షర్మిలది సింగిల్ పాయింట్ అజెండానా ?

అదే సమయంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కి ఇక శాశ్వతంగా ఆశలు ఉండవని కూడా వారికి అర్థమయ్యే షర్మిలను జగన్ మీద ప్రయోగించారు అని అంటారు.

Update: 2024-07-13 04:30 GMT

కాంగ్రెస్ లో సభ్యత్వమే లేని షర్మిలను తీసుకుని వచ్చి పీసీసీ చీఫ్ గా చేశారు అంటే హై కమాండ్ ఆలోచనలు అందులోనే స్పష్టం అవుతున్నాయి. ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని వెనక్కి తెచ్చుకోవడం వైసీపీలో ఉన్న వారిని ఆకట్టుకుని పార్టీ బలం పెంచుకోవడం అన్నది. అదే సమయంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కి ఇక శాశ్వతంగా ఆశలు ఉండవని కూడా వారికి అర్థమయ్యే షర్మిలను జగన్ మీద ప్రయోగించారు అని అంటారు.

వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా సాధించింది ఏంటి అంటే అన్నను గద్దె నుంచి దించడం. ఆ విషయంలో ఆమె సక్సెస్ అయ్యారు. ఆ విధంగా తొలి అడుగు పడింది. అయితే ఇంతటితో ఆగిపోలేదు. ఇపుడే అసలైన కధ మొదలైంది. వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులను రప్పించడం కోసమే ఆర్భాటంగా వైఎస్సార్ 75వ జయంతి వేడుకలను ఆ పార్టీ జరిపింది.

మంచి మాటకారి అయిన తెలంగాణా సీఎం తో సహా మంత్రులను రప్పించింది. జయంతి వేడుకలు బాగా జరిగినా కాంగ్రెస్ కి రాజకీయంగా కలసి వచ్చింది ఎంత అన్న చర్చ జరుగుతోంది. వైఎస్సార్ వారసురాలిని తానే తప్ప జగన్ కాడని షర్మిల మరోసారి మాట్లాడుతున్నారు. విజయవాడ నుంచి మీడియా ద్వారా ఆమె ఈ సందేశాన్ని ఇస్తున్నారు

జగన్ నే ఆమె గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. దాంతో షర్మిలది సింగిల్ పాయింట్ అజెండానా అన్న చర్చ మొదలైంది. జగనన్న పార్టీని సున్నా చేయడమే ఆమెకు కాంగ్రెస్ హై కమాండ్ ఇచ్చిన టార్గెట్ అని అంటున్నారు. అయితే వైసీపీలో ఉన్న వారిలో అసంతృప్తి ఉంటే వారు అయితే బీజేపీ లేకపోతే తెలుగుదేశం అన్నట్లుగా చూస్తున్నారు అంటున్నారు.

ఎందుకంటే ఈ రెండు పార్టీలూ అధికారంలో ఉన్నాయి. తమ మీద కేసులు పెట్టకుండా తాము సేఫ్ జోన్ లో ఉండాలీ అంటే ఈ పార్టీలే మేలు అన్నది సగటు పొలిటీషియన్ల ఆలోచనగా ఉంది. ఇక ఏపీలో చూస్తే కాంగ్రెస్ ఏమీ లేదు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షంలో ఉంది. కాంగ్రెస్ కి అధికార కళ వచ్చినపుడు అందులోకి వద్దు అన్నా నేతలు వస్తారు.

అయితే ఆ టైం ఇపుడే రాలేదు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. అసెంబ్లీలో గుర్తించకపోయినా ప్రతిపక్షం అంటే వైసీపీనే అని కూటమి బయట గురించి మాట్లాడుతోంది. ప్రతీ మాటకు ముందు గత అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం అని చెప్పడం ద్వారా వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు.

ఇక కాంగ్రెస్ వామపక్షాలు ఏపీలో పెద్దగా లేవు. పోరాటాలు ఉద్యమాలు ఆ పార్టీలు ఇంకా సమయం చూసి చేపడతాయి. ప్రస్తుతానికి ఏపీలో కూటమికి హానీమూన్ నడుస్తోంది. ఈ నేపధ్యంలో వైసీపీ కొన్నాళ్ళ పాటు అధికార పక్షానికి టైం ఇవ్వాలని చూస్తోంది. వైసీపీకే పని లేకపోతే కాంగ్రెస్ కి ఏమి ఉంటుంది.

కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద విమర్శలు గబుక్కున చేయలేరు కదా. అందుకే వారసత్వ అంశాన్ని లేవనెత్తుతూ జగన్ మీదనే షర్మిల బాణాలు వేస్తున్నారు. వైఎస్సార్ కి జగన్ మొక్కుబడిగా నివాళి అర్పించారు అని అంటున్నారు. అయితే ఇపుడు ఏపీ ప్రజలలో వైఎస్సార్ వారసులు ఎవరు అన్న చర్చ లేదు.

అంతే కాదు ఏపీలో ఎవరు విపక్షంలో ప్రధాన పాత్ర అన్న చర్చ కూడా లేదు. ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించిన కూటమి ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా షర్మిల మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సి ఉంది. దాంతో కూటమి ప్రభుత్వాన్ని ఒక వైపు సున్నితంగా సలహా సూచనలతో హెచ్చరిస్తూ జగన్ మీద ఆమె ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఆమె వైసీపీ నుంచి నాయకులను క్యాడర్ ని ఎంత వరకూ ఆకర్షిస్తారు అన్నది చూడాల్సి ఉంది. అయితే ఎల్ల కాలం సింగిల్ పాయింట్ అజెండాతో వెళ్తూ ఉన్నా జనాలకు అది బోర్ కొడుతుంది. సో షర్మిల పొలిటికల్ యాక్షన్ ప్లాన్ లో మార్పు చేర్పులు అవసరం అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News