సిక్కోలు వైసీపీలో సీనియర్ల రూట్ ఎటు ?
వైసీపీలో చాలా మంది నేతలు ఉక్క బోతతో ఉన్నారన్నది తెలిసిందే. పార్టీ ఓటమి చెంది ఆరు నెలల కాలం గడచింది.
వైసీపీలో చాలా మంది నేతలు ఉక్క బోతతో ఉన్నారన్నది తెలిసిందే. పార్టీ ఓటమి చెంది ఆరు నెలల కాలం గడచింది. దాంతో అనేక మంది తమ రూట్ ఏంటో చూసుకుంటున్నారు. మరి కొందరు అయితే ఇంకా అదే అన్వేషణలో ఉన్నారు. వారు పేరుకు వైసీపీలో ఉన్నారు కానీ వేరే విధంగానే ఆలోచనలు సాగుతున్నాయని అంటున్నారు.
ఈ క్రమంలో ఉత్తరాంధ్రా జిల్లాలలో రాజకీయంగా కీలకమైన ప్రాంతంగా ఉన్న శ్రీకాకుళంలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది అంటే సీనియర్ నేతలు పలువురు పూర్తిగా మౌనంగానే ఉంటున్నారు. అందులో ప్రధంగా చెప్పుకోవాల్సింది మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుది. ఆయన రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకునే దశలోనే ఉన్నారు. కానీ ఆయన కుమారుడు ధర్మాన రామ మనోహర్ నాయుడు కోసమే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
ఆయన వైసీపీలో ఉన్నారా లేరా అన్నది ఆయన అభిమానులతో పాటు వైసీపీ అధినాయకత్వానికి కూడా అర్థం కావడం లేదు అని అంటున్నారు. ఆయన అయితే సైలెంట్ గానే ఉంటున్నారు. పార్టీ ఆయనకు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతలు చూడాలని కోరిందని తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం ఆలోచించి చెబుతాను అంటున్నారని ప్రచారంలో ఉంది.
ఇక ధర్మాన తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ చేరుతారు అని అంటున్నారు. ఈ విషయంలో మొదటి ప్రాధాన్యత తెలుగుదేశానికే ఇస్తారని అంటున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను శాసిస్తున్న కింజరాపు కుటుంబీకులు ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.
కింజరాపు ఫ్యామిలీ మొత్తం శ్రీకాకుళం టీడీపీని నడిపిస్తోంది. వారి అనుమతి లేకుండా ఏదీ జరగదు, రాజకీయంగా నాలుగు దశాబ్దాలుగా వేరు వేరు పార్టీలలో ఉంటూ కింజరాపు ధర్మాన కుటుంబాలు పోరాటం చేశాయి. అయితే తెర వెనక పరోక్ష సహకారాలు అవసరం అయినపుడు చేసుకున్నారని కూడా చెబుతారు. అవన్నీ వేరు ఒకే పార్టీలో ఇమడడం వేరు.
ఏది ఏమైనా తన కుమారుడిని టీడీపీలో చేర్పించి 2029 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేయించాలని ధర్మాన చూస్తున్నారు అని అంటున్నారు. ఆ దిశగానే ఆయన ఆలోచనలు సాగుతున్నాయని అంటున్నారు. ఇక మరో నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అని అంటున్నారు.
ఆయనను ఆముదాలవలస ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పించారు. 1983 నుంచి ఈ రోజు దాకా ప్రతీ ఎన్నికలోనూ ఆముదాల వలస నుంచి పోటీ చేస్తూ వస్తున్న తమ్మినేనికి ఈసారి టికెట్ వైసీపీ ఇవ్వదా అన్నదే చర్చగా ఉంది. అక్కడ చింతాడ రవికుమార్ అనే కొత్త ముఖాన్ని తెచ్చి పెట్టారు. ఆయననే పనిచేసుకోమని పార్టీ ఆదేశించింది. దాంతో తమ్మినేని కూడా వైసీపీకి దూరం అవుతారు అన్న ప్రచారం సాగుతోంది. తన కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ కోసమే తమ్మినేని రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
అయితే ఆయనకు వైసీపీ ఈ విధంగా షాక్ ఇవ్వడంతో పెద్దాయన కూడా ప్లేట్ ఫిరాయిస్తారు అన్న టాక్ అయితే నడుస్తోంది. ఇక టీడీపీలో సొంత మేనల్లుడు కూన రవికుమార్ ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా ఉంటున్నారు. దాంతో ఆ పార్టీలో చేరడానికి చాన్స్ లేదని అంటున్నారు. దాంతో జనసేన వైపు తమ్మినేని చూస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఈ విధంగా ఇద్దరు ఉద్ధండులు లాంటి సీనియర్ నేతలు వైసీపీకి ఒకే టైంలో దూరం అయ్యేలాగా ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.