దక్షిణాది రాష్ట్రాల ఐక్య కూటమి: కన్నడ సీఎం పిలుపు రీజనేంటి?
కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్దరామయ్య సంచలన పిలుపునిచ్చారు.
కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్దరామయ్య సంచలన పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల పాలక పార్టీలు ఐక్యంగా కూటమి కట్టాల్సిన అవసరం ఉందని ఆయన తేల్చి చెప్పారు. ఐక్య వేదికగా ఏర్పడి.. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం లోని బీజేపీ కూటమి ప్రభుత్వం చేస్తున్నకుట్రలను సంయుక్తంగా ఎదుర్కొనాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో అవసరమైతే.. తానే ముందుండి పోరాడుతానని ప్రకటించారు. అంతేకాదు, ఐక్య కూటమికి తాను నాయకత్వం వహిస్తానని చెప్పారు. ఈ కూటమి వచ్చే ఆరుమాసాల్లో భేటీ అయి. కేంద్రం కుట్రలను తిప్పికొట్టాలన్నారు.
విషయం ఏంటి?
2026లో దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు స్థానాలను డీలిమిటేషన్ చేయనున్నారు. అంటే.. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను జనాభా ప్రాతిపదికన పెంచడమో.. తగ్గించడమో చేస్తారు. ఇది ప్రతి 15 లేదా 20 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. గతంలో 15 ఏళ్ల కిందట డీలిమిటేషన్ జరిగింది. దీంతో స్థానాలు పెరిగాయి. ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ ప్రక్రియకు కేంద్రంలోని మోడీ సర్కారు శ్రీకారం చుడుతోంది. ఇదే.. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో చర్చకు దారి తీసింది. ఏపీలో ఎలానూ ఎన్డీయే కూటమి సర్కారు ఉంది కాబట్టి.. దీనిపై పెద్దగా ఆందోళన లేదు.
కానీ, కర్ణాటక, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులో డీఎంకే, కేరళలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేసే అవకాశం ఉందని.. డీలిమిటేషన్‌ను అడ్డుపెట్టి స్థానాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నద ని వారి ఆందోళన. ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఆరోపణలు గుప్పించింది. ఇక, కేరళ కూడా.. ఇదే బాటలో నడుస్తోంది. తాజాగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా..ఇదే బాణీ వినిపించారు. ఈయన చెప్పిన లెక్కల ప్రకారం.. కర్ణాటకలో 28 ఎంపీ స్థానాలు ఉంటే.. వాటిని 26 కు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అంతేకాదు, ఏపీ-తెలంగాణలో 42 స్థానాలు ఉంటే.. వాటిని 34 కు, తమిళనాడులో 39 స్థానాలను 31కి, కేరళలో 20 స్థానాలను ఏకంగా 12 స్థానాలకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని సిద్దరామయ్య ఆరోపిస్తున్నారు. బీజేపీకి దక్షిణాదిలో ఓటు బ్యాంకు రాజకీయాలు కలిసి రాకపోవడంతో సంఖ్యనుతగ్గించి.. లాభ పడాలన్న ఉద్దేశం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇదేసమయం లో ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఎంపీ స్థానాలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కట్టుగా ఉండి.. డీలిమిటేషన్‌లో ఎంపీస్థానాల సంఖ్యను తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఐక్య వేదిక ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. మరి ఎన్ని రాష్ట్రాలు ఆయనతో కలిసి వస్తాయో చూడాలి. ఏపీ అయితే.. కలిసి రాకపోవచ్చు.