'పుష్ప-2' పార్టీలో వైసీపీ నేత జాయిన్... ఇండస్ట్రీ హిట్ అంటూ కామెంట్స్!
ఇలా అల్లు అర్జున్ తో పాటు నంద్యాల వైసీపీ నేత శిల్పా రవిచంద్ర శేఖర్ రెడ్డి కూడా సినిమాకి వెళ్లడం ఆసక్తిగా మారింది.
"పుష్ప-2" సినిమా సందడితో సినిమాహాళ్లు అన్నీ నిండిపోతున్న సంగతి తెలిసిందే. థియేటర్ల దగ్గర భారీగా కటౌట్లు, ఫ్యాన్స్ హంగామాకు తోడు ఈసారి బన్నీ సినిమాకు కొన్ని చోట్ల వైసీపీ నేతల హడావిడి కూడా మొదలవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా సంధ్య థియేటర్ లో ప్రీమియర్ చూసిన వైసీపీ నేత వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
అవును... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప-2" సినిమా సందడి మొదలైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ ప్రీమియర్ షో చూడటానికి వెళ్లిన సంగతీ తెలిసిందే. ఇదే సమయంలో శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి కూడా ఆ సినిమా చూడటానికి వెళ్లారు!
ఇలా అల్లు అర్జున్ తో పాటు నంద్యాల వైసీపీ నేత శిల్పా రవిచంద్ర శేఖర్ రెడ్డి కూడా సినిమాకి వెళ్లడం ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో.. రవిచంద్రారెడ్డి సినిమా చూసి బయటకు వచ్చిన అనంతరం స్పందించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలపై స్పందించిన ఆయన... పుష్ప-2 సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ ఉందని అన్నారు.
ఈ సందర్భంగా పుష్ప-2 సినిమా చాలా బాగుందని.. అంతా కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని.. అందరికీ కచ్చితంగా నచ్చుతుందని.. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న నమ్మకం తనకు ఉందని శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి అన్నారు. సినిమాలో జాతర సీన్ చాలా బాగా నచ్చిందని.. ఈ సీన్ అందరికీ గుర్తుండిపోతుందని తెలిపారు.
దీంతో... ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇప్పటికే సినిమా - రాజకీయాన్ని కలగలిపి రగులుతున్న మంటలకు ఈ ఎపిసోడ్ మరింత ఆజ్యం పోసే అవకాశం ఉందనే కామెంట్లు నెట్టింట వినిపిస్తున్నాయి.
కాగా... ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి - అల్లు అర్జున్ కు మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో నంద్యాలలో శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
దీంతో... అటు అల్లు అర్జున్, ఇటు శిల్పా రవిలపై పోలీస్ కేసు నమోదవ్వగా.. దాన్ని హైకోర్టు ఇటీవల క్వాష్ చేసింది! ఈ వ్యవహారంపై నెట్టింట తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బన్నీతో పాటు సంధ్య థియేటర్ లో ప్రీమియర్ చూసిన శిల్పా రవి... "పుష్ప-2" బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అవుతుందని చెప్పడం ఆసక్తిగా మారింది.