'స్నేహితుడా వీడ్కోలు'... రతన్ టాటా మరణంపై మాజీ ప్రేయసి పోస్ట్!

ఈ క్రమంలో... రతన్ టాటా మరణంపై ఆయన మాజీ ప్రేయసి పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

Update: 2024-10-10 05:39 GMT

ప్రేమ చాలా గొప్పగా ఉంటుందని అంటారు. అది ఫెయిల్ అయితే అది మరో వర్ణణాతీత జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెబుతుంటారు. ఇక ప్రేమించిన మనిషి 'శాస్వతంగా' దూరమయ్యారని తెలిస్తే.. ఆ బాధను వ్యక్తపరచడానికి దొరకని పదాల కోసం పరితపించిపోతారని అంటుంటారు. ఈ క్రమంలో... రతన్ టాటా మరణంపై ఆయన మాజీ ప్రేయసి పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

అవును... ఆజన్మబ్రహ్మచారిగానే ఉండిపోయిన రతన్ టాటా తన ఫస్ట్ లవ్ (ఫెయిల్యూర్) స్టోరీ గురించి చాలా మందికి తెలిసిందే. రతన్ టాటా 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చదువు పూర్తి చేసుకుని, అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో ఓ ఆర్కిటెక్చర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో అక్కడ ఓ యువతితో ప్రేమలో పడ్డారు. ఆమెను పెళ్లి చేసుకుని, స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.

సరిగ్గా అదే సమయంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తనను పెంచిన తన నాన్నమ్మతో కొన్ని రోజులు గడపాలని ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ సమయంలో తన కోసం తన ప్రేయసి కూడా భారత్ కు వస్తుందని ఆశించారు. అయితే... 1962లో భారత్ - చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా ఆమె భారత్ కు వెళ్లేందుకు ఆమె తల్లితండ్రులు అంగీకరించలేదు.

దీంతో... వ్యాపార దిగ్గజంగా ఎన్నో ఎన్నో విజయాలు సాధించిన రతన్ టాటా తొలిప్రేమ చాలామందిలాగానే ఫెయిల్ అయ్యింది. నాటి తొలిప్రేమ జీవితంలో ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది. అయితే తన ప్రేమకథను పలుమార్పు బయటపెట్టిన రతన్ టాటా... తన తొలి ప్రేయసి ఎవరనేది మాత్రం ఎప్పుడూ వెల్లడించలేదు. అయితే ఆ తర్వాత రతన్ టాటా మరో మహిళతో ప్రేమాయణం సాగించారని చెబుతారు.

1970ల్లో హిందీ చిత్రసీమలో ప్రముఖ నటీమణిగా వెలుగొందిన సిమీ గరేవాల్ కు రతన్ టాటా దగ్గరయ్యారట. ఈ సమయంలో వారి అనుబంధం పెళ్లి పీటలవరకూ వెళుతుందని ఆశించినా అదీ జరగలేదట. సిమీ గరేవాల్ మరొకరిని పెళ్లాడారు. దీంతో.. మరోసారి రతన్ టాటా లవ్ ఫెయిలైంది.. ఆయన మరోసారి ఒంటరయ్యారు.

ఇలా సుమారు నాలుగు సందర్భాల్లో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైనా.. అవి పలు కారణాలతో జరగలేదంట. దీంతో... ఇక ఆయన ఆజన్మబ్రహ్మచారిగానే ఉండిపోయారు. ఈ క్రమంలో తన 86వ ఏటా బుధవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ముంబై లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఈ సమయంలో ఆయన మాజీ ప్రేయసి సిమీ గరేవాల్ స్పందించారు. "వాళ్లు నువ్వు వెళ్లిపోయావని అంటారు.. నువ్వు లేవని అనుకోవడం కష్టం.. చాలా కష్టం.. వీడ్కోలు స్నేహితుడా" అంటూ సిమీ గరేవాల్ ట్వీట్ చేశారు. ఈ అక్షరాలకు ఓ ఫోటో జ్ఞాపకాన్ని జత చేశారు.

Tags:    

Similar News