మోడీతో స్టాలిన్ : స్ట్రాటజీ కరెక్టేనా ?

నిన్నటికి నిన్న తమిళనాడుకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.;

Update: 2025-04-07 12:30 GMT
Modi Tour In Tamil Nadu

రాజకీయం వేరు. రాజ్యాంగబద్ధ విధానం వేరు. రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి పదవులు తీసుకున్న వారు రాజ్యాంగం ప్రకారమే వ్యవహరించాలి. అయితే దురదృష్టవశాత్తు జరుగుతున్నది వేరేగా ఉంది. చివరికి ఇదొక దుస్సాంప్రదాయంగా మారుతోందా అన్న చర్చ సాగుతోంది.

దేశానికి ప్రధాని అయినా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయిన్నా మనకు ఉన్న పార్టీల విధానం బట్టి వాటి ద్వారానే ఎన్నిక అవుతారు. అయితే వారిని దేశానికి రాష్ట్రాలకు ప్రతినిధులుగా చూస్తారు తప్ప పార్టీల పరంగా కాదు. గతంలో దేశంలో అలాగే జరిగేది.

అయితే గడచిన కొంతకాలంగా మాత్రమే ఈ విషయంలో మార్పు వస్తోంది. దేశానికి ప్రధానిగా ఉన్న వారు తమ సొంత రాష్ట్రానికి వస్తే వారిని కలసి స్వాగతించడం, వేదికలు పంచుకోవడం, రాష్ట్ర సమస్యలు వీలైతే చర్చించడం ఇదంతా ఒక అనవాయితీగా వస్తోంది. కేంద్రంలో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రధానులుగా ఉండేటప్పుడు ఉమ్మడి ఏపీకి ఎన్టీఆర్ సీఎం గా వ్యవహరించేవారు. అయితే ఏపీకి వారు వచ్చినపుడు సీఎం హోదాలో ఆయన పక్కనే ఉంటూ వారికి వెల్ కం చెప్పేవారు.

అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. రాజకీయంగా చూస్తే టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ అని ఉన్నా కూడా అధికారిక కార్యక్రమాలలో దానిని ఎక్కడా రానిచ్చేవారు కాదు. కానీ ఇపుడు ఆ స్పూర్తి అయితే కనిపించడం లేదు అన్నదే చర్చగా ఉంది. నిన్నటికి నిన్న తమిళనాడుకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా రామేశ్వరంలో సభ జరిగింది. అయితే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అయితే ఎక్కడా కనిపించలేదు. ఆయన ప్రధానితో కలసి వేదిక పంచుకోకూడదు అని భావించారో ఏమో తెలియదు కానీ గైర్ హాజరు అయ్యారు. ఇక వేదిక మీద నుంచి ప్రధాని ఇండైరెక్ట్ గా స్టాలిన్ మీద సెటైర్లు వేశారు. కొందరు ఎపుడూ ఏడుస్తూనే ఉంటారని విమర్శించారు. తమిళనాడుకు తాము ఎంతో చేశామని చెప్పుకున్నారు. గతంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాల కంటే అధికంగా నిధులు ఇచ్చామని లెక్కలు చూపించారు.

ఇలా ప్రధాని మోడీ స్టాలిన్ ని విమర్శిస్తూ తాము చేసిన పనులు చెప్పుకున్నారు. అదే వేదిక మీద స్టాలిన్ ఉంటే కనుక తమిళనాడుకు కేంద్రం ఏమి ఇవ్వలేదో చెప్పి ఉండేవారు కదా. లేదా ఫలానా సమస్యలు ఉన్నాయి పెండింగులో పెట్టారు, వాటిని క్లియర్ చేయండి అని ప్రజల తరఫున అడిగే వీలు ఉండేది కదా. వేదిక అధికారికం అయినపుడు బీజేపీ ప్రధాని అని రాజకీయ కోణంలో నుంచి చూసి గైర్ హాజర్ కావడం ద్వారా స్టాలిన్ చేసినది కరెక్టేనా అన్న చర్చ వస్తోంది.

ఈ దేశంలో ఏది జరిగినా రాజ్యాంగబద్ధంగా జరగాలి. కేంద్రం పెద్దన్నగా ఉంటోంది. రాష్ట్రాలకు నిధులు కావాల్సి వస్తే కేంద్రాన్నే అడగాలి. మరి ఆ కేంద్ర అధినాయకత్వం మీద ఎందుకు వ్యతిరేకత అన్న చర్చ వస్తోంది. పైగా రాజ్యాంగబద్ధంగా హక్కులు ఉంటాయి. వాటిని డిమాండ్ చేసి సాధించుకోవాలి. కేవలం వేరే పార్టీ అని ముఖం చూపించకుండా ఉండడం వల్ల ఒరిగేది ఏమిటి అన్న చర్చ అయితే ఉంది.

గతంలో కేసీఆర్ కూడా మోడీ వస్తే స్వాగతం పలికేవారు కాదు, వేదిక పంచుకునేవారు కాదు, చివరికి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడింది అని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ కూడా మోడీతో వేదిక పంచుకోరని చెబుతారు. ఈ విధంగా చేయడం రాజకీయ వ్యూహమైతే కావచ్చు. కానీ దాని ఫలితాలు చేదుగానే ఉంటున్నాయని తెలిసి కూడా అదే స్ట్రాటజీ అమలు చేస్తున్నారు అని అంటున్నారు. తమ రాష్ట్రానికి వస్తే కలవని ముఖ్యమంత్రులు తిరిగి అదే ప్రధాని అపాయింట్మెంట్ కోరుతారు.

మరి అపుడు రాజ్యాంగబద్ధమైనది ఇపుడు ఎందుకు కాదు అన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది. రాజకీయాలు పక్కన పెట్టి కేంద్రం రాష్ట్రాలు పనిచేయాలి. అలాంటి సామరస్యం అటూ ఇటూ కూడా కోరుకోవాలి. తమిళనాడులో ప్రధాని టూర్ లో స్టాలిన్ కనిపించకపోవడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. చూడాలి మరి దీని ఫలితాలు ఏలా ఉంటాయో.

Tags:    

Similar News