చంద్రబాబుపై రాళ్లదాడి కేసులో కీలక పరిణామాలు!
ఈ సమయంలో తాజాగా కూటమి ప్రభుత్వం కొలువైన వేళ పోలీసులు నాటి వీడియోలు, ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలించారని అంటున్నారు.
నవంబర్ 4 - 2022న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు "బాదుడే బాదుడు" కార్యక్రమంలో భాగంగా నందిగామలో పర్యటించడం.. ఆరోజు సాయంత్రం 6:30 గంటలకు ఆయన వాహనం గాంధీబొమ్మ సెంటర్ నుంచి మున్సిపల్ అఫీసు వైపు వెళ్తుండగా రైతుబజార్ వద్ద రాళ్లదాడి జరగడం.. అందులో సీ.ఎస్.వో.కు గాయమవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి!
అవును... 2022లో చంద్రబాబుపై రాళ్లదాడి కేసులో కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయి! ఇందులో భాగంగా... అప్పటి నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ల ఆధ్వర్యంలోనే చంద్రబాబును అంతమొందించేందుకు కుట్రకు ప్రణాళిక రచించారని, దర్యాప్తులో వెల్లడైందని అంటున్నారు.
వాస్తవానికి ఈ కేసులో ఇప్పటికే 17 మందిని నిందితులుగా గుర్తించి, నలుగురుని అరెస్ట్ చేశారు! ఈ నేపథ్యంలో నందిగామ మాజీ ఎమ్మెల్యే, ఆయన సోదరుడి పేర్లను ఈ జాబితాలో చేర్చనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో కీలక అరెస్టులు ఉండొచ్చని కథనాలొస్తున్నాయి.
నాడు చంద్రబాబు పర్యటనకు రెండు రోజుల ముందు జగన్మోహనరావు, అరుణ్ కుమార్ లు తమ అనుచరులతో సమావేశమయ్యారని.. బాబు కార్యక్రమాన్ని భగ్నం చేసేందూ ప్రణాళిక రచించారని అంటున్నారు. ఇందులో భాగంగా... ఓ బృందం విద్యుత్ సరఫరా నిలివేయడానికి.. మరో 2 బృందాలు రాళ్లతో దాడి చేసేందుకు ఏర్పాటు చేశారని అంటున్నారు.
నాడు ఈ ఘటనపై స్పందించిన అప్పటి సీపీ కాంతిరాణా... దాడి సమయంలో చాలామంది చంద్రబాబుపై పూలు చల్లుతున్నారని.. ఆ క్రమంలోనే గుర్తుతెలియని వ్యక్తి రాయి కానీ, అలాంటి వస్తువు కానీ విసిరి ఉంటాడని భావిస్తున్నామని అన్నారు. ఈ సమాయంలో దాడిపై సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశారు.
ఈ సమయంలో తాజాగా కూటమి ప్రభుత్వం కొలువైన వేళ పోలీసులు నాటి వీడియోలు, ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలించారని అంటున్నారు. ఈ సమయంలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, నందిగామ కోర్టులో ప్రవేశపెట్టగా... ఒక్కొక్కరికీ రూ.20 వేల సొంత పూచీకత్తుపై సెల్ఫ్ బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు.