జంగారెడ్డి గూడెంలో షాకింగ్ సీన్.. ప్రేమ జంటకు పెళ్లి చేశారని..!
దాదాపు యాభై మంది వరకు ఒక ఇంటి మీద దాడికి దిగటం.. విచక్షణరహితంగా కనిపించిన వారిని కనిపించినట్లు కొట్టేయటంతో భయాందోళనలు చోటు చేసుకున్నాయి.
ప్రేమజంటకు పెళ్లి చేయటం.. తమ ఇంట్లో ఆశ్రయం ఇవ్వటం ఒక కుటుంబానికి శాపంగా మారింది. సినిమాల్లో మాదిరి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైనం షాకింగ్ గా మారింది. జంగారెడ్డిగూడెంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. దాదాపు యాభై మంది వరకు ఒక ఇంటి మీద దాడికి దిగటం.. విచక్షణరహితంగా కనిపించిన వారిని కనిపించినట్లు కొట్టేయటంతో భయాందోళనలు చోటు చేసుకున్నాయి. అసలేం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే..
జంగారెడ్డి గూడెం మండలం అక్కంపేటకు చెందిన యువతి.. యువకుడు ప్రేమించుకున్నారు. ఇటీవల లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ పెళ్లి ఇరు కుటుంబాలకు ఇష్టం లేదు. దీంతో.. ఈ జంట ఊరిని వదిలేసి జంగారెడ్డి గూడెంలోని ఒకరింట్లో ఆశ్రయం ఉంటున్నారు. తమకు ఇష్టం లేని పెళ్లి చేయటమే కాదు.. ఆ ప్రేమ జంటకు ఆశ్రయం ఇస్తారా? అన్న కోపంతో వారి బంధువు అయిన రాజు ఇంటిపైకి దాడి చేశారు యువతి తరఫు వారు.
ఇంట్లోని సామాగ్రిని ధ్వంసం చేయటమే కాదు.. ఇష్టారాజ్యంగా దాడికి పాల్పడ్డారు. అంతేకాదు.. వీరి దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన వ్యక్తి మీద పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేయగా.. స్థానికులు అడ్డుకోవటంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పించిది. దాడి చేసిన వారిలో అక్కంపేట సర్పంచి పారేపల్లి నాగేంద్ర.. నాగరాజు.. శ్రీను.. విజయ్.. నాగబాబుతో పాటు మరో యాభై మంది వరకు ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ దాడిలో గాయపడిన రాజు (ప్రేమ జంటకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి) తల్లి.. మేనత్తలను జంగారెడ్డి గూడెం ఆసుపత్రికి తరలించి.. చికిత్స చేస్తున్నారు. దాడి గురించి సమాచారం తెలుసుకున్న ప్రేమజంట విరక్తితో పురుగుల మందు తాగి సూసైడ్ కు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావటంతో.. వారిని అడ్డుకొన్నారు. ప్రస్తుతం వారిద్దరూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు. ఏమైనా.. ఇష్టం లేని పెళ్లి చేయించారన్న కోపంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.