రేష‌న్ అక్ర‌మాల‌పై ఏపీ ప్ర‌భుత్వం ఉక్కుపాదం.. ఏం చేస్తోందంటే!

ఏపీలో రేష‌న్ బియ్యం అక్ర‌మాల‌పై కూటమి ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపేందుకు రెడీ అయింది. దీనిలో భాగంగా ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది.

Update: 2024-12-07 05:03 GMT

ఏపీలో రేష‌న్ బియ్యం అక్ర‌మాల‌పై కూటమి ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపేందుకు రెడీ అయింది. దీనిలో భాగంగా ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం అక్ర‌మాల‌ను నిగ్గు తేల్చ‌నుంది. ఈ మేరకు జీవో నెంబర్ 2103ను జారీ చేసింది. ఈ బృందం ప్ర‌తి 15 రోజుల‌కు ఒక సారి నివేదిక ఇవ్వాల‌ని స‌ర్కారు తేల్చి చెప్పింది. ఇది నిరంత‌రం ప‌నిచేస్తుంద‌ని, ఒక కాల ప‌రిమితి అంటూ ఏమీ లేద‌ని తెలిపింది. రేష‌న్ బియ్యం అక్ర‌మాల‌ను క‌ట్ట‌డి చేసే వ‌ర‌కు ఈ బృందం కొన‌సాగ‌నుంద‌ని స్ప‌ష్టం చేసింది.

పేద‌ల‌కు ఇచ్చే రేష‌న్ బియ్యాన్ని వివిధ రూపాల్లో సేక‌రించి.. కాకినాడ పోర్టు నుంచి విదేశాల‌కు అక్ర‌మంగా ర‌వాణా చేస్తూ.. రూ.వంద‌ల కోట్లను గ‌డిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పోర్టును సంద‌ర్శించి ప‌రిశీలించారు. అక్ర‌మార్కుల‌ను అడ్డుకుంటామ‌ని ఆయ‌న అప్ప‌ట్లోనే తేల్చిచెప్పారు. పోర్టును సంద‌ర్శించిన త‌ర్వాత‌.. కేబినెట్ స‌మావేశంలోనూ ఈ విష‌యంపై చ‌ర్చించారు. అనంత‌రం.. మంత్రి నాదెండ్ల మనోహ‌ర్ కూడా పోర్టును సంద‌ర్శించడంతోపాటు ప‌లు చోట్ల గోదాముల‌ను త‌నిఖీ చేశారు. రైతుల నుంచే కాకుండా.. పేద‌ల నుంచి కూడా సేక‌రిస్తున్న బియ్యాన్ని గుర్తించారు.

అయితే.. గ‌త వైసీపీ హ‌యాంలో రాష్ట్రం నుంచి విదేశాల‌కు వెళ్లిపోయిన రేష‌న్ బియ్యం అక్ర‌మాల‌ను కట్ట‌డి చేయ‌డం అంత ఈజీ కాద‌ని గుర్తించిన ప్ర‌భుత్వం.. దీనిపై మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ అక్ర‌మాల మూలాలు.. ఒక్క ఏపీలోనే కాకుండా.. పోరుగు రాష్ట్రాల‌కు కూడా విస్త‌రించాయి. అదేవిదంగా అనేక పార్టీల‌కు చెందిన నాయ‌కులు, పారిశ్రామిక వేత్త‌ల హ‌స్తం కూడా ఉంద‌ని గుర్తించారు. వీట‌ని పూర్తిగా అధ్య‌య‌నం చేసి.. అక్ర‌మ ప‌ద్ధ‌తుల‌కు చెక్ పెట్టాల‌ని స‌ర్కారు నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే రేష‌న్ బియ్యం అక్ర‌మాల గుట్టు విప్పేందుకు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని నియ‌మించింది.

ఏం చేస్తారు?

+ 2019-24 మ‌ధ్య కాకినాడ పోర్టు నుంచి విదేశాల‌కు వెళ్లిన బియ్యం లెక్క‌లు ప‌రిశీలిస్తారు.

+ ఏయే కంపెనీల నుంచి ఎంతెంత మొత్తంలో బియ్యం వెళ్లిందీ తెలుసుకుంటారు.

+ ఆయా కంపెనీల య‌జ‌మానుల తాలూకు వివ‌రాలు, వారు ఎక్క‌డ నుంచి ఆ బియ్యాన్ని సేక‌రించారు? అనే విష‌యాలు తెలుసుకుంటారు.

+ అదే విధంగా రేష‌న్ బియ్యం విదేశాల‌కు ఎంత మొత్తంలో వెళ్లిందో నిగ్గు తేల్చ‌నున్నారు.

+ ప్ర‌ధానంగా స్థానికంగా ఉన్న సార్టెక్స్‌(బియ్యాన్ని పాలిష్ చేసే మిల్లులు) మిల్లుల్లో జ‌రుగుతున్న లావాదేవీల‌ను కూడా ప‌రిశీలించ‌నున్నారు. ఆమేర‌కు జ‌రిగిన అక్ర‌మాల‌పై నిగ్గు తేల్చ‌నున్నారు.

Tags:    

Similar News