స్టాలిన్ ఉగాది విషెస్.. అంత వివాదాస్పదం ఎందుకంటే..?
గత కొన్ని రోజులుగా హిందీ భాష అమలు, డీలిమిటేషన్ వంటి అంశాల విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. కేంద్రంపై ఫైరవుతున్న సంగతి తెలిసిందే.;

గత కొన్ని రోజులుగా హిందీ భాష అమలు, డీలిమిటేషన్ వంటి అంశాల విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. కేంద్రంపై ఫైరవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆ అంశాలపై దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకతాటిపైన ఉండాలని ఆయన కోరుతున్నారని అంటారు. ఈ నేపథ్యంలో ఆయన పెట్టిన పోస్ట్ ఒకటి కన్నడ వాసులకు కోపం తెప్పించింది.
అవును... ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా... తెలుగు, కన్నడ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే.. అందులో కన్నడిగులను ఆయన ద్రవిడులుగా పేర్కొనడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... నూతన సంవత్సరాదికి కొత్త ఆశలతో స్వాగతం పలుకుతున్న తెలుగు, కన్నడ మాట్లాడే ద్రవిడ సోదరులు, సోదరీమణులకు ఉగాది శుభాకాంక్షలు. హిందీ భాష బలవంతపు అమలు, డీలిమిటేషన్ వంటి భాషా, రాజకీయ ముప్పుల నేపథ్యంలో ప్రస్తుతం దక్షిణాది ఐకమత్యంతో ఉండటం అత్యవసరం అని స్టాలిన్ పోస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలోనే... మన హక్కులు, గుర్తింపును అణగదొక్కే ప్రతి ప్రయత్నాన్ని మనమంతా కలిసి ఓడించాలని.. ఈ ఉగాది మన ఐక్యతకు స్ఫూర్తిగా నిలవాలని చెబుతూ... అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటూ తెలుగు, కన్నడలో రాశారు.
ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కన్నడ ప్రజలను ద్రవిడులుగా సంభోదించడంపై కొంతమంది కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా... బలవంతపు హిందీ అమలు, డీమిలిటేషన్ పై మీతో కలిసి పోరాడేందుకు కన్నడిగులు ఎప్పుడూ సిద్ధమే అని స్పష్టం చేశారు.
అయితే... తాము ద్రవిడులం కాదని.. అది గుర్తుపెట్టుకోవాలని.. కన్నడ ద్రవిడ భాష కాదని ఆయన వారు స్టాలిన్ పోస్టుపై కామెంట్లు పెడుతున్నారు. దీంతో.. ఈ విషహ్యం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.