మరోసారి నోరు జారిన సిద్దరామయ్య

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న అధినేతల నోటి నుంచి వచ్చే మాటలు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది కదా? ప్రతిపక్షాలు ఎంత రెచ్చగొడితే మాత్రం రెచ్చిపోవటంలో అర్థం లేదు.

Update: 2025-01-22 05:16 GMT

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న అధినేతల నోటి నుంచి వచ్చే మాటలు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది కదా? ప్రతిపక్షాలు ఎంత రెచ్చగొడితే మాత్రం రెచ్చిపోవటంలో అర్థం లేదు. ఈ విషయాన్ని తరచూ మిస్ అవుతున్నారు కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా పేరున్న సిద్ధూ.. పాలనతో ఇప్పటివరకు తనదైన మార్క్ వేయలేదనే చెప్పాలి. ఇటీవల కాలంలో కర్ణాటకలోచోటు చేసుకున్న నేరాలపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది.

ఈ నేరాలు.. ఘోరాలకు బాధ్యత వహించి రాష్ట్ర హోంమంత్రి జి. పరమేశ్వర రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ పై స్పందించిన సీఎం సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న వేళలో మహిళలపై దారుణాలు జరగలేదా? అంటూ ప్రశ్నించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గడిచిన కొద్ది రోజులుగా బెంగళూరు మహానగరంలో పలు దారుణ ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. గత వారం ఆరేళ్ల బాలిక దారుణహత్యకు గురి కాగా.. రెండు రోజుల క్రితం తన సోదరుడి ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం వెయిట్ చేస్తున్న మహిళపై ఇద్దరు గుర్తు తెలియని వారు హత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నప్పటికి.. వరుస పెట్టి జరుగుతున్న నేరాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వరుస పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలకు రాష్ట్ర హోం మంత్రి బాధ్యత వహించాలని విపక్షాలు పట్టు పడుతున్నాయి. ఇలంటి వేళ స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. బీజేపీ హయాంలో మహిళలపై దారుణాలు జరగలేదా? కేసులు నమోదు కాలేదా? మహిళలకు రక్షణ కల్పించాలి.. సమాజంలో జరిగే చెడు పట్ల కఠినంగా వ్యవహరిస్తామంటూ హోం మంత్రిని వెనకేసుకొచ్చిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News