వైసీపీ వర్సెస్ టీడీపీ : రాజీనామా ఆమోదం కోసం న్యాయ పోరాటమేనా ?

దాంతో మనసులో ఏదీ దాచుకోకుండా చెప్పే జగన్ కూడా ఓడిన కొత్తలో తమ ఎమ్మెల్సీను చూసి మీరే బలం అన్నారు.

Update: 2024-10-03 03:55 GMT

రాజకీయం పదును తేరిన వేళ మీరు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ టిట్ ఫర్ టాట్ టాలెంట్ ని చూపిస్తున్న వేళ ప్రతీ ఇష్యూ అగ్గి రాజేస్తూనే ఉంటుంది. ఏపీలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు అయింది. కానీ శాసన మండలిలో ఆ పార్టీకి 38 మంది ఎమ్మెల్సీల బలం ఉంది. పెద్దల సభలో వారిదే అధిపత్యం. ఏ బిల్లు పాస్ కావాలీ అన్నా శాసనమండలిలో వైసీపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన నేపథ్యం ఉంది.

దాంతో మనసులో ఏదీ దాచుకోకుండా చెప్పే జగన్ కూడా ఓడిన కొత్తలో తమ ఎమ్మెల్సీను చూసి మీరే బలం అన్నారు. అసెంబ్లీలో వారు ఎలా వ్యవహరించినా మండలిలో సత్తా చాటుదామని కూడా వ్యూహం చెప్పేసారు. దాంతో జాగ్రత్త పడిన టీడీపీ వైసీపీ ఎమ్మెల్సీలను లాగడానికి ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టింది. అలా ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పటికి వైసీపీ గూడు వీడి బయటకు వచ్చారు.

వీరంతా గడచిన రెండు నెలలలో వరసగా రాజీనామా చేశారు. అయితే వీరు రాజీనామా చేసినా ఆమోదించాల్సిన వారు శాసనమండలి చైర్మన్. మరి ఆ సీట్లో కూర్చున్నది ఎవరో కాదు వైసీపీకి జగన్ కి వీర విధేయుడు అయిన కొయ్యే మోషన్ రాజు. వైసీపీకి చెందిన పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ పదవులు వదులుకున్నారు.

వీరిలో ఇద్దరు అయితే నేరుగా మోషెన్ రాజుని కలసి తమ రాజీనామాలు సమర్పించారు. మరి ఇప్పటికి రెండు నెలలు గడచినా శాసనమండలి చైర్మన్ ఆఫీసు నుంచి ఆమోదం పొందినట్లుగా ఎలాంటి ప్రకటన రావడం లేదు. అలా ఆయన ఆమోదించనంతవరకూ వారు ఎమ్మెల్సీలుగానే ఉంటారు.

ఇక వారు టీడీపీ వైపు చేరడం జరగదు. అదే సమయంలో ఆ సీట్లు ఖాళీగా ఉన్నాయని చైర్మన్ ప్రకటిస్తేనే కేంద్ర ఎన్నికల సంఘం వాటి మీద ఎన్నికలను నిర్వహిస్తుంది. అపుడు టీడీపీకి చెందిన ఆశావహులకు చాన్స్ దక్కుతుంది. అలా మెల్లగా వైసీపీని తగ్గించి తమ బలం మండలిలో పెంచుకుని అక్కడా పాగా వేద్దామని చూస్తున్న టీడీపీ వ్యూహానికి వైసీపీ ప్రతి వ్యూహం ఇది అని అంటున్నారు.

రాజీనామా చేసిన వారిని వరసబెట్టి ఆమోదించి ఉంటే ఈపాటికి మండలిలో సగానికి సగం వైసీపీ ఖాళీ అయ్యేది అని కూడా అంటున్నారు. ఆ రకమైన రాజకీయ తెలివిడి ఉండబట్టే వైసీపీ తమ వారు అయిన మండలి చైర్మన్ తో ఈ విధంగా చేయిస్తోందా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఇది ఒక విధంగా చూస్తే తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ వద్ద బీఆర్ఎస్ పెట్టిన వినతి లాగానే ఉంది. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ కోరింది. దానికి స్పీకర్ అలా పరిశీలనలోనే ఉంచారు అని బీఆర్ఎస్ భావించి కోర్టుకు వెళ్ళింది. అయితే కోర్టు ఈ విషయం ఎపుడు తేలుస్తారు అని స్పీకర్ ఆఫీసుని అడిగింది. దాని మీద చెప్పాల్సింది చెప్పమని కోరినట్లుగా వార్తలు వచ్చాయి.

ఇపుడు శాసనమండలి విషయంలో కూడా చైర్మన్ తమ రాజీనామాలు ఆమోదించకుండా ఉంటే తాము కూడా న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుందా అని ముగ్గురు ఎమ్మెల్సీలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. న్యాయ పోరాటం చేసినా స్పీకర్ కానీ చైర్మన్ కానీ స్వతంత్ర రాజ్యాంగ బద్ధ వ్యవస్థలకు అధిపతులుగా ఉన్నారు. రాజీనాలు ఎవరు ఎపుడు చేసిన అమోదించేందుకు తగినంత సమయం ఇంకా చెప్పాలీ అంటే తన విచక్షణ మేరకు అన్నీ చూసి ఆమోదించేందుకు వీలు ఉంది. అది రాజ్యాంగం కల్పించిన హక్కు.

గతంలో ఏపీ స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా అంత తొందరగా ఆమోదించలేదు. ఒక కీలక టైం లో ఆమోదించారు. ఇపుడు చూస్తే శాసనమండలిలో చైర్మన్ కూడా ఎపుడు ఆమోదించాలి అన్నది తన విచక్షణ మేరకే నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు.

అవసరం అయితే మళ్లీ రాజీనామా చేసిన వారిని పిలిచి మాట్లాడే అధికారం కూడా ఆయనకు ఉంది అని అంటున్నారు. మరి న్యాయ పోరాటం చేస్తే ఎలా ఉంటుంది ఏ రకమైన డైరెక్షన్లు వస్తాయన్నది చూడాల్సిందే. ఏది ఏమైనా ఈ ముగ్గురి రాజీనామాల కధ తేలేవరకూ మిగిలిన వారు రాజీనామాలు చేయరు. ఆ విధంగా చూస్తే ఇప్పటికి అయితే వైసీపీ శాసన మండలిలో సేఫ్ అని అంటున్నారు.

Tags:    

Similar News