విపక్ష నేతగా రాహుల్ పరిణతి!

ఆయనకు కేబినెట్ ర్యాంక్ హోదా ఉంటుంది. ప్రత్యేక ప్రోటోకాల్ ఉంటుంది.

Update: 2024-06-26 08:04 GMT

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభలో విపక్ష నేత అయ్యారు. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అన్న మాట. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కి 99 ఎంపీ సీట్లు లభించాయి. దాంతో రాహుల్ లీడర్ ఆఫ్ అపొజిషన్ గా గుర్తించబడ్డారు. ఆయనకు కేబినెట్ ర్యాంక్ హోదా ఉంటుంది. ప్రత్యేక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ తరువాత స్థానంలో ఉంటారు.

ఇదిలా ఉంటే విపక్ష నేతగా రాహుల్ గాంధీ తన పరిణతి చూపించారు. ఆయన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను సభాపతి స్థానం వద్దకు తీసుకెళ్ళేందుకు ప్రధాని మోడీతో పాటుగా వచ్చారు. కొత్త స్పీకర్ కి అభినందనలు తెలియచేశారు. మోడీతో కరచాలనం చేశారు.

ఆ దృశ్యాలు టీవీలలో చూసిన వారిని అందరినీ ఆహ్లాద పరచాయి. ప్రజాస్వామ్య స్పూర్తి అంటే ఇదే కదా అనిపించాయి. అనంతరం మోడీ సభాపతిని అభినందిస్తూ మాట్లాడిన తరువాత లీడర్ ఆఫ్ అపొజిషన్ కి రెండవ చాన్స్ వచ్చింది. రాహుల్ చాలా క్లుప్తంగా ఆంగ్లంలో ప్రసంగం చేశారు. స్పీకర్ సర్ అని సంభోదిస్తూనే ఆయన విలువైన సూచనలు చేశారు.

చట్ట సభలలో అంతిమ అధికారం స్పీకర్ దే అని అంటూ సభలో ఉన్న సభ్యులు అంతా కోట్లాది మంది భారత ప్రజానీకానిని ప్రతినిధులుగా రాహుల్ అభివర్ణించారు. వారి గొంతు బయటకు రావడం అంటే ప్రజల గొంతుక వినిపించడమే అని అర్థం చెప్పారు.

గతసారి తో పోల్చితే ఈసారి విపక్షాల బలం పెద్ద ఎత్తున పెరిగిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో విపక్షానికే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని కూడా గుర్తు చేశారు. సభ విజయవంతం అయింది అన్నది ఎంత అర్ధవంతమైన చర్చ సాగింది అన్న కొలమానం మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పడం జరిగింది.

లోక్ సభ స్పీకర్ హోదాలో సభలో కోట్లాది మంది భారతీయుల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చే విధంగా వ్యవహరించాలని ఓం బిర్లాకు రాహుల్ సూచించారు. ఈసారి సభలో టీడీపీ తరఫున సభా పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా హైలెట్ అయ్యారు. ఆయన ఆంగ్లంలో మాట్లాడారు. సభను చక్కగా నడపేందుకు తన వంతు సహకారం అందిస్తామని అన్నారు. అలాగే వైసీపీ తరఫున మిధున్ రెడ్డి శుభా కాంక్షలు తెలియచేస్తూ క్లుప్తంగా మాట్లాడారు.

డీఎంకే తరఫున మాట్లాడిన సభా పక్ష నేత స్పీకర్ కి రాజకీయ రంగులు ఉండవని అందరినీ సమానంగా చూడాలని విపక్షానికి ఇంకా ఎక్కువగా చూడాలని కోరారు. ఆయన అలా మాట్లాడినపుడు సభలో విపక్షం అంతా సమర్ధిస్తూ బల్లలు చరచింది. మొత్తం మీద చూస్తే సభలో సభ్యుల సంఖ్యను బట్టి స్పీకర్ మాట్లాడే చాన్స్ ఇచ్చారు. అలా పదిహేనవ స్థానంలో వైసీపీ ఉంటే ఆరవ స్థానంలో ఉన్న టీడీపీ మొదట్లోనే మాట్లాడింది.

Tags:    

Similar News