జగన్ పై స్పీకర్ అయ్యన్న సీరియస్.. నియంత్రించాల్సింది పోయి నవ్వుతారా?
మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు అనుసరించిన తీరును స్పీకర్ తప్పుబట్టారు. తమ పార్టీ సభ్యులను నియంత్రించాల్సిన వైసీఎల్పీ లీడర్ జగన్ నవ్వడమేంటని ఆయన నిలదీశారు.
అసెంబ్లీ రెండో రోజు సమావేశం ప్రారంభమైన వెంటనే స్పీకర్ ప్రారంభోపన్యాసం చేశారు. తొలి రోజు సమావేశాల్లో గవర్నర్ నజీర్ ప్రసంగిస్తుండగా, వైసీపీ సభ్యులు రచ్చ చేయడం సరికాదంటూ ఆక్షేపించారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యత మరచి ప్రవర్తించారని జగన్ ను ఉద్దేశించి అయ్యన్న వ్యాఖ్యానించారు. తన పార్టీ సభ్యులను నియంత్రించాల్సింది పోయి నవ్వుతారా? అని ప్రశ్నించారు. బొత్స వంటి సీనియర్ నేత పక్కనే ఉండి కూడా జగన్ చేసేది తప్పని చెప్పకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటివి జరగకూడదని కోరారు.
ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభల సంయుక్త సమావేశానికి వైసీపీ హాజరైన విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగిస్తుండగా, తమకు ప్రతపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. కొద్దిసేపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేయగా, ఆ పార్టీ ఫ్లోర్ లీడర్లు జగన్, బొత్స తమ సీట్ల నుంచి నిల్చొని నిరసనకు దిగారు. ఇలా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం కరెక్టు కాదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైసీపీపై మండిపడుతున్నారు.
కాగా, జగన్ కుటుంబానికి చెందిన సాక్షి పత్రికపై సభా హక్కుల నోటీసును జారీ చేయాలని స్పీకర్ ఆదేశించారు. సభా హక్కుల కమిటీకి ఆ పత్రిక కథనాలను రిఫర్ చేశారు. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు జరగకుండానే రూ.కోట్లు వెచ్చించారంటూ తప్పుడు కథనం రాశారని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య సభలో ప్రస్తావించారు. సాక్షి మీడియాపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి స్పందనగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.