జంధ్యం పట్టిన చేతితోనే వామపక్ష జెండా ఎత్తి...!
తెలుగు నాట నుంచి జాతీయ స్థాయి లోకి వెళ్ళి ప్రభావవంతమైన రాజకీయాన్ని చేసిన వారిలో సీతారాం ఏచూరి ఒకరు.
సీతారాం ఏచూరి ఇక లేరు అన్న వార్త ఆయన అభిమానులతో పాటు మొత్తం తెలుగు వారిని కలచివేసింది. తెలుగు నాట నుంచి జాతీయ స్థాయి లోకి వెళ్ళి ప్రభావవంతమైన రాజకీయాన్ని చేసిన వారిలో సీతారాం ఏచూరి ఒకరు. ఒక పార్టీకి సుదీర్ఘ కాలం జాతీయ స్థాయిలో నాయకత్వం వహించడంతో పాటు తనదైన అద్భుతమైన వాగ్దాటితో అటు పార్లమెంట్ లోపలా ఇటు జన బాహుళ్యంలోకి పేరు తెచ్చుకున్న నేతలలో అరుదైన వారిగా సీతారాం ఏచూరిని చెప్పుకోవాలి.
ఆయనది మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబం. ఈయన తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. అంతే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందాకు సీతారాం ఏచూరి మేనల్లుడు. పదకొండవ ఏటే ఉపనయయం చేసుకుని మూడు కాలాలలో సంధ్యా వందనం చేసిన సీతారాం ఏచూరి 15 ఏళ్లకే మార్క్సిస్టు భావజాలానికి ఆకర్షితులు అయ్యారు.
అలా చదువులో నంబర్ వన్ స్టూడెంట్ ఐఏఎస్ కావాల్సిన ఆయన పీడిత తాడిత ప్రజల కోసం కమ్యూనిస్టు జెండా ఎత్తారు. ఆయనది సనాతన సంప్రదాయ కుటుంబం. రామాయణ భారత భాగవతాలు భగవద్గీత అన్నీ చదివిన వాడైన సీతారాం ఏచూరి వామపక్ష ఉద్యమం వైపు మళ్ళడం సంచలన పరిణామం. ఆయన జీవిత పర్యంతం ఆ పురాణాలను జ్ఞాపకం ఉంచుకుంటూనే మత తత్వం అంటూ బీజేపీకి వ్యతిరేకంగా ముందు వరసలో నిలిచి పోరాడారు.
ఆయన వామపక్ష ఉద్యమాల వెంట తిరగడం చూసిన తండ్రి ప్యాకెట్ మనీ ఇవ్వను అని హెచ్చరించారు. అయినా తన దారి మార్చుకోలేదు. ఎరుపులోనే మెరుపు ఉందని నమ్మారు. తుదికంటా అదే అనుసరించారు. 15 ఏళ్ళ వరకూ గుడులూ గోపురాలు తిరిగిన ఆయన దానికి బద్ధ వ్యతిరేకమైన పార్టీలో చేరి అగ్ర శ్రేణి నేతగా మారడం నిజంగా వింతే.
అయితే దానికి ఆయన సమాధానం ఏంటి అంటే మనిషిగా తాను చైతన్యం అయ్యాను అని. అందుకే తాను తన దారి ఎంచుకున్నాను అని. తెలుగు నాట దిగ్గజ కమ్యూనిస్టు నేతగా ఉన్న పుచ్చలపల్లి సుందరయ్యకు ప్రియ శిష్యుడిగా సీతారాం ఏచూరి మెలిగారు. ఆయన వామపక్ష ఉద్యమాలలో తిరగడం నచ్చని ఆయన అమ్మమ్మ విజయవాడలోని పుచ్చలపల్లి వారి ఇంటికి వెళ్ళి తన మనవడిని ఉద్యమ బాట నుంచి మళ్ళించమని కోరారట.
దానికి ఆయన చెప్పిన సమాధానం నీ మనవడి లాంటి వాడిని నాకు చూపిస్తే వదిలేస్తాను. అని అంతలా అంకితభావంతో వమాపక్ష ఉద్యమాన్ని అర్ధం చేసుకున్నారు కాబట్టే దిగ్గజ నేతగా సీతారాం ఏచూరి ఎదిగారు. ఇక సీతారాం ఏచూరిలో విప్లవ భావాలకు బీజం పడింది హైదరాబాద్ లోనే. 1960లలో ఉస్మానియాలో జార్జిరెడ్డి చేసిన ఉద్యమాలు పోరాటాలు ఆయన మీద తీవ్ర ప్రభావం చూపించాయి.
దేశంలో ఈ రోజున వామపక్ష ఉద్యమాల ప్రభావం చాలా అవసరం అని వాదించే సీతారాం ఏచూరి మంచి రోజులు తమ పార్టీకి వస్తాయని ఆశాభావంతో ఉండేవారు. విద్యార్ధి దశ నుంచే సీతారాం ఏచూరి చదువులో మిన్నగా రాణించ్గారు. విద్యాభ్యాసమంతా దిల్లీలోనే సాగింది. దిల్లీ ఎస్టేట్ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు. సీబీఎస్‌ఈ పరీక్షలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సెయింట్ స్టీఫెన్ కళాశాలలో బీఏ(ఆనర్స్) ఆర్థికశాస్త్రం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారు. డిగ్రీ, పీజీ రెండింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణులయ్యారు.
ఆయన సీపీఎంలో ఎదిగిరిన తీరు చాలా గొప్పగా ఉంటుంది. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) లో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని చెప్పాలి ఆ తరువాత ఏడాదే అంటే 1975లోనే ఆయన సీపీఎం సభ్యుడు అయ్యారు. అలా అర్ధ శతాబ్దం పైగా ఆయనకు వామపక్ష పోరాటాల విషయంలో అనుబంధం ఉంది.
ఇక పదవుల విషయానికి వస్తే జేఎన్‌యూ విద్యార్థి నాయకునిగా సీతారాం ఏచూరి మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, 1988లో కేంద్ర కార్యవర్గంలో, 1999లో పొలిట్ బ్యూరోలో ఏచూరికి చోటు దక్కింది. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అలా రెండు సార్లు అంటే 12 ఏళ్ల పాటు ఆయన ఆ పదవిలో ఉన్నారు.
ఆ సమయంలో ఆయన ఎన్నో సమస్యలను కేంద్రం దృష్టికి తెచ్చారు. ఆయన సగటు ప్రజానీకం గొంతుకగా గుర్తింపు పొందారు. తెలుగు వారు అయినా సీతారాం ఏచూరి ఎక్కువగా జాతీయ స్థాయిలోనే తన ప్రభావం చూపించారు. ఆయన బెంగాలీ, మలయాళం, తమిళం, పంజాబీ, ఉర్దూ, హిందీ, ఆంగ్లాలను అనర్గళంగా మాట్లాడే దిట్టగా పేరు సంపాదించారు. ఆయన నాయకత్వ దక్షతకు నిదర్శనం ఇప్పటికి తొమ్మిదేళ్ళుగా సీపీఏం జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగడం.