ప్రాణాలు తీసిన తీర్థయాత్ర.. విచారణలో సంచలన విషయాలు
మరణించిన వారిలో తొమ్మిది మందిని పోలీసులు గుర్తించగా.. మిగిలిన మరొకరిని గుర్తించాల్సి ఉంది. చనిపోయిన వారంతా ఉత్తరప్రదేశ్ కు చెందిన వారిగా పోలీసులు పేర్కొన్నారు.
షాకింగ్ గా మారిన మధురై రైలు ప్రమాదానికి సంబంధించి సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు.. అసలేం జరిగిందన్న అంశంపై లోతైన విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా పలు షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లక్నో నుంచి తమిళనాడులోని మధురైకు తీర్థయాత్రల స్పెషల్ రైల్ కోచ్ తగలబడిపోవటం.. దీనికి పెద్ద పేలుడు కారణంగా చెప్పటం తెలిసిందే.
అయితే.. ఈ దారుణ దుర్ఘటనకు కారణం.. రైల్లోకి అక్రమంగా తీసుకొచ్చిన గ్యాస్ సిలిండర్ తో పాటు.. పెద్ద ఎత్తున వంట చేసేందుకు ఉపయోగించే కట్టెలు కూడా కారణంగా గుర్తించారు. వంట చేసుకోవటానికి వీలుగా టాయిలెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వైనం.. అనూహ్యంగా పేలుడుకు కారణమైందని చెబుతున్నారు. యూపీలోని లక్నో స్టేషన్ నుంచి బయలుదేరిన ఈ రైలు షెడ్యూల్ ప్రకారం శనివారం రామేశ్వరం వెళ్లి.. ఆదివారం చెన్నై జంక్షన్ కు చేరుకొని.. అనంతరం లక్నోకు వెళ్లాల్సి ఉంది.
ఈ నెల 17న లక్నో నుంచి 64 మందితో కూడిన ప్రయాణికుల టీం తమిళనాడుకు బయలుదేరింది. అయితే.. మధురై రైల్వే స్టేషన్ వద్ద ఈ కోచ్ ను నిలిపి ఉంచగా.. మంటలు చెలరేగి.. కాసేపటికే పెద్ద శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలిపోవటం.. పది మంది దుర్మరణం చెందటం తెలిసిందే. మరణించిన వారిలో తొమ్మిది మందిని పోలీసులు గుర్తించగా.. మిగిలిన మరొకరిని గుర్తించాల్సి ఉంది. చనిపోయిన వారంతా ఉత్తరప్రదేశ్ కు చెందిన వారిగా పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉండగా.. మిగిలిన వారు పురుషులే. ఈ ఉదంతంలో మరో ఎనిమిది మంది గాయాలు పాలై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఉదంతానికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల్ని పోలసీుల్ని సేకరిస్తున్నారు. పేలుడుకు ముందు చెలరేగిన మంటలు ఏ రీతిలో వచ్చాయన్నది ఇప్పుడు క్వశ్చన్ గా మారింది. మంటలు చెలరేగటం ఒక ఎత్తు అయితే.. ఈ కోచ్ నుంచి రెండు వైపుల నుంచి బయటకు వచ్చే ద్వారాలు లాక్ అయిపోవటం.. బోగీకి మరో బోగీకి కనెక్షన్ కూడా మూసి ఉండటంతో మృతుల సంఖ్య పెరిగినట్లుగా భావిస్తున్నారు. మంటలు చెలరేగిన వేళ.. కోచ్ లో దట్టంగా పొగలు కమ్మేయటంతో పలువురు స్ప్రహ కోల్పోయారు. పేలుడుకు దగ్గరగా ఉన్నవారిలో ఎక్కువమంది మరణించినట్లుగా చెబుతున్నారు.
అయితే.. అసలు నిప్పు ఎలా పుట్టింది? గ్యాస్ సిలిండర్ ను ఎలా ట్రైన్లోకి వచ్చిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరింత లోతుగా విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటకు వస్తాయంటున్నారు. ఇక.. మృతదేహాల్ని రోడ్డు మార్గాన చెన్నై ఎయిర్ పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి లక్నోకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.