షాకింగ్ గా జీఎస్టీ స్కాం.. ఏ5గా మాజీ సీఎస్ సోమేశ్!
అనూహ్యంగా తెర మీదకు వచ్చిన జీఎస్టీ ఎగవేత కుంభకోణం తెలంగాణలో పెను సంచలనంగా మారింది.
అనూహ్యంగా తెర మీదకు వచ్చిన జీఎస్టీ ఎగవేత కుంభకోణం తెలంగాణలో పెను సంచలనంగా మారింది. ఈ స్కాంలో నిందితుల్లో ఒకరు తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన సోమేశ్ కుమార్ పేరు ఉండటం ఒక ఎత్తు అయితే.. ఆయన్ను ఏ5గా పేర్కొంటూ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. పన్ను ఎగవేతదార్లకు వీరు సహకరించటంతో వేలాది కోట్ల రూపాయిల మేర అక్రమాలు జరిగినట్లుగా జీఎస్టీ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ కేసు నమోదైంది.
ఈ కేసులో భాగంగా ఒక్క తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారానే వాణిజ్యపన్నుల శాఖకు రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. మరో పదకొండు ప్రైవేటు సంస్థలు సుమారు రూ.400 కోట్లు పన్ను ఎగవేసినట్లుగా ప్రాథమికంగా వెల్లడైనట్లుగా ఫిర్యాదులో పేర్కొనటం గమనార్హం. ఈ కేసులో నిందితుల జాబితాను చూస్తే.. నోట మాట రాదంతే.
వాణిజ్యపన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్ వి కాశీవిశ్వేశ్వరరావు.. డిప్యూటీ కమిషనర్ (హైదరాబాద్ రూరల్) శివప్రసాద్.. ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెస్ శోభన్ బాబు.. ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు ఐదో నిందితుడిగా తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి (చీప్ సెక్రటరీ) సోమేశ్ కుమార్ పేరును చేర్చారు. పన్ను ఎగవేతదార్లకు వీరు సహకరించారని.. ఈ కారణంగా వేలాది కోట్ల అక్రమాలకు కారణమైనట్లుగా ఆరోపిస్తున్నారు.
సీసీఎస్ లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న అంశాల్ని చూస్తే..
- మానవ వనరుల్ని సరఫరా చేసే బిగ్ లీవ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ పన్ను చెల్లించకుండా రూ.25.51 కోట్ల ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ తీసుకొని మోసానికి పాల్పడింది. దీంతో వాణిజ్యపన్నుల శాఖ ఇంటర్నల్ గా విచారణ చేపట్టింది.
- వాణిజ్య పన్నుల శాఖకు టెక్నాలజీని అందించే సర్వీస్ ప్రొవైడర్ గా ఐఐటీ హైదరాబాద్ వ్యవహరించింది. దీని పనేమిటన్నది చూస్తే.. తెలంగాణలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్ లలో అక్రమాలను గుర్తించటం. ఆ డేటాను విశ్లేషించటం. ఎవరైనా పన్ను చెల్లింపుదారులు అక్రమాలకు పాల్పడితే సర్వీస్ ప్రొవైడర్ రూపొందించిన స్క్రూటినీ మాడ్యూల్ గుర్తించాల్సి ఉంటుంది.
- అయితే.. ఇదేమీ జరగలేదు. ఈ అంశాన్ని బిగ్ లీవ్ టెక్నాలజీస్ అక్రమాలకు పాల్పడినా ఈ మాడ్యూల్ గుర్తించకపోవటాన్ని సీరియస్ గా తీసుకున్న జీఎస్టీ.. అంతర్గత విచారణను చేపట్టారు. ఈ క్రమంలో తీగ లాగగా.. డొంక కదిలింది. భారీ కుంభకోణం బయటకు వచ్చింది.
- బిగ్ లీప్ అక్రమాల నేపథ్యంలో జీఎస్టీ శాఖకు చెందిన ఒక అధికారిని గత ఏడాది డిసెంబరు 26న ఐఐటీ హైదరాబాద్ వర్సిటీలో విచారణ చేపట్టారు. అప్పటి రెవెన్యూ స్పెషల్చీఫ్ సెక్రటరీతో పాటు ఎస్.వి. కాశీవిశ్వేశ్వరరావు.. శివరామప్రసాద్ ల మౌఖిక ఆదేశాలతో అక్రమాలను గుర్తించకుండా ఉండేలా సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసినట్లుగా అంతర్గత నివేదికలో పేర్కొన్నారు.
- సాఫ్ట్ వేర్ లో మార్పులతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. ప్లియాంటో టెక్నాలజీస్ సంస్థ వాణిజ్య పన్నుల శాఖ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తోంది. ఈ నివేదిక ఆధారంగా నిందితులైన కాశీవిశ్వేశ్వరరావు.. శివప్రసాద్.. ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను వాణిజ్యపన్నుల శాఖ వివరణ కోరగా.. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలతోనే తాము సాఫ్ట్ వేర్ లో మార్పులు చేయాలని చెప్పారంటూ ఈ ఇద్దరు పేర్కొన్నారు.
