వైసీపీని చెల్లకుండా చేయడమే చెల్లెలు టార్గెట్ !?
విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ప్రమాదం గత ప్రభుత్వం నిర్వాకం వల్ల అని చంద్రబాబు సహా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా వైసీపీ మీద పడ్డారు.
ఏపీలో కాంగ్రెస్ ని నాయకత్వం వహిస్తున్న వైఎస్ జగన్ చెల్లెలు షర్మిలకు సొంత పార్టీ కంటే జగన్ పార్టీ మీదనే ఫోకస్ ఉంది అని అంటున్నారు కూటమి నేతలకు కూడా తట్టని సరికొత్త ఆలోచనలు ఆమె చేస్తూ వాటిని వారికి అందిస్తూ విపక్షంలో ఉన్నా ఏ మాత్రం కదలకుండా వైసీపీ నడ్డి విరగ్గొట్టే ప్లాన్ ని అమలు చేస్తున్నారు అని అంటున్నారు.
విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ప్రమాదం గత ప్రభుత్వం నిర్వాకం వల్ల అని చంద్రబాబు సహా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా వైసీపీ మీద పడ్డారు. కానీ షర్మిల అయితే గత డిసెంబర్ లోనే సెజ్ లో భద్రతా ప్రమాణాలు ఏ మాత్రం బాగా లేవని ఒక నివేదిక ప్రభుత్వానికి చేరిందని అయినా పట్టించుకోలేదని చెబుతూ అసలైన అస్త్రాన్ని బయటకు తీసి కూటమి ప్రభుత్వానికి అందించారు.
ఈ విధంగా చేయడం ద్వారా వైసీపీదే ఈ సెజ్ లో మరణాల పాపం అని ఆమె కచ్చితంగా తేల్చేశారు. ఒక వైపు టీడీపీ కూటమి సెజ్ ప్రమాదానికి కారణం అని నిర్లక్ష్యానికి వారే బాధ్యులు అని వైసీపీ చేస్తున్న ఆరోపణలు విమర్శలు అన్నీ కూడా గాలిలో కొట్టుకుని పోయేలా షర్మిల వైసీపీని పూర్తిగా ఇరకాటంలో పెట్టేశారు.
దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్ కి ఏపీ చీఫ్ గా షర్మిల రాజకీయ వ్యూహాలు ప్రణాళికలు ఏమిటో అర్ధం అవుతున్నాయని అంటున్నారు. ఏపీలో వైసీపీ ఓటమి చెంది దాదాపుగా మూడు నెలలు కావస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. సహజంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికార పక్షం మీదనే విమర్శలు చేస్తాయి. విపక్షంలో ఉన్న పార్టీని అసలు పట్టించుకోవు. ఎందుకంటే ప్రజలు కూడా చూసేది అధికార పక్షం వైపే.
వైసీపీ ఎన్ని తప్పులు చేసింది ఎన్ని అపరాధాలు చేసింది అన్న లెక్కలు అన్నీ కట్టి మరీ జనాలు 2024 ఎన్నికల్లో తీర్పు ఇచ్చేశారు. ఇక ఎన్నో హామీలు ఇచ్చి వచ్చిన కూటమి ప్రభుత్వం తమకు ఏమి చేస్తోంది అన్నదే వారికి కావాల్సిన పాయింట్. ఇది రాజకీయంగా చూస్తే ఉండే నేపథ్యం.
కానీ షర్మిల మాత్రం వైసీపీనే ఫుల్ గా టార్గెట్ చేస్తున్నారు. ఆమె మీడియా మీటింగులు అయినా ట్వీట్లు అయినా లేక సభలు అయినా ఏమైనా కూడా ఎక్కువ భాగం వైసీపీని విమర్శించడానికి ఆ పార్టీకి కార్నర్ చేయడానికే చూస్తున్నారు అని అంటున్నారు. దీని వల్ల ఆమె ఏమి సాధిస్తారు అన్నదే ఇక్కడ పాయింట్.
