బాబు మీద స్వామికి కోపం ఎందుకు...?

ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీతోనూ ఆయనకు ఎపుడో చెడింది.

Update: 2024-09-24 03:36 GMT

బీజేపీకి చెందిన నేత సుబ్రహ్మణ్యస్వామి. తమిళనాడుకు చెందిన ఈ నాయకుడు లాజిక్కులలో కింగ్. న్యాయపరమైన అంశాలలో దిట్ట. కోర్టులలో కేసులు వేయడంలోనూ ఆయన ఘనాపాటి. ఆయనకు చంద్రబాబు అంటే గిట్టదు. ఎందుకు అంటే కారణాలు తెలియవు.

ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీతోనూ ఆయనకు ఎపుడో చెడింది. బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినపుడు మోడీకి ఫుల్ సపోర్ట్ గా ఆయన నిలిచారు. ఆయన మోడీ కేబినెట్ లో ఆర్థికమంత్రి కావాలని అనుకున్నారు అని అంటారు.

అయితే మోడీ ఆయనను పక్కన పెట్టి అరుణ్ జైట్లీకి అవకాశం ఇచ్చారు. ఆయన మరణం తరువాత నిర్మలా సీతారామన్ కి చాన్స్ ఇచ్చారు. అయితే మోడీ మీద నాటి నుంచి స్వామి రగులుతూనే ఉన్నారు అని అంటారు. ఆయన బీజేపీ ఆర్థిక విధానాలను గట్టిగా ప్రశ్నిస్తూ వచ్చారు.

మోడీ అధ్వర్యంలో కేంద్రం తప్పుల మీద తప్పులు చేస్తోంది అని కేంద్రంలో ఉన్న తమ పార్టీనే ఆయన నిలదీస్తూ వచ్చారు. అయితే బీజేపీ పెద్దలు మాత్రం ఆయనను పార్టీలోనే ఉంచారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం 2018లో ముగిసింది కానీ రెన్యూవల్ చేయలేదు.

ఇక ఏపీ సీఎం బాబు విషయంలో స్వామి ఎందుకో మొదటి నుంచి ఆగ్రహంగానే ఉంటున్నారు. అదే సమయంలో ఆయన జగన్ కి మద్దతుగా ఉంటూ వస్తున్నారు అంటారు. ఇక 2024 ఎన్నికల ముందు కూడా బీజేపీని టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దు అని స్వామి గట్టిగానే వాదించారు. కానీ ఆయన మాట ఎవరూ వినలేదు.

కూటమి ప్రభుత్వం ఏపీలో వచ్చింది. కేంద్రంలో ఎండీయే సర్కార్ వచ్చింది. స్వామి కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఇపుడు బాబు తెచ్చిన లడ్డూ ఇష్యూలోకి దూరారు. బాబు తప్పుడు మాటలు చెబుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు నిరాధారం అని కూడా అంటున్నారు.

దాంతో పాటు శ్రీవారి విషయంలో బాబు మహాపచారం చేశారని చంద్రబాబు ప్రభుత్వం అయిదేళ్ళ పాటు కొనసాగడం డౌటే అని ఒక సంచలన కామెంట్ కూడా స్వామి చేశారు. బాబు చేసిన వ్యాఖ్యల మీద తప్పుపడుతూనే శ్రీవారి లడ్డూల ఇష్యూలో వాస్తవాలు తెలిసేలా యాక్షన్ కోరుతున్నారు. అదే సమయంలో ఆయన సుప్రీం కోర్టు ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కోవడానికి రెడీ అయ్యారు.

ఇవన్నీ ఇలా ఉంటే స్వామికి మోడీ బాబు ఇద్దరూ ప్రత్యర్ధులే కాబట్టి ఆయన అందుకే రంగంలోకి దిగారు అని అంటున్నారు. ఈ విషయంలో స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా స్వామి వైఖరి ఉందని అంటున్నారు. ఆయన బీజేపీకి వెనకేసుకుని రావడం కూడా బీజేపీ నేతలకు ఏ మాత్రం మింగుడు పడడం లేదు. మాజీ ఎంపీ బీజేపీ నేత అన్న ట్యాగ్ తో ఆయన చేస్తున్న ఈ న్యాయ యుద్ధం ఏపీలో కూటమికి అర్ధం కావడం లేదు.

ఆయన వైసీపీ అనుకూలురు అని ఊరుకోవడానికి లేదు. అలాగని ఆయనకు ఎదురెళ్ళడానికీ లేదు. మొత్తానికి స్వామి ఎంట్రీతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది అని అంటున్నారు. న్యాయపరమైన అంశాలలో పట్టు ఉన్న స్వామి న్యాయ సమరం ద్వారా ఏమి చేయబోతున్నారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News