కాక రేపుతున్న ‘లడ్డూ’.. జగన్‌ పై బాంబుపేల్చిన కేంద్ర మంత్రి!

తిరుమల ఏడుకొండలపై అన్య మతాల గుర్తులను ఏర్పాటు చేయాలని జగన్‌ అండ్‌ కో చూశారని శోభా కరంద్లాజే బాంబుపేల్చారు.

Update: 2024-09-20 09:47 GMT

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల నూనెలు, పంది కొవ్వు, తదితరాలు కలిపారంటూ సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా వాటిని పక్కదారి పట్టించడానికే వ్యూహాత్మకంగా టీడీపీ నేతలు లడ్డూ వివాదం రేపారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలంటూ ఏకంగా వైసీపీ హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం ముదిరింది.

ఓవైపు రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నేతలు లడ్డూ వ్యవహారంలో వివాదాన్ని పెంచుతున్న వేళ.. ఇందులోకి కేంద్ర మంత్రులు కూడా ఎంటర్‌ అయ్యారు. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి, కర్ణాటక బీజేపీ సీనియర్‌ నేత శోభా కరంద్లాజే సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలకు చెందిన కళాశాలల్లో పద్మావతీ దేవి, శ్రీనివాసుడి ఫొటోలను తొలగించాలని జగన్‌ ప్రభుత్వం చూసిందని ఆమె హాట్‌ కామెంట్స్‌ చేశారు.

తిరుమల ఏడుకొండలపై అన్య మతాల గుర్తులను ఏర్పాటు చేయాలని జగన్‌ అండ్‌ కో చూశారని శోభా కరంద్లాజే బాంబుపేల్చారు. అంతేకాకుండా హిందువులు కానివారిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డ్‌ ఛైర్మన్‌గా నియమించారని మండిపడ్డారు. జంతువుల కొవ్వులను పవిత్ర ప్రసాదంలో కలిపిందని దుమ్మెత్తిపోశారు. వెంకటేశ్వర స్వామీ.. మా చుట్టూ జరుగుతున్న ఈ హిందూ వ్యతిరేక రాజకీయాలకు తమను క్షమించాలని ఎక్స్‌ వేదికగా జగన్‌ అండ్‌ కోపై శోభా మండిపడ్డారు.

శోభాతోపాటు కేంద్ర ఆహారశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి కూడా తిరుమల లడ్డూ వ్యవహారంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన అంశం చాలా తీవ్రమైందన్నారు. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి.. దోషులుగా తేలిన వారిని శిక్షించాలన్నారు.

మరోవైపు లడ్డూ వ్యవహారం కాక రేపుతుండటంతో ఈ వ్యవహారం కేంద్ర హోం శాఖ అమిత్‌ షా దృష్టికి కూడా వెళ్లిందని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆయన ఈ వ్యవహారంపై ఆరా తీశారని నివేదించాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని తన కార్యాలయ వర్గాలకు సూచించారని వెల్లడించాయి.

మరోవైపు తమ హయాంలో ఏ తప్పూ జరగలేదని వైసీపీ నేతలు అంటున్నారు. తిరుమలలో దేవుడి ముందు ప్రమాణం కూడా చేస్తామని చెబుతున్నారు. తమ తప్పు ఉంటే తమతో సహా తమ కుటుంబాలు నాశనం అవుతాయని.. లేదంటే చంద్రబాబు కుటుంబంతో సహా నాశనమవుతారని వైసీపీ రాజ్యసభ ఎంపీ, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ బిగ్‌ స్టెప్‌ వేసింది. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ జరపాలని విన్నవించింది.

Tags:    

Similar News