కేంద్ర సర్వీస్ లోకి.. స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్..?
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి స్మితా సబర్వాల్ దూరంగా ఉంటున్నారు. చాలా మంది ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ముఖ్యమంత్రి, మంత్రులను కలుస్తున్నా ఆమె మాత్రం దూరంగానే ఉంటున్నారు.
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ అంతే తెలంగాణలో తెలియని వారు ఉండరు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ అధికారిగా ఆమె గుర్తింపు సంపాదించుకున్నారు. రాష్ట్రంలో చాలా జిల్లాలకు పాలనాధికారిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఆమె కలెక్టర్ గా ఉన్న జిల్లాలో అధికారులను పరుగులు పెట్టించేవారు. ఆమె పనితనానికి ఫిదా అయిన అప్పటి సీఎం కేసీఆర్ ఆమెను పాలనా వ్యవహారాల్లో కీలక బాధ్యతలు అప్పగించారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో పాటు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు.
కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆమె కీలక పాత్ర పోషించారు. సీఎంవో కార్యదర్శిగా పనులను దగ్గరుండి చూసుకున్నారు. ఎప్పటి కప్పుడు సందరు కంపెనీకి, ప్రభుత్వా్నికి అనుసంధాన కర్తగా వ్యవహరిస్తూ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లో అధికారిక వ్యవహారాల్లో స్మితా సబర్వాల్ కీరోల్ పోషించేవారనడంలో సందేహం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి స్మితా సబర్వాల్ దూరంగా ఉంటున్నారు. చాలా మంది ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ముఖ్యమంత్రి, మంత్రులను కలుస్తున్నా ఆమె మాత్రం దూరంగానే ఉంటున్నారు. దీంతో పాటు పాలనా పరమైన సమావేశాల్లో సైతం ఆమె కనిపించడం లేదు. ఇటీవల నీటి పారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, తదితరాలపై జలసౌధలో డిసెంబర్ 11వ తేదీ సమీక్ష నిర్వాహించారు. ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న స్మితా సబర్వాల్ మాత్రం సమావేశంలో కనిపించలేదు.
అయితే, సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఈ రోజు (డిసెంబర్ 13) ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్ చేసింది. 'కొత్త ఛాలెంజ్ కు తాను ఎప్పుడూ సిద్ధమేనని' చెప్పింది. దీంతో పాటు తను ఐఏఎస్ లో చేరినప్పటి ఫొటోను పెట్టింది. దీంతో ఆమె కేంద్ర సర్వీస్ లోకి వెళ్లబోతోందని అంతా అనుకుంటున్నారు. అయితే ఆమెను రేవంత్ ప్రభుత్వం రిలీవ్ చేస్తుందా? లేదా? చూడాలి. అయితే ఆమె కేంద్ర సర్వీస్ లోకి వెళ్తే.. అమ్రాపాలి రాష్ట్రం వైపునకు వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది.