స్టాలిన్ ప్రాంతీయ మమకారం !
కేంద్రం తలపెట్టిన డీలిమిటేషన్ విధానానికి వ్యతిరేకంగా చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశంలో ఒక విశేషం చోటు చేసుకుంది.;
కేంద్రం తలపెట్టిన డీలిమిటేషన్ విధానానికి వ్యతిరేకంగా చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశంలో ఒక విశేషం చోటు చేసుకుంది. ఈ సమావేశం స్థానిక ఒక హొటెల్ లో సాగింది. ఈ సమావేశంలో ప్రత్యేకత ఏమిటి అంటే హాజరైన ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక నేతలు కూర్చున్న కుర్చీల ముందు పెట్టిన నేమ్ ప్లేట్స్ లో ఇంగ్లీష్ తో పాటు వారి ప్రాంతీయ భాషలలోనూ వాటిని ఏర్పాటు చేయడం.
అలా తెలంగాణా సీఎం సీటు ముందు తెలుగులో రేవంత్ రెడ్డి అని రాసి ఉంచారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ కుర్చీ ముందు తెలుగులో కె తారక రామారావు అని రాసి ఉంచారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి విషయంలో ఇదే విధానం అవలంబించారు.
ఇదంతా ఎందుకు అంటే డీఎంకే ఇటీవల కాలంలో మీ హిందీ మా మీద రుద్ద వద్దు అని కేంద్రాన్ని గట్టిగా కోరుతూ పోరుకు దిగుతోంది. అదే సమయంలో ప్రాంతీయ భాషలకు ఉన్న గుర్తింపు గౌరవం కాపాడాలని నినదిస్తోంది. ఈ క్రమంలో ఒక వైపు కేంద్రం జనాభా ప్రాతిపదికన తేబోతున్న డీలిమిటేషన్ మీద పోరాడుతూనే మరో వైపు తన ప్రాంతీయ భాషల మమకారాన్ని ఆ విధంగా స్టాలిన్ చాటుకున్నారు అని అంటున్నారు.
అంతే కాదు దక్షిణాది రాష్ట్రాల నాయకులకు కూడా ప్రాంతీయ భాషలని కాపాడుకునే విషయంలో డీఎంకే సాగిస్తున్న పోరాటాన్ని కూడా చెప్పకనే చెప్పినట్లు అయింది అని అంటున్నారు. దీంతో ఈ విషయం ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఏమి చేసినా స్టాలిన్ చాలా పకడ్బందీగా చేస్తారు అని అంటున్నారు. పార్లమెంట్ లో రాసి ఉంచినట్లుగా ఆయా ప్రతినిధుల పేర్లను ఇంగ్లీష్ తో పాటు వారి ప్రాంతీయ భాషలలో రాయడం ద్వారా డీఎంకే హిందీ వ్యతిరేక విధానానికి కారణాలు ఏమిటి అన్నది చెప్పాల్సింది అలా చెప్పారని అంటున్నారు.
మరో వైపు చూస్తే డీఎంకే హిందీ వ్యతిరేక విధానం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్న నేపధ్యంలో ప్రాంతీయ భాషల ఆవశ్యకత వాటి ప్రాముఖ్యతను గురించి తెలియజేసినట్లు అయింది అని అంటున్నారు. డీలిమిటేషన్ గురించి మీటింగ్ పెట్టినా కూడా అందులో కూడా ప్రాంతీయ భాషల ప్రాధాన్యత గురించి అన్యాపదేశంగా డీఎంకే అధినాయకత్వం ప్రస్తావించింది అని అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ అంశాల మీద మరింత గట్టిగా సౌత్ స్టేట్స్ పోరాడేందుకు తగిన విధంగా సమాయత్తం చేయడానికే ఇదంతా అని కూడా అనుకోవచ్చు అని అంటున్నారు.