కువైట్ లో విషాదం.. భారతీయ కుటుంబం సజీవ దహనం!
ఇటీవల కాలంలో బ్రతుకు దెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి నానా రకాల ఇబ్బందులు పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇటీవల కాలంలో బ్రతుకు దెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి నానా రకాల ఇబ్బందులు పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలకు సంబంధించి పలు ఘటనలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా కువైట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ భారతీయ కుటుంబం సజీవదహనం అయ్యింది!
అవును... గల్ఫ్ దేశం కువైట్ లో తాజాగా మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ భారతీయ కుటుంబం సజీవదహనం అయినట్లు అక్కడి అధికారులు తాజాగా వెల్లడించారు. శుక్రవారం (జూలై 19) రాత్రి కువైట్ లోని అబ్బాసియా ప్రాంతంలోని ఓ ఫ్లాట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... కేరళకు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు కువైట్ లోని అబ్బాసియా ప్రాంతంలో ఓ ఫ్లాట్ లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ కుటుంబంలోని భార్యభర్తలు, ఇద్దరు పిల్లలు రాత్రి 9 గంటలకు నిద్రపోయిన తర్వాత ఇంట్లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయని తెలుస్తుంది.
దీంతో... సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికే ఆ కుటుంబం మంటల్లో సజీవదహనం అయ్యిందని అంటున్నారు. మృతిచెందినవారిని మాథ్యూ ములక్కల్ (40), భార్య లిని అబ్రహాం (38), కుమార్తె ఇరిన్ (14), కుమారుడు ఇస్సాక్ (9)గా గుర్తించారని తెలుస్తోంది. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అయితే... ఇంట్లో ఏసీ పవర్ ఫెయిల్యూర్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు! ఆ సమయంలో వెలువడిన విషపూరిత వాయువును వారు పీల్చుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాగా... గత నెలలో ఓ అపార్ట్ మెంట్ లో భారీగా మంటలు చెలరేగి సుమారు 49 మంది మరణించగా.. అందులో 45 మంది భారతీయులేనని అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. అందులో ఇద్దరు తెలుగువారు కూడా ఉండగా.. ఎక్కువమంది తమిళనాడు, కేరళకు చెందినవారే ఉన్నట్లు పేర్కొన్నారు.