షర్మిల ఆహ్వానాన్ని బాబు, పవన్‌ మన్నిస్తారా?

షర్మిల తన సొంత సోదరుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని మినహాయించి వైఎస్సార్‌ జయంతి కార్యక్రమానికి ప్రతి రాజకీయ ప్రముఖుడిని ఆహ్వానిస్తున్నారు.

Update: 2024-07-07 06:37 GMT

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఇటీవల కడప పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ నిరాశ చెందకుండా పార్టీ బలోపేతంపై ఆమె దృష్టి సారించారు. ప్రధానంగా ఎన్నికల ముందు వైసీపీలో సీట్లు దక్కని నేతలంతా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరు ఎన్నికల్లో ఓడిపోయినా.. కొంతమంది భారీగానే ఓట్లు సాధించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి మరికొందరు నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని టాక్‌ నడుస్తోంది. వీరిలో కీలక నేతలు కూడా ఉన్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో జూలై 8న దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖులను ఇప్పటికే ఆమె ఆహ్వానించారు. తద్వారా వైఎస్సార్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలని షర్మిల భావిస్తున్నారు.

ఇందులో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీల్లో ఎవరో ఒకరు కూడా వైఎస్సార్‌ జయంతి వేడుకలకు వస్తారని తెలుస్తోంది.

ఈ క్రమంలో ముందుగా వైఎస్‌ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తదితరులను ఆహ్వానించారు. జూలై 8న విజయవాడలో పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వైఎస్సార్‌ జయంతి వేడుకలకు రావాలని ఆహ్వానించారు.

ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ లను కూడా షర్మిల ఆహ్వానించే అవకాశం ఉందని టాక్‌ నడుస్తోంది, చంద్రబాబు, వైఎస్సార్‌ 1978లో ఒకేసారి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇద్దరూ రాయలసీమ నేతలే. అంతేకాకుండా ఇద్దరూ తొలుత కాంగ్రెస్‌ పార్టీ నుంచే తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత చంద్రబాబు టీడీపీలోకి వెళ్లిపోయినా వీరిద్దరి మధ్య వ్యక్తిగత సాన్నిహిత్యం కొనసాగింది.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబును షర్మిల ఆహ్వానించొచ్చని చెబుతున్నారు. వైఎస్సార్‌ ను పవన్‌ కళ్యాణ్‌ కూడా గౌరవిస్తారని.. ఆయన పట్ల పవన్‌ కు సాఫ్ట్‌ కార్నర్‌ ఉందని అంటున్నారు. మరి షర్మిల ఆహ్వానాన్ని మన్నించి వీరిద్దరూ వైఎస్సార్‌ జయంతి వేడుకల్లో పాల్గొంటారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

షర్మిల తన సొంత సోదరుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని మినహాయించి వైఎస్సార్‌ జయంతి కార్యక్రమానికి ప్రతి రాజకీయ ప్రముఖుడిని ఆహ్వానిస్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా వైఎస్సార్‌ జయంతిని రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున నిర్వహించాలని తలపెట్టింది.

కాగా తన తండ్రి వైఎస్సార్‌ జయంతిని భారీ ఎత్తున నిర్వహించడం ద్వారా ఆయనకు ప్రజల్లో ఉన్న ఇమేజ్‌ ను క్యాష్‌ చేసుకోవాలనేదే షర్మిల వ్యూహమని అంటున్నారు, తన అన్న వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీ మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. దీంతో వైసీపీలో కొందరు నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. అలాంటి వారందరినీ ఆకర్షించడానికి వైఎస్సార్‌ జయంతి వేడుకలే సందర్భమని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ జయంతి వేడుకలకు కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీతోపాటు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ఇతర నేతలు కూడా హాజరయితే షర్మిల లక్ష్యం కొంతవరకు నెరవేరినట్టేనని అంటున్నారు.

Tags:    

Similar News