- ఈ నేపథ్యంలో జీఎస్టీ శాఖ.. ఐఐటీ హైదరాబాద్ కు మధ్య జరిగిన ఒప్పందం గురించి మరింత లోతుగా వివరాల్ని రాబట్టేందుకు జనవరి 25న స్టేట్ ఆడిట్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ కు వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారులు లేఖ రాశారు. ఈ క్రమంలో నిర్వహించిన ఆడిట్ లో.. పలు లోపాల్ని గుర్తించినట్లుగా రిపోర్టులో పేర్కొన్నారు.
- ఐఐటీ హైదరాబాద్ కంట్రోల్ లోనే డేటా అంతా ఉందని.. అవసరమైతే డేటాలో మార్పులు చేసే వీలు ఉందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఐఐటీ హైదరాబాద్ మొయింటెన్స్ లో ఉన్న డేటాబేస్.. ఆడిట్ అప్లికేషన్ల గురించి సీడాక్ నుంచి జీఎస్టీ శాఖ రిపోర్టు తెప్పించుకుంది.
- జనవరి 30న సీడాక్.. ఐఐటీ హైదరాబాద్.. జీఎస్టీ ఉన్నతాధికారుల నడుమ ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మరో కొత్త విషయాన్ని గుర్తించారు. ‘‘స్పెషల్ ఇనిషియేటివ్స్’’ పేరుతో వాట్సప్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేశారు. అందులో సోమేశ్ కుమార్.. కాశీ విశ్వేశ్వరరావు.. శివరామప్రసాద్ లు సభ్యులుగా ఉన్నట్లు తేలింది.
- దీంతో వాట్సప్ గ్రూపు ఏర్పాటు అంశంపై కాశీ విశ్వేశ్వరరావు.. శివరామప్రసాద్ ల నుంచి వివరణ కోరింది. సోమేశ్ కుమార్ పర్యవేక్షణలోనే ఈ గ్రూపు ఏర్పాటు చేశామని.. డిసెంబరు 2022లోనే దాన్ని నిలిపివేసినట్లుగా వారిద్దరూ పేర్కొన్నారు. ఫోటోలు.. వీడియోలు లేకుండా వాట్సప్ హిస్టరీని వారిద్దరూ సమర్పించారు.
- దీంతో ఫోటోలు.. వీడియోలతో కూడిన చాట్ హిస్టరీని సమర్పించాలని వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారులు వారిద్దరికి అత్యవసర మెమోను జారీ చేశారు. వారు సమర్పించిన హిస్టరీలో పలు అంశాలు వెలుగు చూశాయి. ఐజీఎస్టీ నష్టాలకు సంబంధించిన పలు నివేదికల్ని వాటిల్లో గుర్తించారు.
- జీఎస్టీ చెల్లింపుల్లో అక్రమాల కేసుల్లోనూ రిజిస్ట్రేషన్లు రద్దు చేయొద్దనే ఆదేశాలు ఉన్నాయి. వారిద్దరి సెల్ ఫోన్లను ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరు హైకోర్టును ఆశ్రయించగా.. వారి పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. అదే సమయంలో ఫోరెన్సిక్ ఆడిట్ సక్రమంగా జరిగేలా చూసేందుకు ప్రాజెక్టు ఇన్వెస్టిగేటర్ ను మార్చాలని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్కు జీఎస్టీ పన్నుల శాఖ లేఖ రాసింది.
- అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన సూచనలకు తగ్గట్లే తాము నడుచుకున్నామని పేర్కొంటూ దానికి సంబంధించిన కొన్ని పత్రాల్ని వాణిజ్యపన్నుల శాఖకు ఐఐటీ హైదరాబాద్ పంపింది. అందులో ఎస్ జీఎస్టీ.. సీజీఎస్టీలకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటీసుల గురించి మాత్రమే ఉన్నాయి కానీ కాశీ విశ్వేశ్వరరావు చెప్పిన ఐజీఎస్టీకి సంబంధించిన వివరాలు లేవు.
- సీడాక్ ఇచ్చిన రిపోర్టులో పలు కీలకాంశాల్ని గుర్తంచారు. సీడాక్ రిపోర్టు ప్రకారం 75 మంది పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన కార్యకలాపాల్ని ఉద్దేశపూర్వకంగా ఆన్ లైన్ లో కనిపించకుండా చేశారు. పన్ను ఎగవేతకు సహకరించేలా చేశారు. జీఎస్టీ కు.. ఐఐటీ హైదరాబాద్ కు మధ్య జరగాల్సిన లావాదేవీల వివరాలు హిందూపూర్ ఐటీ అడ్రస్ చిరునామాతో ఉన్న సంస్థనూ చేర్చారు. ఆ ఐపీ అడ్రస్ పాస్ వర్డ్ సైతం ప్లియాంటో గా ఉంది.
- ఐఐటీ హైదరాబాద్ సాఫ్ట్ వేర్ లోని సమాచారాన్ని స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సప్ గ్రూప్ నకు చేరేలా చేశారు. జీఎస్టీ శాఖ డేటాబేస్ లో పలు లోపాలు ఉన్నాయని తమ ఆల్గరిథమ్స్ ద్వారా కనుగొన్నట్లు శోభన్ బాబు తొలుత ఆ శాఖకు సమాచారం ఇచ్చారు. కానీ.. లోపాలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని జీఎస్టీ శాఖ ఎన్నిసార్లు అడిగినా ఆయన ఇవ్వలేదు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో అక్రమాలు వెలుగు చూశాయి.