'సీఎం' సోనూసూద్..కానీ, కాదన్న నటుడు..ఆఫర్ ఇచ్చింది ఆ పార్టీనే?

రాజకీయాల్లో తనకు ఉన్నత పదవులు చేపట్టే అవకాశం వచ్చినట్లు సోనూ సూద్ తెలిపారు. కానీ, వాటిని తిరస్కరించానని చెప్పాడు. ఇలా వచ్చిన ఆఫర్లలో ముఖ్యమంత్రి పదవి కూడా ఉన్నట్లు చెప్పారు.

Update: 2024-12-26 14:30 GMT

దాదాపు 25 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నా.. వందల సార్లు తెరపై కనిపించినా పెద్దగా పేరు దక్కని నటుడు సోనూ సూద్. ఒకవేళ దక్కినా అది కేవలం విలన్ గానే తప్ప ప్రజలకు అతడిది 'హీరో' ఇమేజ్ లా కనిపించలేదు. కానీ, ఒకే ఒక్క లాక్ డౌన్ అతడిని దేశ వ్యాప్తంగా గొప్ప వ్యక్తిగా నిలిపింది. ఇంత మంచి మనసున్నవాడా? అని చర్చించుకునేలా చేసింది. అతడే బహుభాషా నటుడు సోనూ సూద్. అందుకే అతడిని తమవాడిని చేసుకునేందుకు పలు పార్టీలు ప్రయత్నించాయట.

ఆ పార్టీలు ఏవి?

రాజకీయాల్లో తనకు ఉన్నత పదవులు చేపట్టే అవకాశం వచ్చినట్లు సోనూ సూద్ తెలిపారు. కానీ, వాటిని తిరస్కరించానని చెప్పాడు. ఇలా వచ్చిన ఆఫర్లలో ముఖ్యమంత్రి పదవి కూడా ఉన్నట్లు చెప్పారు. దేశంలోనే మంచి పేరున్న కొందరు.. సీఎం బాధ్యతలు చేపట్టాలని అవకాశం ఇచ్చినా తిరస్కరించాన్నారు. చివరకు డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడిగా కూడా కూడా వెళ్లమని కోరారని, ఆ అవకాశాలను స్వీకరించలేదని తెలిపారు. రాజకీయాల్లో ఉంటే దేని కోసం మనం పోరాడాల్సిన అవసరం లేదని చెప్పారు.

చేస్తున్నది ప్రజా సేవే కదా..?

రాజకీయాల్లో పదవితో పాటు ఇల్లు, ఉన్నత స్థాయి భద్రత, ప్రభుత్వ ముద్రతో ఉన్న లెటర్‌ హెడ్‌, విలాసాలు ఉంటాయని పలువురు చెప్పారని.. డబ్బు సంపాదించడం లేదా అధికారం కోసం చాలా మంది రాజకీయాల్లోకి వస్తుంటారని, కానీ, తనకు వాటి పట్ల ఆసక్తి లేదని సోనూ సూద్ చెప్పారు. రాజకీయాలు ప్రజా సేవ చేయడానికే అయితే.. తాను ప్రస్తుతం చేస్తున్నది అదే పని కదా? అని ప్రశ్నించారు. స్వయంగా సాయం చేస్తున్నానని, ఎవరినీ అడగడం లేదని అన్నారు. స్వేచ్ఛగా జీవిస్తూ, సాయం చేస్తూ వస్తున్న తాను.. రాజకీయ నాయకుడిగా మారితే.. జవాబుదారీగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. అది తనను మరింత భయపెడుతుందని చెప్పుకొచ్చారు.

రాజకీయాల్లో ఊపిరాడదు..

ప్రజల్లో ఆదరణ పొందుతున్నవారు జీవితంలో ఎదగడం ప్రారంభిస్తారని.. ఎత్తైన ప్రదేశాల్లో ఆక్సిజన్‌ ఉండదని సోనూ సూద్ చెప్పారు. ఎత్తుకు ఎదగాలని కోరుకుంటామని.. అక్కడ ఎంతకాలం ఉంటామనేదే చాలా ముఖ్యం అని తెలిపారు. 1999లో సోనూసూద్ 'కల్లగర్' సినిమాతో కెరీర్ మొదలుపెట్టారు. తెలుగులో 2009లో విడుదలైన 'అరుంధతి' సినిమాతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. హిందీలో 'దబాంగ్‌', 'జోధా అక్బర్‌' తో తిరుగులేని నటుడు అయ్యారు. కన్నడంలోనూ కొన్ని సినిమాలు చేశారు.

ఆఫర్ ఆ పార్టీ నుంచేనా?

సోనూ సూద్ సోదరి మాళవికా సూద్ పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున మోగా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆప్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. దీంతో సోనూను రాజకీయాల్లోకి ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీనే అని తెలుస్తోంది.

Tags:    

Similar News