సర్వేలు ముగిసాయి.. జోస్యాలు మిగిలాయి !
ఏపీలో చూస్తే గత మూడు నెలల నుంచి అనేక రకాల సర్వేలు ఊదరగొట్టాయి. సోషల్ మీడియా అంతా సర్వేల మయంగానే ఉంది.
ఆశ మనిషిని బతికిస్తుంది. అదే శ్వాసగా నిలుస్తుంది. రాజకీయాలలో ఆశ కంటే మించిన పెట్టుబడి వేరేది లేదు. అందుకే రాజకీయ పార్టీలు ఆశతోనే జీవిస్తాయి. కౌంటింగ్ చివరి లెక్క వరకూ మేమే గెలుస్తామని నిబ్బరంగా ప్రకటించడం వెనక ధీమాతో పాటు వ్యూహాలూ ఉంటాయి.
ఏపీలో చూస్తే గత మూడు నెలల నుంచి అనేక రకాల సర్వేలు ఊదరగొట్టాయి. సోషల్ మీడియా అంతా సర్వేల మయంగానే ఉంది. ఈసారి వచ్చినన్ని సర్వేలు గతంలో ఎన్నడూ లేవు అన్న మాట కూడా ఉంది. గల్లీ సర్వేల నుంచి ఢిల్లీ సర్వేల వరకూ యూట్యూబ్ లో సొంత చానళ్ళ నుంచి ప్రముఖ్య మీడియా చానళ్ల వరకూ సర్వేశ్వరులు మూడవ కన్నుతో చూసి మరీ ఏ పార్టీకి అధికారం వస్తుందో తమదైన రాజకీయాన్ని రంగరించి మరీ చెప్పేశారు .
ఇలా ప్రీ పోల్ సర్వే పోస్ట్ పోల్ సర్వేలతో హుషారు చేసి కౌంటింగ్ ముందరకు వచ్చేసరికి అలసిపోయాయి. అదే సమయంలో జనాలకు కూడా సర్వేల మీద ఆసక్తి తగ్గిపోయింది. ఇపుడు ఇదే సరైన సమయం అన్నట్లుగా జోస్యాలు జోరు చేస్తున్నాయి. ఇపుడు జ్యోతీష్య పండితులు తెర మీదకు వస్తున్నారు. అలాగే గవ్వతో జోస్యం చెప్పే వారు వస్తున్నారు. సంఖ్యా శాస్త్ర నిపుణులు సీఎన్ లోకి ఎంటర్ అవుతున్నారు.
ఇలా అందరూ కలసి జాతకాలు తేల్చుతున్నారు. ఫలానా పార్టీ గెలుస్తుంది అంబ పలుకుతోంది ఇదే అని నమ్మకంగా చెబుతున్నారు. మేము కనుక చెప్పింది తప్పు అయితే ఇక జోస్యాలు మానేస్తామని కూడా సవాల్ చేస్తున్న వారూ ఉన్నారు. గతంలో తాము చెప్పిన జోస్యాలు ఎంత ఫలవంతం అయ్యాయో కూడా సక్సెస్ ట్రాక్ రికార్డు చెబుతూ నమ్మకాన్ని పెంచేస్తున్నారు.
గోచారాలు బాగున్నాయి కాబట్టి ఆయనే సీఎం అంటున్న వారు కొందరు అయితే ఫలానా స్థానంలో శని కోపంగా చూస్తున్నాడు కనుక ఆయనకు పదవీ యోగం లేదు అని మరో పండితుడు అంటున్నారు. ఈయనకు రాజయోగం లేదు ఈ జన్మలో సీఎం కాడు అని ఇంకో జోతిష్కుడు బల్ల గుద్దుతూంటే ఈయనకు తిరుగు లేదు ఇక జీవితకాలం పీఠం ఏలాల్సిందే అని మరొకరు అంటున్నారు.
ఇపుడు కౌంటింగ్ కి కౌంట్ డౌన్ అవుతున్న వేళ ఈ జోస్యాల మీద రాజకీయ పార్టీలు విపరీతంగా నమ్మకాన్ని పెంచుకుంటున్నాయి. చిత్రమేంటి అంటే ఒకే నక్షత్రం, ఒకే నాయకుడు కానీ జోతీష్యం మాత్రం భిన్నంగా చెబుతుంది. ఒక పండితుడు అయితే ఇక రాజయోగం లేదు అంటే మరో జ్యోతిష్య బ్రహ్మ అదేలా కుదురుతుంది. జెర్రి పోతులా ఆయన రాజయోగం జాతకంలో కనిపిస్తూంటేనూ అని గట్టిగా వాదిస్తున్నారు.
ఇక సర్వేల మీద బోరు కొట్టిన వారు లేక నమ్మకం తగ్గించుకున్న వారు జోస్యాలనే హైలెట్ చేస్తున్నారు. ఆయా పార్టీలకు చెందిన క్యాడర్ సైతం తమకు అనుకూలమైన జోస్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ గెలుపు మాదే సుమా అని పూర్తి స్థాయిలో ఆనందాన్ని పొందుతున్నాయి. వీటిని చూసిన మేధావులు మంత్రాలకు చింతకాయలు రాలే కాలమా అని అంటున్నారు.
అయితే ఎవరు ఏమనుకున్నా డూ ఆర్ డై అన్నట్లుగా పోరాడిన పార్టీలకు నేతలకు గుండెల్లో నూటొకటి కొడుతోంది. దాంతో తమకు మద్దతుగా ఏ చిన్న మాట వినవచ్చినా కొండంత ఊరటను పొందుతున్నారు. ఈ జోస్యాలు సర్వేలు అన్నీ కూడా కౌంటింగ్ కేంద్రం బయటే ఆగిపోతాయి అన్నది నిజం. అసలైన జాతకం ఈవీఎం చెబుతుంది. అదే మూడవ నేత్రం తెరచిన సర్వేశ్వరుడు. అదే అందరి నుదిటి రాతలు రాసే అపర జోస్యుడూ. సో అంతవరకూ వెయిట్ చేయాల్సిందే ఎవరైనా.