‘అప్పా’ ఇమేజ్ కోసం తపిస్తున్న స్టాలిన్

రాజకీయాల్లోకి వచ్చే వారిని గమనిస్తే చాలా ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. తొలుత గుర్తింపు కోసం తహతహ కనిపిస్తుంది.;

Update: 2025-03-11 07:05 GMT

రాజకీయాల్లోకి వచ్చే వారిని గమనిస్తే చాలా ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. తొలుత గుర్తింపు కోసం తహతహ కనిపిస్తుంది. ఆ దశను విజయవంతంగా దాటితే.. హోదా కోసం తపించటం మొదలవుతుంది. ఆ దశను సక్సెస్ ఫుల్ గా రీచ్ అయితే.. ఆ తర్వాత తమ పేరును బ్రాండ్ గా మార్చుకోవాలన్న ఆలోచనలు ఎక్కువ అవుతాయి. అది కూడా పూర్తి అయితే.. ప్రజలతో భావోద్వేగ బంధానికి ప్రయత్నించటం.. అందుకోసం ప్రజల కుటుంబాల్లో తాను ఒకడిగా మారాలన్న ఆసక్తి ఎక్కువ అవుతుంది.

ఎన్టీఆర్ ను అన్నా.. జయలలితను అమ్మా.. కేసీఆర్ ను బాపూ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అధినేతలకు ఉండే లక్షణమే.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కోరుకుంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఎంతోమంది అధినేతలు ఉన్నప్పటికి.. జయలలితకు ఉండే ఇమేజ్ కాస్త భిన్నమైనదిగా చెప్పాలి. తమిళనాడులోని రాజకీయ అధినేతల్ని చూసినప్పుడు వారి పేరు ముందు బిరుదులు కనిపిస్తాయి.

పెరియార్ ను ‘తందై’ అని.. అన్నాదురైను ‘పేరరిజ్ఞర్’ అని.. ఎంజీఆర్ ను ‘పురట్చి తలైవర్’ అని.. కరుణానిధిని ‘కలైజ్ఞర్’ అని.. జయలలితను ‘పురట్చి తలైవి’ అని పిలుచుకోవటం కనిపిస్తుంది అయితే.. మిగిలిన వారికి భిన్నంగా జయలలితను పురట్చితలైవి (విప్లవ నాయికి) అన్న బిరుదుతో పాటు.. ‘అమ్మ’ అంటూ నోరారా పిలుచుకుునేలా చేసుకున్నారు. తమిళనాడు లాంటి రాష్ట్రంలో ‘అమ్మ’ ఇమేజ్ ను సొంతం చేసుకోవటం అంత తేలిక కాదు.. అందులోనూ పురుషాధిక్యత ఎక్కువగా ఉండే ఆ సమాజంలో.. పురుషాధిక్యతను సవాలు చేసి మరీ సక్సెస్ అయిన అరుదైన అధినేత్రిగా జయలలితను చెప్పాలి.

జయలలిత తర్వాత ఇప్పుడు ఆమెకు మాత్రమే సొంతమైన ఇమేజ్ ను సొంతం చేసుకోవాలన్నదే ముఖ్యమంత్రి స్టాలిన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందుకోసం ఆయన పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పేరుకు ముందు ఉండే బిరుదు కంటే కూడా అందరి చేత అప్పా ‘నాన్న’ గా పిలుచుకోవాలని తపిస్తున్నారు స్టాలిన్. అందుకు తనకు తానే.. తనను అందరూ అప్పా అని పిలుస్తున్నట్లుగా పలు వేదికల మీద చెప్పుకోవటం కనిపిస్తుంది.

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడిన సీఎం స్టాలిన్.. విద్యార్థులు తనను అప్పా.. అప్పా అని పిలుస్తుంటే తనకు చెప్పలేనంత ఆనందం కలుగుతోందని చెప్పటం ద్వారా.. అందరూ తనను అప్పా అన్న మాటను పిలవాలని కోరుకుంటున్న విషయం అర్థమవుతుంది. తన ఇమేజ్ ను మరింత పెంచుకునేందుకు వీలుగా స్టాలిన్ ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ ఏడాది బడ్జెట్ లో అప్పా పేరుతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాల్ని ప్రకటించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అమ్మ క్యాంటిన్.. అమ్మా ఉప్పు.. అమ్మా మినీ క్లినిక్.. అమ్మా కుడినీర్.. అమ్మా స్కూటర్.. అమ్మా ల్యాప్ టాప్ లాంటి పథకాలతో జయలలిత పేరును మరిచిపోయి అమ్మగా తమిళ ప్రజలకు ఎంతలా దగ్గరయ్యారో తెలిసిందే. ఇప్పుడు అదే తరహా ఇమేజ్ కోసం స్టాలిన్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా చెబుతున్నారు. ప్రజలతో భావోద్వేగ బంధాన్ని ఏర్పర్చుకుంటే వారసత్వ రాజకీయాలు మరింతకాలం మనుగడలో ఉంటాయన్న వాదనను కాదనలేం.

Tags:    

Similar News