ఆంధ్రోళ్ల గురించి సీఎం సిద్ధరామయ్యకు తెలిసింది ఇదేనా?

కర్ణాటకలో నివసించే వారంతా కన్నడ భాషలోనే మాట్లాడాలని.. కన్నడ మీద ప్రేమను పెంచుకోవాలన్న ఆయన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Update: 2024-06-21 04:19 GMT
ఆంధ్రోళ్ల గురించి సీఎం సిద్ధరామయ్యకు తెలిసింది ఇదేనా?
  • whatsapp icon

ఏపీ ప్రజలు కేవలం తెలుగులోనే మాట్లాడతారు.. మనం కూడా మన స్థానిక భాషలోనే మాట్లాడాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వ్యాఖ్యలు చేశారు. అన్ని తెలుసు అన్నట్లుగా మాట్లాడిన ఆయనకు.. ఏపీ గురించి.. అందునా ఆంధ్రోళ్ల గురించి ఆయనకేం తెలీదని చెప్పాలి. కన్నడిగులు ఉదారవాదులుగా ఆయన అభివర్ణించటాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అదే సమయంలో.. ఏపీ ప్రజలు భాష విషయంలో ఉదారవాదులు కాదన్నట్లుగా మాట్లాటమే అభ్యంతరకరం. కర్ణాటకలో నివసించే వారంతా కన్నడ భాషలోనే మాట్లాడాలని.. కన్నడ మీద ప్రేమను పెంచుకోవాలన్న ఆయన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కన్నడం గురించి ఆయనేం మాట్లాడినా అది ఆయన ఇష్టం. కానీ.. ఆ సందర్భంలో ఇతర రాష్ట్రాల ప్రస్తావన తెచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. లేని ముద్రల్ని వేయకూడదు. మిగిలిన రాష్ట్రాల సంగతిని పక్కన పెడితే.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు తప్పించి మరేం మాట్లాడరని ఆయన చెబుతున్నారు. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఉండే లక్షలాది ఆంధ్రోళ్లు కన్నడ మాట్లాడతారన్న విషయాన్ని ఆయన ఎందుకు మిస్ అవుతున్నారు.

ఒకవేళ.. ఆంధ్రాలో నివసించే ఆంధ్రా ప్రజల గురించే సిద్దూ మాట్లాడి ఉంటే.. ఆయన తప్పుగా మాట్లాడినట్లే. ఆంధ్రప్రదేశ్ గురించి.. ఆంధ్రోళ్ల గురించి ఆయనకు ఏ మాత్రం అవగాహన లేదన్నది స్పష్టమవుతుంది. ఎందుకంటే.. ఏపీ విచిత్రమైన రాష్ట్రం. ఎందుకంటే ఏపీ రాష్ట్ర సరిహద్దులుగా.. పలు రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడు.. కర్ణాటక.. తెలంగాణ.. ఒడిశా.. చత్తీస్ గఢ్ లు ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్నే తీసుకుందాం. ఉదాహరణకు ఉమ్మడి చిత్తూరు జిల్లానే తీసుకుందాం. అందునా నగరి నియోజకవర్గానికి వెళ్లి.. అక్కడి ప్రజలతో మాట్లాడితే వారిలో అత్యధికులు తమిళంలోనే మాట్లాడతారు.తెలుగు తక్కువగా మాట్లాడతారు.

తిరుపతిలో కూడా తెలుగు ఎంతలా మాట్లాడతారో.. తమిళం అంతేలా మాట్లాడతారు. ఏపీకి మరో సరిహద్దు రాష్ట్రమైన కర్నాటక విషయానికే వద్దాం. దీనికి సరిహద్దుగా ఉండే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరుతో పాటు మరో సరిహద్దు జిల్లాగా ఉండే ఉమ్మడి అనంతపురంలోని వారిలో ఎక్కువమంది కన్నడ మాట్లాడతారు. రాష్ట్రానికి మరో సరిహద్దు అయిన ఒడిశా విషయానికి వస్తే.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఒరియాను ఇట్టే మాట్లాడేస్తుంటారు.

చివరకు విశాఖపట్నంలోనూ పలువురు ఒరియా మాట్లాడటం చూస్తుంటాం. ఇక.. తెలంగాణ సరిహద్దుగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో హిందీ మాట్లాడేందుకు పెద్దగా కష్టపడరు. ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని లక్షలాది మంది ఆంధ్రోళ్లు హిందీని మాట్లాడేస్తుంటారు. నిజానికి ఈ దేశంలో తమ అమ్మ భాష మీద పెద్దగా పట్టింపులు లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే.

అంతేనా.. తెలంగాణ ప్రజలకు తమ యాస మీద ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. ఏపీలో అది కూడా కనిపించదు. సీమలోని కొన్ని జిల్లాల వారు.. ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాలు.. గోదావరి జిల్లాల వారు తప్పించి.. మిగిలిన వారు తమ యాసను ఇట్టే మార్చేసుకోవటానికి సైతం వెనుకాడరు.

అమ్మభాష విషయంలో ఏ మాత్రం పట్టుదల లేని అపర ఉదారవాదులైన ఆంధ్రోళ్ల మీద కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎలా బ్రాండింగ్ చేస్తారు? అన్నది ప్రశ్న. నిజంగానే ఆంధ్రోళ్లకు అమ్మభాష మీద ఫీలింగ్ ఉంటే చెప్పుకోవటం తప్పేం కాదు. కానీ.. లేని దానిని ఉన్నట్లుగా ముద్ర వేయటం.. బ్రాండింగ్ చేయటం తప్పే అవుతుంది. బెంగళూరులో ఉండే లక్షలాది మంది ఆంధ్రోళ్లకు ఇది ఇబ్బందిగా ఉంటుంది. అందుకే.. కర్నాటక ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News