ఈఎంఐలు కట్టనివారి కోసం.. ఆ బ్యాంకు ఐడియా సూపర్!
బ్యాంకుల్లో వివిధ అవసరాల కోసం పర్సనల్ లోన్లు, వెహికల్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, హౌసింగ్ లోన్లు తీసుకుంటుంటారు
బ్యాంకుల్లో వివిధ అవసరాల కోసం పర్సనల్ లోన్లు, వెహికల్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, హౌసింగ్ లోన్లు తీసుకుంటుంటారు. వీరిలో కొంతమంది ఈఎంఐలు (నెలవారీ వాయిదాలు) సక్రమంగా చెల్లించరు. ఒకటి రెండు వాయిదాలు సరిగా చెల్లించి ఆ తర్వాత ఏవైనా ఇబ్బందులు తలెత్తితే సకాలంలో కట్టలేక వదిలేస్తుంటారు.
ఇలాంటప్పుడు సాధారణంగా ఏ బ్యాంకు అయినా ఏం చేస్తుంది? లోన్లు తీసుకున్నవారి ఫోన్లకు మెసేజులు పంపుతుంది. అలాగే బ్యాంకు ఎగ్జిక్యూటివ్ కాల్స్ చేస్తారు. ఈఎంఐ ఎప్పుడు కడతారని సతాయిస్తుంటారు. అలాగే ఇంటికి బ్యాంకు నోటీసులు పంపుతుంది. కొన్ని బ్యాంకుల ఎగ్జిక్యూటివ్ లు అయితే నేరుగా ఇంటికే వచ్చి ఈఎంఐల గురించి వాకబు చేస్తుంటారు.
అయితే ఈఎంఐ చెల్లించకుండా తప్పించుకోవాలనుకునేవారు సాధారణంగా బ్యాంకులు చేసే కాల్స్ కు స్పందించరు. కాబట్టి ఫోన్ కాల్స్ కాకుండా నేరుగా కస్టమర్లకు ఇంటికే వెళ్లి గుర్తు చేయడం ఉత్తమ మార్గమని ఎస్‌బీఐ భావిస్తోంది. మెరుగైన వసూళ్లను సాధించడానికి ఇంతకంటే మంచి మార్గం లేదని ఆ బ్యాంకు అనుకుంటోంది.
ఈ నేపథ్యంలో స్టేట్ ఆఫ్ బ్యాంకు ఇండియా (ఎస్‌బీఐ) మాత్రం కొత్త పంథాను ఎంచుకుంది. ఈఎంఐలు కట్టకుండా సతాయించేవారి కోసం ఇప్పుడు వినూత్న ఐడియాతో ముందుకొచ్చింది. లోన్లు తీసుకుని నెలవారీ వాయిదాలు కట్టనివారికి వినూత్నంగా నిరసన తెలుపుతోంది.
ఈఎంఐలు చెల్లించనివారికి ఇక నోటీసులు, ఫోన్ కాల్స్ కాకుండా నేరుగా ఇంటికే వెళ్లి చేతిలో చాక్లెట్లు పెట్టి శుభాకాంక్షలు చెప్పి వాయిదా కట్టేలా చేస్తోంది.
ఎస్‌బీఐ రిటైల్ లోన్ లెక్కల ప్రకారం... గతేడాది రూ.10,34,111 కోట్ల నుంచి 16.46 శాతం పెరిగి రూ. 12,04,279 కోట్లకు రిటైల్ లోన్లు చేరుకున్నాయి. 2023 జూన్ త్రైమాసికంలో మొత్తం రిటైల్ రుణాలు 13.9 శాతం వృద్ధి చెంది రూ. 33,03,731 కోట్లకు చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలో మొండి బకాయిల వసూలుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించే రెండు ఫిన్ టెక్ కంపెనీలతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎస్‌బీఐలో రిస్క్ విభాగానికి ఇన్‌చార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న అశ్విని కుమార్ తివారీ వెల్లడించారు.
ఈ ఫిన్ టెక్ ప్రతినిధులు ఈఎంఐ చెల్లించని కస్టమర్ల ఇళ్లకు వెళ్లి చాక్లెట్ల ప్యాక్ ఇచ్చి ఈఎంఐ బకాయిని గుర్తుచేస్తారని తెలిపారు. అయితే ఇది ఇంకా పైలట్ దశలోనే ఉందన్నారు. కేవలం 15 రోజుల క్రితమే దీనిని అమలులోకి తెచ్చామని చెప్పారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే ఇక అధికారికంగా అమలు చే స్తామని తెలిపారు.