విరిగిన సీట్లో కూర్చోబెడుతారా? ఎయిర్ ఇండియాపై కేంద్రమంత్రి ఆగ్రహం
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా తనకు కలిగిన అసౌకర్యంపై నిలదీశారు. ఎయిర్ ఇండియా సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా తనకు కలిగిన అసౌకర్యంపై నిలదీశారు. ఎయిర్ ఇండియా సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భోపాల్ నుంచి ఢిల్లీకి విమానంలో ప్రయాణించే సమయంలో తనకు విరిగిపోయిన సీటును కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించకుండా, విరిగిన సీట్లు కేటాయించడం మోసమేనని విమర్శించారు.
- విమాన ప్రయాణంలో అసౌకర్యం
కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎయిర్ ఇండియా విమానంలో ఎక్కిన వెంటనే తాను బుక్ చేసుకున్న సీటు విరిగి ఉందని గుర్తించారు. సిబ్బందిని ప్రశ్నించగా, యాజమాన్యం ఈ సీటును విక్రయించకూడదని ఆలస్యంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. అంతేకాకుండా విమానంలో మరికొన్ని సీట్ల పరిస్థితి కూడా ఇలాగే ఉందని సిబ్బంది వెల్లడించారు. అయితే, తోటి ప్రయాణికులు తమ సీట్లలో కూర్చోవాలని ఆఫర్ చేసినా, వారికి అసౌకర్యం కలిగించకూడదనే ఉద్దేశంతో తాను విరిగిన సీటులోనే గంటన్నర ప్రయాణించానని కేంద్రమంత్రి తెలిపారు.
- ఎయిర్ ఇండియాపై విమర్శలు
ప్రయాణికుల నుండి పూర్తి ఛార్జీలు వసూలు చేసి, అసౌకర్యమైన సీట్లు కేటాయించడం సరైన విధానం కాదని కేంద్రమంత్రి మండిపడ్డారు. ఎయిర్ ఇండియా నిర్వహణను టాటా గ్రూప్ తీసుకున్న తర్వాత సేవలు మెరుగుపడతాయని భావించినప్పటికీ, ఇది అపోహగానే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అయినా ఎయిర్ ఇండియా ప్రయాణికుల కోసం తగిన చర్యలు తీసుకుంటుందా, లేక వ్యాపార లాభాల కోసమే పరిమితం అవుతుందా అని ప్రశ్నించారు.
- ఎయిర్ ఇండియా స్పందన
కేంద్రమంత్రికి కలిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా క్షమాపణలు చెప్పింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని సంస్థ ప్రకటించింది.
- ఎయిర్ ఇండియా చరిత్ర ఇదీ
1932లో టాటా గ్రూప్ టాటా ఎయిర్ సర్వీసెస్ పేరుతో ఎయిర్ ఇండియాను స్థాపించింది. అయితే, స్వాతంత్య్రం వచ్చాక 1953లో ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ సంస్థను జాతీయీకరించారు. 69 సంవత్సరాల పాటు ప్రభుత్వ యాజమాన్యంలో కొనసాగిన ఎయిర్ ఇండియా 2022లో మళ్లీ టాటా గ్రూప్‌కు అధికారికంగా అప్పగించబడింది. అయితే, ఈ సంస్థ ఆధునీకరణలో ఇంకా కొన్ని సమస్యలు ఎదురవుతున్నట్లు తాజా సంఘటనలు సూచిస్తున్నాయి.
ఒకే కేంద్రమంత్రి స్వయంగా విమానయాన సంస్థపై విమర్శలు చేయడం, ప్రజలకు అందే సేవల నాణ్యతపై ప్రధానమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఎయిర్ ఇండియా ఈ అంశాన్ని ఎంతవరకు చక్కదిద్దుతుందో, ప్రయాణికుల విశ్వాసాన్ని ఎలా చూరగొంటుందో చేసుకుంటుందో చూడాలి.