ఏవీ వర్సెస్ అఖిల ప్రియ: అధిష్టానం ఎవరి పక్షం ..!
వీరి మధ్య మొదట్లో బాగానే ఉన్నప్పటికీ.. తర్వాత తర్వాత రాజకీయంగా విభేదాలు మొదలయ్యాయి.
ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. ఒకే పార్టీలో నాయకులు కూడా! పైగా నిరంతరం మీడియాలో కనిపిస్తుంటా రు. ఏదో ఒక వివాదంతో ఎప్పుడూ కీచులాడుకుంటూనే ఉంటారు. పైగా ఇద్దరిపైనా కేసులు కూడా ఉన్నా యి. వారే.. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఏవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. వీరి మధ్య మొదట్లో బాగానే ఉన్నప్పటికీ.. తర్వాత తర్వాత రాజకీయంగా విభేదాలు మొదలయ్యాయి. ఎవరికి వారు తమదే పైచేయి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ తరచుగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆయనపై జరిగిన హత్యా యత్నం కేసులోనూ ప్రియ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే.. తాజాగా ఏవీ సు బ్బారెడ్డికి ఉన్న సొంత ఇల్లుపై ప్రియ కన్నేశారు. తన నియోజకవర్గం ఆళ్లగడ్డలో ఏవీకి సొంతగా ఇల్లుంది. అయితే.. దీనిని ఏదో ఒక విధంగా కూలగొట్టాలన్నది అఖిల ప్రియ రాజకీయ ఉద్దేశం. కానీ, ఇది ముందుకు సాగడం లేదు. రోడ్డును ఆక్రమించి కట్టారని చెబుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు.
పైగా.. ఏవీని నియోజకవర్గంలో ఉండకుండా చేసేందుకు కూడా.. అఖిల ప్రయత్నాలు చేస్తున్నారని సుబ్బారెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తరచుగా అఖిల ప్రియ ధర్నాలు, నిరసనలతో సంచలనాలకు దిగుతున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో అఖిల ప్రియను ఓడించేందుకు సుబ్బారెడ్డి ప్రయత్నించారన్న వాదన ఉంది. ఈ నేపథ్యం ఇద్దరి మధ్య వివాదాన్ని మరింత పెంచింది. కట్ చేస్తే.. అధిష్టానం మాటేంటి? అనే చర్చ తెరమీదికి వస్తుంది.
ఈ విషయానికి వస్తే.. టీడీపీ అధిష్టానం ఏమీ చెప్పడం లేదు. పైకి మౌనంగా ఉండడం కూడా గమనార్హం. అయితే.. అంతర్గతంగా మాత్రం ఏవీ సుబ్బారెడ్డి వైపే టీడీపీ అధిష్టానం చూస్తోంది. అఖిల ప్రియది ఆధిపత్య పోరుగా నాయకులు భావిస్తున్నారు. పైగా.. సుబ్బారెడ్డికి పార్టీలోని ముఖ్య నాయకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడితో వియ్యం ఉండడం.. ఆయనకు, సీఎం చంద్రబాబుకు మధ్య అవినాభావ సంబంధాలు కూడా ఉండడం కలిసివస్తోంది. దీంతో అధిష్టానం దాదాపు ఏవీ వైపే మొగ్గు చూపుతోందని అంటున్నారు పరిశీలకులు.