కేసుల వలలో సీఎం విలవిల... భూములు ఇచ్చేస్తామంటున్న భార్య!

రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయనకు పార్టీలోనూ, బయటా కూడా పోరు మొదలైన పరిస్థితి.

Update: 2024-10-01 04:50 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సరికొత్త సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి. ముడా భూముల స్కామ్ వ్యవహారంలో తాజాగా ఈడీ కూడా ఎంటరవ్వడంతో ఆయన విలవిల్లాడుతున్నారని అంటున్నారు. రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయనకు పార్టీలోనూ, బయటా కూడా పోరు మొదలైన పరిస్థితి.

దీంతో.. తనకు సొంత పార్టీలోనే శత్రువులున్నారని ఆయన బహిరంగానే వ్యాఖ్యానించారు. ఇలా రాజకీయంగా ఎంత పోటీ ఉన్నా, ఎన్ని సమస్యలున్నా తట్టుకునే సిద్ధరామయ్యకు తాజాగా ముడా భూముల విషయంలో అవినీతి మరక అంటింది. ఈ సమయంలో ఆయన భార్య కీలక నిర్ణయం వెల్లడించారు.

అవును... ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ముడా భూముల స్కామ్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. ఈ కేసులోకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంట్రీ ఇచ్చింది. దీంతో... సీఎం సిద్ధరామయ్యకు సమస్యలు తప్పవా అనే చర్చ తెరపైకి వచ్చింది.

మరోపక్క డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి పరమేశ్వర్ తో భేటీ అవ్వడం సంచలనంగా మారింది. ఈ సమయంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా... అవినీతి మరక లేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న 'ముడా'కు చెందిన భూములను తిరిగి అదే సంస్థకు ఇచ్చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా స్పందించిన సీఎం సతీమణి... తన భర్త సీఎం సిద్ధరామయ్య 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడకుండా జాగ్రత్తపడ్డారని.. ఆయన రాజకీయ, ప్రజా జీవితానికి ఎటువంటి సమస్యా రాకూడదని తాను ఇంటికే పరిమితమై జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాట్లు, ఆయనకు ఉన్న ప్రజాభిమానాన్ని చూసి సంతోషిస్తున్నట్లు తెలిపారు.

అయినప్పటికీ ముడాకు సంబంధించిన స్థలాల విషయంలో వచ్చిన ఆరోపణలు విని తాను తీవ్ర ఆవేదనకు లోనైనట్లు తెలిపారు. తమ అన్నయ్య పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఈ స్థలాలు ఇంత రాధాంతం చేస్తాయని ఊహించలేదని అన్నారు. ఈ సమయంలోనే... తన భర్త గౌరవం, ఘనతకు మించి ఈ ఆస్తులు పెద్దవి కాదని ఆమె స్పష్టం చేశారు.

అందుకే ఈ స్థలాలను తిరిగి ముడాకు అప్పగిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ విషయంలో తన భర్త అభిప్రాయం ఏమిటో తనకు తెలియదని.. కుటుంబ సభ్యులతో చర్చించకుండా తనను తాను తీసుకున్న నిర్ణయం ఇదని అమె అన్నారు. అవసరమైతే దర్యాప్తుకు సహకరిస్తామని తెలిపారు. మరి ఇప్పుడు ఈ వ్యవహారం ఎలా మారుతుందనేది చూడాలి!

Tags:    

Similar News