి.

Update: 2024-01-13 13:30 GMT

వైఎస్సార్ తనయ షర్మిల రాజకీయాల్లో ఉత్సాహంగా ఉంటున్నారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో రాణించాలని తన వరకూ చేయని ప్రయత్నం లేదు. సొంత పార్టీ పెట్టారు, మూడేళ్ళు తిరగకుండానే జెండా పీకేసి కాంగ్రెస్ లో కలిపేశారు. ఇపుడు కాంగ్రెస్ లో ఆమె చేరారు. ఆమె అక్కడ ఏ విధమైన పాత్ర పోషిస్తారు అన్నది ఇంకా తెలియలేదు.

ఇంతలో ఆమె తన కుమారుడి నిశ్చితార్ధం పెళ్ళి పనులలో బిజీగా ఉన్నారు. ఇదే క్రమంలో ఆమె రాజకీయ నేతలను కలసి వారికి పెళ్ళి ఆహ్వానాలు అందచేస్తున్నారు. షర్మిల అలా చాలా మంది నేతలను కలుసుకోవడం విశేషం ఏమీ కాదు కానీ ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ కావడం మాత్రం సంచలనం రేపుతోంది.

ఏపీ రాజకీయాలు చూస్తే గత రెండు దశాబ్దాలుగా వైఎస్ నారా కుటుంబాల మధ్య విడిపోయాయి. రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత స్థాయిలో అవి బలమైన శతృ భావనతో సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు అదేదో పాత సినిమా ఎన్టీయార్ యమగోలలో రావు గోపాలరావు చెప్పిన డైలాగు గుర్తుకు వస్తుంది. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదు అని.

అలా రాజకీయాల్లో అడ్డు గోడలు వేసుకుని మరీ పరస్పరం శతృభావంతో ఉండడం అన్నది కేవలం ఏపీ రాజకీయాల్లోనే సాగుతోంది. దానికి కారకులు ఎవరు అన్నది పక్కన పెడితే అందరూ అన్న జవాబు కూడా వస్తుంది. ఇక చంద్రబాబు వైఎస్సార్ మిత్రులు అన్నది తెలుసు. ఆ తరువాత వారు ప్రత్యర్థులు అయ్యారు. వైఎస్సార్ మరణానంతరం చంద్రబాబు వైఎస్ ఫ్యామిలీల మధ్య మరింతగా అగాధం పెరింది.

దానికి కారణం చూస్తే వైఎస్ జగన్ మీద కాంగ్రెస్ నేతలు పెట్టిన కేసులు. అందులో ఇంప్లీడ్ అయింది తెలుగుదేశం నాయకులు. నిజానికి ఈ విషయంలో ఏ మాత్రం సంబంధం లేకపోయినా నాడు టీడీపీ ఎంట్రీ ఇచ్చి జగన్ ని కోరి శతృవుగా చేసుకుంది అన్నది ఒక మాట ప్రచారంలో ఉంది. జగన్ జైలు జీవితం పదహారు నెలలు సాగింది. టీడీపీ అనుకూల మీడియా నాడు అతి ఉత్సాహం చూపించి మరీ జగన్ రాజకీయ జీవితంతో చెలగాటమే ఆడింది.

ఇవన్నీ చరిత్రలో ఉన్న విషయాలు. వైఎస్ షర్మిల నాడు జగనన్న వదిలిన బాణాన్ని అని పాదయాత్ర చేస్తూ ఇచ్చిన స్పీచులలో ఇవన్నీ ఉన్నాయి. ఇపుడు ఆమె చంద్రబాబుకు పెళ్ళి ఆహ్వానం ఇచ్చి వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలలో స్నేహ భావం ఉండాలని కోరారు. రాజకీయం వేరు వ్యక్తిగతం వేరు అన్నట్లుగా మాట్లాడారు.

అది నిజమే. కానీ దాన్ని బ్రేక్ చేసింది ఎవరు. అసలు ఆ బంధాలను తెంచింది ఎవరు అన్న ప్రశ్నలు కూడా వస్తాయి కదా. వైఎస్సార్ కుమారుడుగా మూడు నెలల ఎంపీగా మాత్రమే 2009 నాటికి ఉన్న జగన్ తో చంద్రబాబుకు ఏ వ్యక్తిగత వైరం ఉందని ఆయన కేసులలో ఇంప్లీడ్ అయ్యారు అన్నది ఒక ప్రశ్నగా వైసీపీ అభిమానులు ముందుకు తెస్తారు.

ఇక మరో మాట కూడా ఉంది. దెబ్బ తిన్న వాడు ఎపుడూ కోపంగానే ఉంటాడు. పక్కన ఉన్న వాడు పోనీలెండి సర్దుకుపోదాం అనవచ్చు. కానీ తిన్న వాడికి కదా ఆ బాధ తెలిసేది, ఆ నొప్పి భరించేది అన్నది కూడా చెబుతారు. ఆ విధంగా చూస్తే బాధితుడుగా జగన్ ఉన్నారు. ఆయన కూడా రాజకీయాల్లో ఏదో చేయాలనే 2009లో ఎంపీ అయ్యారు. తండ్రి చనిపోయేనాటికి ఆయనకు టీడీపీ సహా ఏ రాజకీయ పక్షంతోనూ వైరం లేనే లేదు.

మరి అవతల వైపు నుంచి ఆయనని కార్నర్ చేసినపుడే కదా జగన్ వైపు నుంచి కూడా జవాబు వచ్చింది అన్నది వైసీపీ నేతల వాదన. ఇక వైసీపీ ని వీడి కొత్త పార్టీ పెట్టి ఇపుడు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి షర్మిల ఇన్ని సుద్దులు చెబుతున్నారు కానీ అదే ఆమె వైసీపీలోనే ఉంటే ఇలా బాబుని కలిసేవారా ఈ మాటలు చెప్పేవారా అంటే జవాబు ఆలోచించలేమో అని అంటున్న వారు ఉన్నారు.

ఏది ఏమైనా షర్మిల చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. అంతా దాన్ని ఏకీభవిస్తారు. కానీ ఏపీలో జరుగుతున్న ప్రచారం ఏంటి, రేపు మేము ఎన్నికల్లో గెలిస్తే వైసీపీ నేతలను జైళ్లలో పెడతామని అంటున్నారు. అంటే ప్రతీకార రాజకీయాలు పీక్స్ కి వెళ్ళిపోతున్న వేళ ఆమె మాటలు పట్టించుకునే పరిస్థితి ఉందా అన్నది కూడా ఆలోచించాలి.

ఏది ఏమైనా చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్. అలాగే వైఎస్ జగన్ రాజకీయంగా రాటుదేలుతున్న నేత. ఈ ఇద్దరితో పాటు రెండు పార్టీల నేతలూ సహనంతో వ్యవహరించి రాజకీయాలను అలగే చూసే కల్చర్ ని అలవాటు చేసుకుంటే మంచిదే అని అంతా అంటున్న మాట.

Tags:    

Similar News