జనరల్ బోగీల్లో ఎక్కే వారికి కొత్త విధానం తీసుకొచ్చిన ద.మ. రైల్వే

తాజాగా దక్షిణ మధ్య రైల్వే క్యూ పద్దతిలో ప్రయాణికులు రైలు ఎక్కే కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చింది.

Update: 2024-10-30 09:30 GMT

ఇన్నాళ్లకు ఒక చక్కటి విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చింది దక్షిణ మధ్య రైల్వే. ఇప్పటివరకు ఒక పద్దతి పాడు లేకుండా.. ట్రైన్ వచ్చేసిందంటేచాలు.. ఎవరు ముందు వెళ్లాలి? ఎవరు వెనక్కు అనేది కండబలం.. పరుషంగా మాట్లాడేవారు.. దూకుడుగా వ్యవహరించే వారే తప్పించి.. క్యూ పద్దతి అన్నది లేనే లేదన్న సంగతి తెలిసిందే. ఆ తీరుకు భిన్నంగా తాజాగా దక్షిణ మధ్య రైల్వే క్యూ పద్దతిలో ప్రయాణికులు రైలు ఎక్కే కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చింది.

రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లలో జనరల్ బోగీలు ఆగే చోట.. ప్లాట్ ఫాంలపై క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. రైలు రావటానికి ముందే.. ఈ క్యూ పద్దతిలోనే ట్రైన్లోకి ఎక్కాల్సి ఉంటుంది. దీంతో.. రైలు వచ్చేవరకు క్యూ లైన్ లో నిలుచోవటం.. ఆ తర్వాత కూడా ప్రశాంతంగా రైలు ఎక్కే సౌలభ్యాన్ని కల్పిస్తున్నారు.

ఇందులో భాగంగా విజయవాడలో ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. రద్దీ వేళల్లో జనరల్ బోగీల్లో ఎక్కేందుకు ప్రయత్నించే వేళలో.. ప్రయాణికుల మధ్య తోపులాట.. వాగ్వాదం.. ఘర్షణలకు చెక్ పెట్టేలా క్యూ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఐరెన్ బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేశారు. దీంతో.. ప్రయాణికులు ఒకరి తర్వాత ఒకరు చొప్పున మాత్రమే ట్రైన్లోకి ఎక్కే వీలుంది. దీంతో.. గతంలో మాదిరి పెద్ద ఎత్తున తోపులాటలు.. గొడవలు.. సీట్ల కోసం పోటాపోటీగా ప్రయత్నించుకోవటం లాంటివి రానున్న రోజుల్లో కనుమరుగు కానున్నాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News