అవుట్‌ట్ డేటెడ్ నేతలే షర్మిలకు ఆయు పట్టా...!
ఒకప్పుడు వారంతా రాజకీయంగా చక్రం తిప్పిన వారే. కానీ, ఇప్పుడు 60లు దాటిపోయిన వయసులో ఉన్నారు.
ఒకప్పుడు వారంతా రాజకీయంగా చక్రం తిప్పిన వారే. కానీ, ఇప్పుడు 60లు దాటిపోయిన వయసులో ఉన్నారు. పైగా.. రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు. ప్రజల పరంగా చూసుకుంటే.. వీరంతా ఔట్ డేటెడ్ అయిపోయారు. ప్రజలకు-వీరికి మధ్య సంబంధాలు కూడా తెగిపోయాయనే చెప్పాలి. అయినప్పటికీ.. వీరే తురుపుముక్కలుగా మారుతున్నారు. ``రండి.. మనమంతా ఒక్కటి.. కలిసి పనిచేద్దాం..`` అంటూ.. తాజాగా వీరి ఫోన్లకు మెసేజ్‌లకు వెళ్తున్నాయి.
ఇదంతా చేస్తోంది.. ఏపీ కాంగ్రెస్ పార్టీ కురువృద్ధ నేతలు. ప్రాంతాల వారిగా.. పాత కాపులను పార్టీ బాట పట్టించేందుకు తాజాగా ఏపీ నేతలు చేస్తున్న ప్రయత్నం ఇది. వీరిలో ఇప్పటికే కాంగ్రెస్ కు ఒకసారి చీఫ్ గా చేసిన రఘువీరారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. తనకు తెలిసిన వారిని ఆయన పార్టీ వైపు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మహిళా నాయకులు సహాఅనేక మందికి ఆయన ఫోన్లు చేసినట్టు తాజాగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ముఖ్యంగా కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకున్న ఒకనాటి నాయకురాలు, ప్రస్తుతం టీడీపీలో ఉన్న పనబాక లక్ష్మికి వర్తమానం అందింది. అదేవిధంగా ఎక్కడున్నారో..ఏం చేస్తున్నారో తెలియని కనుమూరి బాపిరాజును కూడా రఘువీరా వెతికి మరీ పట్టుకున్నారట. ఇక, సుబ్బిరామిరెడ్డి పార్టీలోనే ఉన్నానని చెబుతున్నా.. ఆయన జాడ కూడా .. నాలుగేళ్లుగా కనిపించడం లేదు. అయితే.. ఇప్పుడు ఆయనను తెరమీదకు తెచ్చి.. ఉత్తరాంధ్రలో వినియోగించుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
అదేవిధంగా గుంటూరుకు చెందిన గాదె వెంకట రెడ్డి కుటుంబాన్ని.. నేరుగా షర్మిల కలుసుకోనున్నట్టు తెలిసింది. తద్వారా.. పాత కాపులను తీసుకువచ్చి.. యాక్టివ్ చేయాలని.. వారికి లేదా వారి వారసులకు టికెట్ ఇవ్వాలని ప్రాధమికంగా నిర్ణయించారు. దీంతో ఇప్పుడు నేతలను వెతికే పనిని రఘువీరారెడ్డి సహా కేవీపీవంటి నాయకులు తమ భుజాన వేసుకున్నట్టు తెలిసింది. ఈ జాబితాలో డీఎల్ రవీంద్రారెడ్డి కూడా ఉన్నారని తెలుస్తోంది. అదేవిధంగా ఇతర నాయకులను కూడా పిలుస్తున్నారు. మరి వీరు వచ్చినా.. ప్రజలు ఏమేరకు వారికి రెడ్ కార్పెట్ పరుస్తారు? అనేది చూడాలి.