బెంజ్ కారు కన్నా కాస్ట్లీ గా మారిన స్టాగ్ బీటిల్..
స్టాగ్ బీటిల్.. ఇదేదో మామూలు పురుగు అని అనుకునేరు.. దీని ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.
స్టాగ్ బీటిల్.. ఇదేదో మామూలు పురుగు అని అనుకునేరు.. దీని ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. సుమారు 2 నుంచి 6 గ్రాముల బరువు ఉండే ఈ స్టాగ్ బీటిల్ ధర సుమారు 75 లక్షలు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకాలలో ఒకటి. దీని జీవితకాలం సుమారు మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది. ఇంతకీ ఇంత ఖరీదు పెట్టి కొనడానికి ఈ కీటకం యొక్క ప్రత్యేకత ఏమిటి అని ఆలోచిస్తున్నారా? అయితే దీని గురించి తెలుసుకుందాం పదండి..
స్టాగ్ బీటిల్ పేరు మగ కీటకాల తలపై కనిపించే విలక్షణమైనటువంటి మాండబుల్స్ కారణంగా వచ్చింది. చూడడానికి ఇవి స్టాగ్స్ కొమ్మును పోలి ఉంటాయి. సంతానోత్పత్తి కోసం మగ పురుగులు ఆడవాటితో జతకట్టే సమయంలో తమ కొమ్ముల వంటి కొండెలను ఉపయోగిస్తాయి. ఈ కీటకాలను కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు తయారీలో కూడా ఉపయోగిస్తారు.
ఈ స్టాగ్ బీటిల్స్ ఎక్కువగా వెచ్చని, ఉష్ణ మండల వాతావరణంలో ఉంటాయి. సహజంగా అడవుల్లో ఇవి ఎక్కువగా నివసిస్తాయి. కానీ కొన్ని సందర్భాలలో పట్టణ ప్రాంతాలలోని ముళ్లపొదలు, పార్కుల దగ్గర కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా ఇది చెట్టు బెరడును ఆహారంగా తీసుకుంటాయి. వీటి లార్వాలు తప్పు పట్టిన కలపను తింటాయి. సహజంగా చనిపోయిన చెట్లు, కొమ్మలు ఆహారంగా చేసుకుంటారు కాబట్టి వీటివల్ల పచ్చని చెట్లకు ఎటువంటి హాని కలగదు.
పురుగులే కదా అని వీటిని తక్కువగా చూసేరు.. పక్క దేశాల్లో వీటిని బంగారం గా భావిస్తారు. లక్షల డబ్బు ఖర్చుపెట్టి మరి ఈ పురుగులను కొంటారు. ఎందుకంటే ఈ పురుగుని ముఖ్యంగా అదృష్టానికి సూచికగా భావిస్తారు.
బ్రిటన్ దేశంలో ఈ పురుగుకు సంబంధించి విషయాల వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ స్టాగ్ బీటిల్ ఉన్నవారు రాత్రికి రాత్రి అదృష్టం పట్టి కోటీశ్వరులు అయిపోతారని నమ్మకం. అందుకే దీనికి అంత ధర పలుకుతుంది. ఈ పురుగు బ్రిటన్, పశ్చిమ ఐరోపా దేశాలలో ఎక్కువగా దొరుకుతుంది.