చాంపియన్స్ ట్రోఫీ నెగ్గడమే కాదు.. భారత్ పైనా నెగ్గాలి.. పాక్ ప్రధాని!
భారత్-పాక్ మ్యాచ్ అంటే సాధారణ ప్రజలకే కాదు.. ప్రధానులకూ క్రేజే.. రెండు జట్లు తలపడే సందర్భంలో అవకాశం ఉంటే ప్రధానులు కూడా వీక్షించారు.
భారత్-పాక్ మ్యాచ్ అంటే సాధారణ ప్రజలకే కాదు.. ప్రధానులకూ క్రేజే.. రెండు జట్లు తలపడే సందర్భంలో అవకాశం ఉంటే ప్రధానులు కూడా వీక్షించారు. దేశాధినేతలను కూడా కదిలించేంత సామర్థ్యం ఒక్క భారత్-పాక్ క్రికెట్ పోటీకే ఉందంటే నమ్మాల్సిందే మరి.. అయితే, ఈ రెండు జట్ల మధ్య తరచూ మ్యాచ్ లు జరిగితే ఇంత తీవ్రత ఉండదేమో..? ఉద్రిక్తతలు, ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో ఐసీసీ టోర్నీలు తప్ప నేరుగా మ్యాచ్ లు జరగడం అరుదైపోయింది.
ఫిబ్రవరి 23.. ఈ ఏడాదిలో అతిపెద్ద మ్యాచ్ ఇదేనేమో..? చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య ఈ నెల 23న మ్యాచ్ జరగనుంది. టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నా, ఆ దేశంలో భద్రతా కారణాల రీత్యా టీమ్ ఇండియా పర్యటించడం లేదు. మధ్యే మార్గంగా ఎట్టకేలకు దుబాయ్ లో భారత్ ఆడే మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు.
భారత్-పాక్ ఉన్న గ్రూప్ లోనే న్యూజిలాండ్, బంగ్లాదేశ్ కూడా ఉన్నాయి. మరో గ్రూప్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్థాన్ ఉన్నాయి. ఈ గ్రూప్ తో పోలిస్తే భారత్-పాక్ ఉన్న గ్రూపే కాస్త తేలికగా అనిపిస్తోంది.
ఫిబ్రవరి 19న ఆతిథ్య పాకిస్థాన్- న్యూజిలాండ్ మధ్యన తొలి మ్యాచ్ కరాచీలో జరగనుంది. భారత్ తన తొలి మ్యాచ్ ను ఈ నెల 20న దుబాయ్ లో బంగ్లాదేశ్ తో ఆడనుంది. అంటే.. ఈ రెండు జట్లు టోర్నీలో రెండో మ్యాచ్ లో తలపడుతున్నాయన్నమాట.
ఇప్పటికే భారత్ చేతిలో అనేక సార్లు ఐసీసీ ఈవెంట్లలో పాకిస్థాన్ ఓడిపోయింది. వన్డే ప్రపంచ కప్ లో అయితే ఇంతవరకు గెలవనే లేదు. కానీ, 2017లో చివరిసారిగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ మధ్యనే ఫైనల్ జరిగింది. దీంట్లో భారత్ కు పాక్ షాకిచ్చి కప్ ఎగరేసుకుపోయింది.
ఆ మ్యాచ్ తర్వాత అంటే దాదాపు 8 ఏళ్లుగా మళ్లీ చాంపియన్స్ ట్రోఫీ జరగలేదు. ఇప్పుడు పాకిస్థానే డిఫెండింగ్ చాంపియన్ అన్నమాట. భారత్ ఆడే మ్యాచ్ లు తప్ప మిగతావన్నీ సొంతగడ్డపైనే నిర్వహిస్తూ ఆతిథ్య జట్టు హోదా కూడా దక్కించుకుంది. పైగా భారత్ తమ దేశానికి వచ్చేందుకు నిరాకరించడం వారికి తలకొట్టేసినట్లయింది. 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ కోసం తాము భారత్ కు వెళ్లగా.. తమ దేశానికి మాత్ర ఆ జట్టు రాకపోవడంతో పాక్ రగిలిపోతోంది. అందుకేనేమో..? చాంపియన్స్ ట్రోఫీ నెగ్గడమే కాదు.. భారత్ పైనా నెగ్గాలి అంటూ పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తమ జట్టుకు పిలుపునిచ్చారు. దుబాయ్ లో భారత్ ను ఓడించడమే కర్తవ్యం కావాలని.. దేశమంతా మీ వెనుక ఉందని ధైర్యం చెప్పారు.