అయితే వైసీపీని ఎంత తగ్గించి ఇబ్బంది చేస్తే ఆ వైపు ఉన్న జనాలు అంతా కాంగ్రెస్ కి షిఫ్ట్ అవుతారు అని ఆ విధంగా ఏపీలో కాంగ్రెస్ బలపడుతుంది అన్నది షర్మిల వ్యూహం కావచ్చు అని అంటున్నారు. అయితే అది రాజకీయ గణితంలో పూర్తిగా కరెక్ట్ లెక్క కాదు అని అంటున్నారు. ఏపీలో వైసీపీ ఓటమి పాలు అయింది. గడచిన మూడు నెలల్లో వైసీపీ నుంచి టీడీపీకి జనసేనకు ఆ పార్టీ జనాలు వెళ్తున్నారు తప్ప కాంగ్రెస్ వైపు ఒక్కరు కూడా తొంగి చూడటం లేదు అన్నది అసలైన వాస్తవం.
దానికి కారణం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అలా ఉంది. అలాంటి కాంగ్రెస్ ని బలోపేతం చేసుకోవాలీ అంటే అధికార పక్షానికి ఎదురు నిలిచి విమర్శలు చేయాలి. ప్రజా పక్షంగా పోరాడాలి. అపుడే ఎంతో కొంత జనాలు ఆ పార్టీ వైపు చూస్తారు. అలాగే వైసీపీ నుంచి ఏమైనా పార్టీ జనాలు వచ్చినా వచ్చి చేరుతారు.
అయితే షర్మిల వ్యూహం మాత్రం ఓటమి చెందినా వైసీపీ ఇంకా పొలిటికల్ ఫీల్డ్ లో ఎందుకు ఉంది అన్నట్లుగానే ఉంది. నిజానికి ఈ రోజుకే కాదు 2029 నాటికి కూడా ఏపీలో కూటమికి అసలైన బలమైన ప్రత్యర్ధిగా వైసీపీయే ఉంటుంది. కాకపోతే ఓట్ల చీలిక వల్ల అధికారం దక్కుతుందా లేదా అన్నది చూడాలి కానీ కాంగ్రెస్ కంటే వైసీపీ ఇప్పటికీ ఎప్పటికీ ఎంతో ముందే ఉంటుంది అన్నది ఒక కచ్చితమైన విశ్లేషణ.
వైసీపీ అధినేత జగన్ తప్పులు చేసి ఉండవచ్చు. కానీ నాయకుడిగా ఆయన ఫెయిల్ అవలేదు. ఆయన నాయకత్వ లక్షణాలు చూసే పార్టీ క్యాడర్ నిలిచి ఉంది. పైగా వైఎస్సార్ వారసత్వం విషయంలోనూ జగన్ కే ఎక్కువ మార్కులు పడతాయి. ఏపీలో కాంగ్రెస్ 2029 నాటికి ఎంతో కొంత పుంజుకున్నా కూడా వైసీపీకి ఆమడ దూరంలోనే ఉంటుంది.
ఇవన్నీ రాజకీయ వాస్తవ విశ్లేషణలు. మరి వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం రావాలీ అంటే వైసీపీని కూడా కలుపుకుని పోయే విధంగా షర్మిల రాజకీయం ఉండాలని అంటున్నారు. 2029 నాటికి ఇండియా కూటమి దేశవ్యాప్తంగా బలం పెంచుకున్నా ఏపీలో పొత్తులే పెట్టుకోవాలి. ఆ పొత్తులు వైసీపీతో సాగాలీ అన్నా ఇప్పటి నుంచే తగిన అనుకూల వాతావరణం ఏర్పాటు కావాలి. వైసీపీని ఇదే పనిగా విమర్శిస్తూ షర్మిల రాజకీయం చేస్తే కాంగ్రెస్ పార్టీ పెద్దలే భారీ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు అని అంటున్నారు.