సీఎం సిద్ధూ డైట్ పాఠాలు చదవాల్సిందే!

తాను 24 ఏళ్లుగా స్టంట్ వేసుకొని ఉన్నానని.. వైద్యుల సలహాల్ని పాటిస్తూ.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లుగా చెప్పుకొచ్చారు.

Update: 2024-10-25 08:30 GMT

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ప్రముఖుడు మాట్లాడటం మొదలు పెడితే.. రాజకీయం తప్పించి మరో అంశం ఉండదన్నట్లుగా ఇప్పటి రాజకీయం మారింది. అయితే.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంటి వారి పుణ్యమా అని.. ఈ తీరుకు భిన్నమైన పరిస్థితి అప్పుడప్పుడు నెలకొంటోంది. తాజాగా కర్ణాటకలో గృహ ఆరోగ్య పథకానని ప్రారంభించిన సందర్భంగా సిద్ధరామయ్య తన వ్యక్తిగత అనుభవాల్ని షేర్ చేసుకున్నారు. తాను 24 ఏళ్లుగా స్టంట్ వేసుకొని ఉన్నానని.. వైద్యుల సలహాల్ని పాటిస్తూ.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లుగా చెప్పుకొచ్చారు.

ఒత్తిడితో కూడిన జీవితంతో అనారోగ్యాలు వస్తుంటాయని.. కెమికిల్స్ వినియోగంతో వాడే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారని.. దీంతో సమస్యలు మరింత పెరుగుతున్నట్లుగా పేర్కొన్నారు. సాధారణంగా షుగర్ వ్యాధి ఉన్న వారు గుడ్లు.. చేపలు.. మాంసం తింటే పెరుగుతుందని చెబుతారని..కానీ అదంతా అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. సమతుల ఆహారం తీసుకోవటమే ముఖ్యమన్న ఆయన.. ముందుగా గుర్తిస్తే బీపీ.. షుగర్ లను విజయవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చన్నారు. అయితే.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ముఖ్యమని స్పష్టం చేశారు.

ఆరోగ్య సమస్యల్ని దాచి పెట్టటం మంచిది కాదన్న ఆయన.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లలేరని.. అలాంటి వారికి తాము చేపట్టిన గృహ ఆరోగ్య పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకం ద్వారా ప్రజలు తమ ఇంటి వద్దే వైద్య పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. ఆర్థిక కారణాలతో చాలామంది ఆరోగ్య పరీక్షలకు దూరంగా ఉంటారని.. దీని కారణంగా గుర్తించలేని వ్యాధులకు దారి తీస్తుందన్నారు. ముందుగా గుర్తించి చికిత్స అందిస్తే క్యాన్సర్ సైతం నయమవుతుందన్న ఆయన మాటలు ఆసక్తికరంగా మారాయి. తనకు షుగర్ ఉందని.. సరైన జాగ్రత్తలు తీసుకొని.. క్రమశిక్షణతో షుగర్ ను కంట్రోల్ చేస్తున్నట్లుగా చెప్పారు. రాజకీయం స్థానే.. అప్పుడప్పుడు ఇలాంటి మాటలు అధినేతలు మాట్లాడితే.. ప్రజలకు అవగాహనతో పాటు.. తాము సైతం ఎలా జీవించాలన్న దానిపై మరింత క్లారిటీ వస్తుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News