ఏపీలో దాడులపై షర్మిళ రియాక్షన్... నెటిజన్స్ కామెంట్స్ వైరల్!

ఇందులో భాగంగా... రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందిని వైఎస్ షర్మిళ రాసుకొచ్చారు.

Update: 2024-06-09 08:15 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం దాడుల ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. ఏపీలో పలు ప్రాంతాల్లో తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా... వైసీపీ నేతల ఇళ్లపై దాడులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే... ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయడంపై షర్మిళ స్పందించడం వైరల్ గా మారింది.

అవును... ఏపీలో వరుస దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలను అటు వైసీపీ అధినేత జగన్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఎవరు కవ్వింపు చర్యలు పాల్పడినా ఘర్షణలకు తెగించకుండా సంయమనం పాటించాలని కార్యకర్తలను కోరుతున్నారు. పలువురు టీడీపీ నేతలు కూడా ఈ తరహా ఘటనలు జరగడం దురదృష్టకరం అని అంటున్నారు.

ఈ సమయంలో ఏపీలో వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేయడం, పెట్రోల్ పోసి అంటించడం మొదలైన ఘటనలపై వైఎస్ షర్మిళ స్పందించారు. ఈ మేరకు ఒక భారీ ట్వీటే చేశారు! ఇందులో భాగంగా... రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందిని వైఎస్ షర్మిళ రాసుకొచ్చారు.

ఇదే సమయంలో... ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం అని, మిక్కిలి శోచనీయం అని చెప్పిన షర్మిళ... ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందేనని అన్నారు. ఇక, ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి కాదని అభివర్ణించిన ఆమె... తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు అని చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో... తెలుగు ప్రజల హృదయాల్లో వైఎస్సార్ ఒక చెరపలేని జ్ఞాపకం అని తన "ఎక్స్"లో రాసుకొచ్చిన షర్మిళ... అలాంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదని అన్నారు. ఇదే సమయంలో ఆయనకు గెలుపు ఓటములు ఆపాదించడం తగదని తెలిపారు. వైఎస్సార్ ను అవమాయించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని చెప్పుకొచ్చారు.

దీంతో.. వైఎస్ షర్మిళకు ఇప్పటికైనా తత్వం బదపడిందా అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇదే సమయంలో ఆ మాటకు అర్థాన్ని వెతికేపనిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు!

Tags:    

Similar News