షర్మిల...బేలగా..ఎందుకలా....!

అలాంటిది ఆమె ఏపీలో జరిగిన ఒక కీలక సమావేశంలో కంట తడి పెట్టారు. ఆమె కన్నీరు ఆపుకోలేకపోయారు. దానికి కారణం ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు అని అదే తన బాధ అని అంటున్నారు.

Update: 2024-03-07 23:30 GMT
షర్మిల...బేలగా..ఎందుకలా....!
  • whatsapp icon

షర్మిల దూకుడునే అంతా ఇప్పటిదాకా చూసారు. ఆమె పొలిటికల్ గా చాలా అగ్రెసివ్ గా వెళ్లే నేచర్ నే చూశారు. అలాంటిది ఆమె ఏపీలో జరిగిన ఒక కీలక సమావేశంలో కంట తడి పెట్టారు. ఆమె కన్నీరు ఆపుకోలేకపోయారు. దానికి కారణం ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు అని అదే తన బాధ అని అంటున్నారు.

నిజానికి ఏపీకి ప్రత్యేక హోదా అంశం మీద అయితే అది ఈనాటి సమస్య కాదు, పదేళ్ల నాటి సమస్య. పైగా ఆ సమస్యకు మూల కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. కేవలం నోటి మాటగా రాజ్యసభలో నాటి ప్రధాని హామీగా ఇచ్చేసి ఊరుకున్న ముచ్చట. 2014 ఎన్నికలు వస్తున్నాయన్న హడావుడిలో రెండు చోట్లా భారీ రాజకీయ లాభం పొందాలన్న రాజకీయ స్వార్ధంతో ఏ ప్రాతిపదిక లేకుండా ఏ కొలమానం చూసుకోకుండా అడ్డగోలుగా కాంగ్రెస్ ఏపీని రెండు ముక్కలు చేసి పారేసింది.

హామీలు కూడా అరకొరగా పెట్టింది. విభజన చట్టం లో కూడా ప్రత్యేక హోదా లాంటివి చేర్చలేదు. ఏపీకి రాజధానిని కేంద్ర ప్రభుత్వం తన సొంత నిధులతో కట్టించి ఇవ్వాలని కూడా ఎక్కడా రాసిపెట్టలేదు. ఇలా తనదైన నిర్వాకంతో ఏపీని పాతాళానికి తోసేసిన పార్టీ కాంగ్రెస్.

ఇపుడు ఆ పార్టీకి కొత్త ప్రెసిడెంట్ గా వచ్చిన షర్మిల ప్రత్యేక హోదా గురించి కంట నీరు పెడుతున్నారు. అది కూడా ఆమె జనవరిలో బాధ్యతలు స్వీకరిస్తే మార్చి నెలలో. . కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఇవ్వరని తెలిసి కూడా వైసీపీ టీడీపీ జనసేనలని నిందిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే అద్భుతం జరిగిపోతుందని ఆమె అంటున్నారు.

అసలు కేంద్రంలో కాంగ్రెస్ ఈసారి కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు అని సగటు జనానికి తెలిసినా షర్మిల మాత్రం రాజీవ్ గాంధీ ప్రధానిగా తొలి సంతకం అని ప్రతీ సభలో ఊదరగొడుతున్నారు. ఇక ఆమె తాజా మీటింగులో అయితే కంట నీరే పెట్టుకున్నారు. తనకు వ్యక్తిగత రాజకీయం లేదని కూడా చెప్పుకున్నారు.

అసలు షర్మిల ఎందుకు ఇలా అన్నారు, ఎందుకు ఎమోషన్ అయ్యారు అంటే దాని మీద కూడా తలో రకంగా వ్యాఖ్యానిస్తున్న వారు ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ ఎత్తిగిల్లే పరిస్థితి లేదు అన్నది రెండు నెలల షర్మిల పీసీసీ నాయకత్వంలో కూడా తేలిపోయింది అని అంటున్నారు. ఆమె వస్తే వైఎస్సార్ తనయగా కాంగ్రెస్ అమాంతం లేచి కూర్చుంటుందని ఆశలు పెట్టుకున్న వారు కూడా ఇపుడు నిరాశలో ఉన్నారు.

కాంగ్రెస్ గతి ఈసారి ఎన్నికలకూ ఇంతే అని అంతా అనుకుంటున్న నేపధ్యం ఉంది. గ్రాఫ్ అయితే పెరగలేదు. ఎక్కడా ఒక్క మాజీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో చేరడం లేదు. ఆఖరుకు బీజేపీలో చేరడానికి చూస్తున్నారు తప్ప కాంగ్రెస్ ని తలవడంలేదు. ఏపీలో వైసీపీ టీడీపీ జనసేన, బీజేపీ ఇలా రాజకీయమంతా ఆ నాలుగు పార్టీల చుట్టూనే తిరుగుతుంది.

కాంగ్రెస్ కి వేలల్లో దరఖాస్తులు వచ్చాయని చెబుతున్నారు కానీ పేరు మోసిన రాజకీయంగా ఎంతో కొంత గట్టి పట్టున్న వారు నియోజకవర్గాలలో దొరకడం లేదు అని అంటున్నారు. దాంతోనే కాంగ్రెస్ ఫ్యూచర్ ఏమిటో అర్ధం అయింది అని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కొన్ని లక్ష్యాలు పెట్టుకుని దిగింది. ఒకటి వైసీపీని ఓడించడం, రెండు తన ఓటు బ్యాంక్ ని కనీసంగా పది శాతం అయినా పెంచుకోవడం, మూడవది ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చినా తమకు ఎంతో కొంత వెసులుబాటు ఉండేలా చూసుకోవడం.

చూస్తే టీడీపీ కలసివస్తుందనుకుంటే బీజేపీతో జట్టు కడుతోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పది శాతం కాదు కదా అయిదు శాతం అయినా పెరుగుతుందా అంటే డౌటే. ఇక వైసీపీ గద్దె దిగితే ఎంతో కొంత ఊరట. అది షర్మిల వల్ల సాధ్యం అయిందని చెప్పుకోవచ్చు. వైసీపీ ఓడితే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అక్కడ నుంచి కాంగ్రెస్ కి షిఫ్ట్ అయి 2029 నాటికైనా బలపడుతుందని ఆశ.

చూడబోతే ఇందులో ఏ ఒక్కటీ తీరేలా లేవు అని అంటున్నారు. వైసీపీ ఓడినా టీడీపీ గెలిచినా కాంగ్రెస్ కి ఇపుడు ఉపయోగం లేదు. దాంతో ఎన్నికల ఫలితాల తరువాత షర్మిల రాజకీయం కూడా ఎలా ఉంటుందో తెలియదు అని అంటున్నారు. మొత్తానికి చెల్లెమ్మ పాలిటిక్స్ తెలంగాణాతో మొదలెట్టి ఏపీతో ముగుస్తుందా అన్న సందేహాలు అయితే ఉన్నాయి. ఆమె కన్నీరు వెనక ఈ కారణాలు కూడా ఉండొచ్చు అంటున్నారు. అయినా ధీరగా ఉండాల్సిన షర్మిల బేలగా ఏడవడం బాగా లేదు అనే అంటున్నారు అంతా.

Tags:    

Similar News