చాంపియన్స్ ట్రోఫీపై మరో రగడ.. ఆ జట్టుతో ఆడొద్దంటున్న క్రీడా మంత్రి
ఇందులో భాగంగా ఆఫ్ఘానిస్థాన్ తో మ్యాచ్ ను బహిష్కరించాలని దక్షిణాఫ్రికా క్రీడా మంత్రి గేటన్ మెకెంజీ తమ జట్టును కోరారు.
మొన్నటివరకు భారత జట్టు పాకిస్థాన్ కు వెళ్లేది లేదని తేల్చి చెప్పడంతో చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందా? లేదా? అనే పెద్ద సందేహం నెలకొంది. ఎట్టకేలకు భారత్ మ్యాచ్ లను తటస్థ వేదిక (దుబాయ్)పై నిర్వహించేందుకు అంగీకారం కుదరడంతో లైన్ క్లియర్ అయిందని క్రికెట్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. కానీ, ఇంతలో మరో రగడ మొదలైంది.
అఫ్ఘాన్ తో ఆడొద్దు..
ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ లో వన్డే ఫార్మాట్ లో చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. షెడ్యూల్ కూడా విడుదలైంది. ఆదివారం నాటికి ఆయా జట్ల ప్రాబబుల్స్ ను ప్రకటించాలి. ఇందులో భాగంగా ఆఫ్ఘానిస్థాన్ తో మ్యాచ్ ను బహిష్కరించాలని దక్షిణాఫ్రికా క్రీడా మంత్రి గేటన్ మెకెంజీ తమ జట్టును కోరారు. ఓ దేశమంత్రి ఇలా కోరడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అఫ్ఘానిస్థాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం.. మహిళలకు క్రీడలపై నిషేధం విధించింది. దీనిని సాకుగా చూపుతూ దక్షిణాఫ్రికా మంత్రి చాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్ తో ఆడొద్దని తమ జట్టును కోరుతున్నారు. అఫ్ఘాన్ ప్రభుత్వం మహిళల క్రికెట్ జట్టునూ రద్దు చేసిందని మెకంజీ తెలిపారు. కాగా, కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఫిబ్రవరి 21న అఫ్ఘాన్ తో గ్రూప్ బి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఈ గ్రూప్ లోనే బలమైన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కూడా ఉండడం గమనార్హం.
ఇప్పటికే ఇంగ్లండ్ కూడా అఫ్ఘాన్ తో మ్యాచ్ ఆడడంపై వ్యతిరేక సంకేతాలు ఇచ్చింది. ఇప్పుడు అఫ్ఘాన్ మహిళలకు సంఘీభావం అంటూ దక్షిణాఫ్రికా మంత్రి కూడా బహిష్కరణ మాట లేవనెత్తారు. మహిళా సమానత్వం అంటూ దీనికి కవరింగ్ ఇచ్చారు. క్రీడలలో రాజకీయ జోక్యాన్ని సహించం అని పేర్కొన్నారు. ఇదే కారణంతో శ్రీలంకపై 2023లో నిషేధం విధించిన సంగతిని గుర్తు చేశారు.
కాగా, క్రీడల మంత్రి అయినా మెకంజీ పిలుపును పట్టించుకోవడం కష్టమే. చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణలో ఇదేమీ పెద్ద విషయం కాదు. మరోవైపు అఫ్గాన్ తో ఆడకుంటే దక్షిణాఫ్రికాకే నష్టం. మిగతా రెండు మ్యాచ్ లలో గ్రూప్ లోని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పై తప్పక గెలవాలి. అసలే ఒత్తిడిని తట్టుకోలేని జట్టు. దీంతో గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టే ప్రమాదం ఉంది.