షాకింగ్ నినాదాలు : సీఎం లోకేష్ సీఎం లోకేష్...
అయితే.. ఆయన సభ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే చిత్రమైన ఘటన చోటు చేసుకుంది.
టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో యువగళం పాదయాత్ర సందర్భంగా ఆయన మిస్ చేసిన ప్రాంతాలు, నియోజకవర్గాల్లో శంఖారావం పేరిట రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తు న్నారు. పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖపట్నం జిల్లాలోని కీలకమైన పెందుర్తి(టీడీపీ ఇక్కడ నుంచి పోటీ చేస్తుందని.. గతంలో ప్రకటించారు) నియోజకవర్గంలో నారా లోకేష్ పాల్గొన్నారు. అయితే.. ఆయన సభ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే చిత్రమైన ఘటన చోటు చేసుకుంది.
''నారా లోకేష్ సీఎం.. సీఎం'' అంటూ కార్యకర్తలు కొందరు బిగ్గరగా అరుచుకుంటూ..నారా లోకేష్ వైపు దూసుకువచ్చే ప్రయ త్నం చేశారు. ఈ హఠాత్పరిణామంతో పార్టీ సీనియర్లు విస్తుబోయారు. వాస్తవానికి ఇలాంటి వ్యాఖ్యలు.. గతంలో యువగళం లోనూ వినిపించాయి. కానీ, అప్పట్లోనే ఇలాంటివి చేయొద్దని పార్టీ నుంచి ఆదేశాలు వెల్లఢంతో క్షేత్రస్థాయి నాయకులు కార్యక ర్తలను కట్టడి చేశారు. అయితే.. తాజాగా పెందుర్తిలో మాత్రం మరోసారి నారా లోకేష్ సీఎం అంటూ కామెంట్లు వినిపించడంతో నాయకులు అలెర్టయి.. కార్యకర్తలను వారించారు.
జగన్ మూడు ముక్కలాట!
పెందుర్తి సభలో నారా లోకేష్ మాట్లాడుతూ.. రాజధాని విషయంలో సీఎం జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని.. కానీ, ప్రజలు ఈ ఆటలో జగన్ ఓడించడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రాను మూడు కుటుంబాలు(బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి) అవినీతి మయంగా మార్చాయని వ్యాఖ్యానించారు. వీళ్లంతా ఎక్కడ భూములు దొరికినా, గనులు దొరికినా దోచేస్తారని అన్నారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ విశాఖను ఊడబొడుస్తామని అనేక హామీలు గుప్పించిందని.. అయినా.. ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇంతవరకు ఈ పని కూడా జగన్ చేయలేదని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే విశాఖను ఐటీ రాజధానిగా మార్చుతామన్నారు. పోయిన కంపెనీలను తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.