హైడ్రా అధికారుల అత్యుత్సాహం.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
తాజా కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ శ్రీధర్ బాబు కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా మంత్రి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారీ కూడా మంత్రి శ్రీధర్ బాబు పాత్ర గురించి చెప్పనక్కర్లేదు. గతంలో రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లోనూ ఆయన కీలక శాఖలు నిర్వహించారు. తన తండ్రి శ్రీపాదరావు రాజకీయ వారసత్వంతో దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాజకీయాల్లోకి వచ్చారు. తాజా కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ శ్రీధర్ బాబు కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా మంత్రి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైడ్రా కూల్చివేతల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు వచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఒకరిద్దరు అధికారుల అత్యుత్సాహం వల్లే ఇలా జరిగిందని పేర్కొ్నారు. ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేస్తున్నదని, దానిని సవరణ చేసుకోవల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మూసీతోపాటు చెరువులపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను ఎట్టిపరిస్థితుల్లోనూ తొలగిస్తామని చెప్పారు. అలాగే.. మూసీ పరివాహన ప్రాంతాల్లోని ప్రజలకు పునరావాసం కల్పించాకే ప్రక్షాలన పనులు మొదలు పెడుతామని తెలిపారు.
సామాన్య ప్రజానీకానికి, పేద వారికి అన్యాయం జరగకుండా చూసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే అధికారులు అలా చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు.. అప్పుడప్పుడు అధికారులు అలా అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో చేసే పనులన్నింటినీ అధికారులకు తెలియకుండానే చేస్తున్నారని తెలిపారు.
తాము ప్రస్తావించిన ఆరు గ్యారంటీలతోపాటే హామీ ఇవ్వని వాటిని కూడా అమలు చేసి తీరుతున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రం ఏర్పాటు సమయంలో మిగులు బడ్జెట్‌గా ఉండేదని గుర్తుచేశారు. కానీ.. కేసీఆర్ వచ్చాక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. దానిని సరిదిద్దడంతోపాటు సంక్షేమం, అభివృద్ధిపై తమ ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిపారు. తెలంగాణను మళ్లీ మిగులు రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని వెల్లడించారు.