తెలుగు పాలిటిక్స్ 2024 : రాజు గారు మంత్రి గారు అయ్యారు !

కూటమిలో ఏ పార్టీ నుంచి అయినా తానే పోటీ చేసి తీరుతానని ఆయన ధీమా కనబరచారు.

Update: 2024-12-21 04:04 GMT

ఏపీ రాజకీయాల్లో అనూహ్యంగా తెర మీదకు వచ్చి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన వారు భూపతిరాజు శ్రీనివాస వర్మ. ఆయనకు బీజేపీ అధినాయకత్వం నర్సాపురం టికెట్ ఇవ్వడం ఒక విశేషం. ఎందుకంటే నర్సాపురం టికెట్ ని సిట్టింగ్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు ఆశించారు. కూటమిలో ఏ పార్టీ నుంచి అయినా తానే పోటీ చేసి తీరుతానని ఆయన ధీమా కనబరచారు.

ఆయన అనుకున్నట్లే అంతా జరుగుతోంది అని భావించారు. అయితే ఊహించని మలుపులా శ్రీనివాసవర్మకు బీజేపీ నుంచి పిలుపు వచ్చింది. ఆయనకే ఎంపీ టికెట్ ని ఖరారు చేశారు. పొత్తు ధర్మంలో టీడీపీ కూడా సపోర్ట్ చేసింది. అలా మంచి మెజారిటీతో ఆయన గెలిచారు.

ఇక నర్సాపురం నుంచి గెలిచి మంత్రి అయిన వారిలో ఆయన రెండవ వారు చెబుతారు. ఆయన కంటె ముందు 1999 నుంచి 2004 మధ్యలో రెబెల్ స్టార్ కృష్ణం రాజు నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. ఆయన కేంద్రంలో కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ఇక మళ్లీ రెండు దశాబ్దాల తరువాత ఆ అవకాశం శ్రీనివాసవర్మకే దక్కింది. బీజేపీలో ఈసారి ముగ్గురు ఎంపీలు ఏపీ నుంచి గెలిచారు. వారిలో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. అలాగే కేంద్ర పెద్దలతో మంచి పలుకుబడి ఉన్న సీఎం రమేష్ అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. ఈ ఇద్దరిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి దక్కడం ఖాయమని అంతా అనుకున్నారు.

కానీ మోడీతో పాటుగా ప్రమాణం చేసే చాన్స్ శ్రీనివాసవర్మకే దక్కింది. అలా ఎంపీ కావడమే జాక్ పాట్ అనుకుంటే కేంద్ర మంత్రి పదవిని దక్కించుకోవడం డబుల్ జాక్ పాట్ అన్నట్లుగా ఆయన రాజకీయం సుడి తిరిగింది. ఇదంతా ఆయనకు 2024లోనే జరిగింది.

గతంలో ఆయన బీజేపీలో పనిచేస్తూ వచ్చారు. పార్టీ తరఫున ప్రచారమూ చేశారు. ఒకటి రెండు సార్లు పోటీ చేసినా ఓటమి పాలు అయ్యారు. కానీ ఈసారి రాజకీయ సిరి ఆయన ఇంటి తలుపు తట్టి మరీ ఇలా అందలం మీద కూర్చోబెట్టింది అని అంటున్నారు.

దశాబ్దాలుగా బీజేపీ కోసం పనిచేస్తూ నిబద్ధ్తత కలిగిన నేతగా హైకమాండ్ వద్ద గుర్తింపు తెచ్చుకున్న ఫలితమే ఇదంతా అని అంతా అంటున్నారు కాలం కూడా కలసి రావాలి కదా అన్నది కూడా ఉంది. అలా చూస్తే కనుక 2024 ఆయన రాజకీయ టైం ని మార్చేసింది అని అంటున్నారు. అందుకే రాజు గారు మంత్రి గారు అయ్యారని అనుచరులు సంబరం వ్యక్తం చేస్తున్నారు. వారికి 2024 ఎప్పటికీ గుర్తుండే ఇయర్ అని కచ్చితంగా చెబుతున్నారు. ఒక మామూలు బీజేపీ నేతగా 2024కి స్వాగతం పలికిన శ్రీనివాసవర్మ కేంద్ర మంత్రిగా మారి 2025కి స్వాగతం పలుకుతున్నారు. మరి ఆ క్రెడిట్ 2024కి ఇవ్వాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News