బంగ్లాదేశ్‌ చిచ్చు.. ఆ దేశం పనేనా?

చివరకు భారత్‌ కు మిత్రురాలైన షేక్‌ హసీనా రాజీనామా చేసే వరకు ఆందోళనకారులు తమ నిరసనలను వదిలిపెట్టలేదు.

Update: 2024-08-12 20:30 GMT

భారత్‌ పొరుగు దేశం, మనదేశంతో అత్యధికంగా సరిహద్దులు పంచుకుంటున్న దేశం.. బంగ్లాదేశ్‌ లో గత కొన్ని రోజులుగా పరిస్థితులు విషమించిన సంగతి తెలిసిందే. 1971లో బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ షేక్‌ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చారు. వీరికి ప్రతిపక్షాలు మద్దతు పలకడంతో పరిస్థితి విషమించింది. చివరకు భారత్‌ కు మిత్రురాలైన షేక్‌ హసీనా రాజీనామా చేసే వరకు ఆందోళనకారులు తమ నిరసనలను వదిలిపెట్టలేదు.

కాగా తాను పదవీచ్యుతిరాలిని అవ్వడం వెనుక అమెరికా హస్తముందని షేక్‌ హసీనా ఆరోపించారు. ప్రధాని పదవికి రాజీనామా చేశాక ఆమె ఆశ్రయం కోసం భారత్‌ కు వచ్చారు. ఈ సందర్భంగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమెరికా కోరినట్టు బంగ్లాదేశ్‌ లోని సెయింట్‌ మార్టిన్స్‌ ద్వీపాన్ని ఆ దేశానికి అప్పగించి ఉంటే తన జోలికి వచ్చేది కాదని షేక్‌ హసీనా పేర్కొన్నారు. అమెరికా తన నౌకా స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆ ద్వీపాన్ని కోరిందని హసీనా బాంబుపేల్చారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఈ ప్రతిపాదన పెట్టారన్నారు. తాను అమెరికాకు ఆ దీవిని అప్పగించడానికి ఒప్పుకుంటే తనను ఎన్నికల్లో గెలిపిస్తామని.. అండగా నిలబడతామని అమెరికా ఆఫర్‌ ఇచ్చిందని హసీనా బాంబుపేల్చారు.

అయితే తాను అమెరికా ప్రతిపాదనకు ఒప్పుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో హసీనా వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారడంతో అసలు సెయింట్‌ మార్టిన్స్‌ ద్వీపం ఎక్కడ ఉంది? అందులో ఏముంది? అమెరికా ఆ ద్వీపాన్ని ఎందుకు అడిగింది వంటివి హాట్‌ టాపిక్‌ గా మారాయి.

బంగాళాఖాతంలోని ఈశాన్య భాగంలో దాదాపు మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సెయింట్‌ మార్టిన్స్‌ ఐలాండ్‌ ఉంది. ఇది ఒక పగడపు దీవి అని చెబుతున్నారు. బంగ్లాదేశ్‌ దక్షిణ కొనలో ఉన్న కాక్స్‌ బజార్‌ కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ ద్వీపం ఉంది. స్థానికులు దీనిని నారీకేళ్‌ జింజిరా, కోకోనట్‌ ఐలాండ్‌ అని కూడా పిలుస్తుంటారు.

సెయింట్‌ మార్టిన్స్‌ ఐలాండ్‌ లో ఉంటున్న ప్రజల సంఖ్య 3700 మంది. వీరికి చేపల వేట, కొబ్బరి సాగు ప్రధాన వృత్తిగా ఉన్నాయి. ముఖ్యంగా సీవీడ్‌ సాగుకు ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ సీవీడ్‌ ను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.

కాగా తొలిసారి సెయింట్‌ మార్టిన్స్‌ ఐలాండ్‌ లో అరబ్‌ వ్యాపారులు 18వ శతాబ్దంలో స్థిరపడ్డారు. 1900ల్లో భారతదేశాన్ని తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్న బ్రిటిషర్లు సెయింట్‌ మార్టిన్స్‌ ఐలాండ్‌ ను ఆక్రమించారు. దానికి సెయింట్‌ మార్టిన్‌ అనే పేరును కూడా వారే పెట్టారు.

1947లో భారత్‌ కు స్వాతంత్య్రం వచ్చాక సెయింట్‌ మార్టిన్స్‌ ఐలాండ్‌ తూర్పు పాకిస్థాన్‌ లో చేరింది. బంగ్లాదేశ్‌ ఏర్పడ్డాక ఆ దీవిపై దానికే అధికారాలు దఖలు పడ్డాయి. మరోవైపు మొదట్లో ఆ దీవులపై బంగ్లా సౌర్వభౌమాధికారాన్ని గుర్తించిన మయనార్మ్‌ ఆ తర్వాత ప్లేటు ఫిరాయించింది. తరచూ ఈ ద్వీపం కోసం బంగ్లాదేశ్‌ తో గొడవ పడుతూ వస్తోంది.

మరోవైపు మయన్మార్‌ లోనూ ఎన్నో ఏళ్లుగా సైన్యం పాలన నడుస్తోంది. సైన్యం అరాచకాలు తట్టుకోలేక ఎన్నో లక్షల మంది రోహింగ్యాలు భారత్, బంగ్లాదేశ్‌ లకు వలస వచ్చారు. ఈ క్రమంలో రోహింగ్యాలకు మద్దతుగా నిలిచే అరకాన్‌ ఆర్మీ.. సెయింట్‌ మార్టిన్స్‌ ద్వీపంపై కన్నేసింది. అంతేకాకుండా దానిపై తమకే హక్కు ఉందని ప్రకటించింది. ఈ ప్రకటనను బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తోసిపుచ్చింది, అంతేకాకుండా తన నౌకా దళాన్ని ఆ ద్వీపంలో మోహరించింది.

సెయింట్‌ మార్టిన్స్‌ ద్వీపం వివిధ దేశాల మధ్య వ్యూహాత్మకంగా కీలకమైన స్థానంలో ఉండటంతో అమెరికా కన్ను దీనిపైన పడింది. ఈ ద్వీపాన్ని తమకు ఇవ్వాలని బంగ్లాదేశ్‌ ను కోరుతోంది. అయితే బంగ్లాదేశ్‌ ఇందుకు ఒప్పుకోలేదు.

బంగ్లాదేశ్‌ సెయింట్‌ మార్టిన్స్‌ ద్వీపాన్ని అమెరికాకు అప్పగిస్తే అక్కడ నౌకా దళ స్థావరాన్ని ఏర్పాటు చయాలని ఆ దేశం భావిస్తోంది. ముఖ్యంగా ఈ నౌకాదళ స్థావరం ద్వారా ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన మలక్కా జలసంధిపై పట్టు లభిస్తుందని అమెరికా భావిస్తోంది. ముఖ్యంగా చైనా, దాని మిత్రదేశం మయన్మార్‌ కదలికలను నౌకా దళ స్థావరం ద్వారా గమనించొచ్చు అమెరికా తలపోస్తోంది.

Tags:    

Similar News