అబ్కారీ మంత్రి హ్యాట్రిక్ కొట్టేనా?

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు ఆ నాయకుడు.

Update: 2023-11-15 01:30 GMT

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు ఆ నాయకుడు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. వరుసగా రెండు సార్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్ర్కతిక, పురావస్తు శాఖల మంత్రిగా ఉన్నారు. ఈ అబ్కారీ మంత్రి మూడోసారి విజయంపై కన్నేశారు. ఆ నాయకుడే శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ లో కీలక నేతల్లో ఒకరిగా వెలుగొందుతున్న ఆయన మరోసారి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు.

అయితే శ్రీనివాస్ గౌడ్ హ్యాట్రిక్ విజయం కొట్టడం అంత సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ నుంచి యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ తరపున మిథున్ రెడ్డి పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ 86,474 ఓట్లు దక్కించుకున్నారు. ఈ సారి మరింత మెజారిటీతో గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో తనకు పోటీగా నిలబడ్డ ఎం.చంద్రశేఖర్, సయ్యద్ ఇబ్రహీం, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ లు ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరడం తనకు కలిసొస్తుందని శ్రీనివాస్ గౌడ్ భావిస్తున్నారు. అంతే కాకుండా నియోజకవర్గంలో చేసిన డెవలప్మెంట్, వివిధ కార్యక్రమాల గురించి ప్రచారం చేస్తూ సాగుతున్నారు.

మరోవైపు బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణుల్లో అసంత్రుప్తి శ్రీనివాస్ గౌడ్కు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక భూ కబ్జా ఆరోపణలు దెబ్బకొట్టొచ్చు. ఇక 2014లో ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఈ సారి కాంగ్రెస్ నుంచి గెలుపే లక్ష్యంగా సాగిపోతున్నారు. 2012 ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆయన ఇక్కడ గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓట్లు అడుగుతున్నారు. ఇక స్పేస్ టెక్నాలజీ సంస్థ ఏఈఆర్ఓసీలో డైరెక్టర్ గా ఉన్న మిథున్ రెడ్డి ఎవరో కాదు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు. యువత ఓట్లను రాబట్టి విజయం సాధించాలనే పట్టుదలతో మిథున్ ఉన్నారు. మరి మహబూబ్ నగర్ ప్రజలు ఎవరికి జై కొడతారో చూడాలి

Tags:    

Similar News