ఆరేళ్లు - 142 మంది విద్యార్థినులు... ప్రిన్సిపల్ అఘాయిత్యం!
పాఠశాలలో ఉన్నంతసేపూ పిల్లలకు తల్లితండ్రుల స్థానంలో ఉండాల్సిన ఉపాధ్యాయులు కొందరు కీచకులుగా మారుతున్నారు.
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుల్లో కొంతమంది నరరూప రాక్షసులుగా మారుతున్న సంఘటనలు నిత్యం ఏదో ఒక మూల వెలుగుచూస్తూనే ఉంటున్నాయి! పాఠశాలలో ఉన్నంతసేపూ పిల్లలకు తల్లితండ్రుల స్థానంలో ఉండాల్సిన ఉపాధ్యాయులు కొందరు కీచకులుగా మారుతున్నారు. కంచే చేనుమేసిన చందాన్న వ్యవహరిస్తున్నారు. తాజాగా అలాంటి ఒక ఘోరం వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపల్ తమపై లైంగిక వేదింపులకు పాల్పడ్డారంటూ 142మంది విద్యార్థినులు ఆరోపించారు!
అవును... ఆరేళ్లుగా విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఒక పాఠశాల ప్రిన్సిపల్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించిన ఘటన తాజాగా కలకలం సృష్టించింది. తమపై లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లు 142 మంది విద్యార్థినులు ప్రిన్సిపల్ పై ఆరోపించడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది.
వివరాళ్లోకి వెళ్తే... హరియాణాలోని జింద్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలో దాదాపు 390 విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో 15 మంది విద్యార్థినులు తమపై ప్రిన్సిపల్ అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ గత ఆగస్టు 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, మహిళా కమిషన్ లకు లేఖ రాశారు.
దీంతో ఈ లేఖను హరియాణా మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఇందులో భాగంగా వెంటనే చర్యలు తీసుకోవాలని సెప్టెంబరు 13న జింద్ పోలీసులకు సూచించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీంతో ఈ విచారణలో... విద్యార్థినులపై ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయం వాస్తవమేనని తేలింది.
దీంతో నవంబర్ 4న సదరు స్కూల్ ప్రిన్సిపల్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నవంబర్ 7న కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో తాజాగా ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వడానికి మొదట 60 మంది విద్యార్థినులు ముందుకొచ్చారని.. ఇప్పుడు ఆ సంఖ్య 142కి చేరిందని మహిళా కమిషన్ పేర్కొంది.
దీంతో... ప్రిన్సిపల్ పై త్వరలో ఛార్జ్ షీట్ తెరవనున్నట్లు పోలీసులు తెలిపారు. నవంబర్ 16న అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను నవంబర్ 16న ఏర్పాటు చేశామని, విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. దీనికి సంబంధించి 10 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఏడిజీపీ.. సిట్ ను ఆదేశించారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాపంగా సంచలనంగా మారింది.