రాజకీయ జన్మనిచ్చిన జిల్లాకు కేటీఆర్ వెన్నుపోటు!

అక్కడి నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచే ఓనమాలు నేర్చుకొని ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నారు.

Update: 2024-10-18 09:30 GMT

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కేటీఆర్ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. ఉద్యమం ప్రారంభం అయ్యాక.. కేసీఆర్ తనయుడిగా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ఆయనకు రాజకీయాల్లో తిరుగులేకుండా పోయింది.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్.. ఏ నియోజకవర్గం నుంచి బరిలో దిగాలో అయోమయం ఉండేది. దాంతో తన అమ్మమ్మ నియోజకవర్గం అయిన సిరిసిల్లను ఎంచుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి అదే నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. అక్కడి నుంచే గెలిచి రెండు సార్లు మంత్రి అయ్యారు. అక్కడి నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచే ఓనమాలు నేర్చుకొని ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నారు.

గత పదేళ్ల కాలంలో కేటీఆర్ తన సొంత నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టాప్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్నో సందర్భాల్లో మాటఇచ్చారు. సరే.. ఆయన మాటలు ఎలా ఉన్నప్పటికీ అంతోఇంతో అభివృద్ధి చేశారనుకుందాం. కేటీఆర్ కూడా ప్రతీసారి ‘నాకు నా తల్లి జన్మనిస్తే.. సిరిసిల్ల మాత్రం రాజకీయ జన్మనిచ్చింది’ అని చెప్పుకొచ్చారు. అయితే.. ఆ నియోజకవర్గంలోనూ చాలా సందర్భాల్లో ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి.

తాజాగా.. తనకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల జిల్లాలో దళితులకు అన్యాయం చేశారు. రాజకీయ జన్మనిచ్చిన జిల్లాకు వెన్నుపోటు పొడిచారని సిరిసిల్లలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన దళితులు ఆందోళనకు దిగడం కలకలం రేపింది. సుమారు 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కోసం 10 ఎకరాల స్థలం కేటాయించింది. ఆ భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి మంత్రి, ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ లాక్కున్నాడు. డబుల్ బెడ్ రూంలు నిర్మించి ఇస్తామని వాటిని తీసేసుున్నారు.

అయితే.. ఆ భూమిలో నిర్మించిన డబుల్ బెడ్ రూంలను ఇస్తామని ఐదేళ్లుగా నాన్చుతున్నారు. తీరా వాటిని దళితులకు కాకుండా వేరే వారికి ఇచ్చారు. అప్పటి అధికారుల అండదండలతో మున్సిపల్ పాలకవర్గం వీటిని అమ్ముకుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రీ సర్వే చేపించి తమకు ఇళ్లను అప్పగించాలని కోరారు. అదే సమయంలో కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నమ్మినందుకు నట్టేట ముంచారని ఆశేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మూసీ బాధితుల పక్షాన పోరాడుతున్న కేటీఆర్.. తన సొంత నియోజకవర్గంలో దళితులకు జరిగిన అన్యాయంపై ఏం మాట్లాడుతారని ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News