రాహుల్ నాలుక కోస్తే రూ.11 లక్షలిస్తా.. శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

రాహుల్‌గాంధీ తన వ్యాఖ్యలతో ప్రజలకు పెద్ద ద్రోహం చేశారని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అభిప్రాయడపడ్డారు.

Update: 2024-09-16 11:16 GMT

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ రెగ్యులర్‌గా ప్రవాస భారతీయులతో పలు సమావేశాలు నిర్వహించారు. పలు డిబేట్లలోనూ పాల్గొన్నారు. చాలా వరకు కేంద్ర ప్రభుత్వం, మోడీ మీద ఆయన విమర్శలు సంధించారు. అదే సందర్భంలో ఓ డిబేట్‌లో పాల్గొన్న ఆయన రిజర్వేషన్లపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తాజాగా మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. రాహుల్‌గాంధీ తన వ్యాఖ్యలతో ప్రజలకు పెద్ద ద్రోహం చేశారని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అభిప్రాయడపడ్డారు. మరాఠాలు, ధన్‌గర్లు, ఓబీసీలు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాయని.. కానీ రాహుల్ గాంధీ వారి పోరాటానికి అన్యాయం జరిగేలా వ్యాఖ్యలు చేశారని అన్నారు. రిజర్వేషన్ ప్రయోజనాలను అంతం చేయడమే లక్ష్యం అన్నట్లు రాహుల్ మాట్లాడారని ఆరోపించారు. దేశాన్ని 400 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని అన్నారు.

దాంతో ఆగకుండా.. రిజర్వేషన్లపై మాట్లాడిన రాహుల్‌గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికా పర్యటనలో రిజర్వేషన్లను అంతం చేయడం గురించి రాహుల్ గాంధీ మాట్లాడారని, ఆయన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారని అర్థమైంది. అందుకే.. రాహుల్ గాంధీ నాలుకను కోసే ఎవరికైనా ఈ రివార్డు ఇస్తా అని ప్రకటించారు. దీంతో ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు పెను దుమారం రేగింది.

Tags:    

Similar News