ప్రియురాలు అన్న మాటకు బాపట్ల జిల్లా కుర్రాడు ఆత్మహత్య
తాజాగా అలాంటి ఉదంతమే బాపట్ల జిల్లా చీరాలకు అత్యంత దగ్గరగా ఉండే పందిళ్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది.
ప్రేమ చావును కోరుకోకూడదు. ఒకవేళ.. అలా కోరుకుంటే అది కచ్ఛితంగా ప్రేమ మాత్రం కాదు. తెలిసి తెలియని వయసులో మొదలయ్యే ప్రేమలు.. వాటిని అర్థంచేసుకునే కన్నా అపార్థం చేసుకోవటం.. అయినవారికి తీవ్రమైన వేదనను మిగిల్చి బలవన్మరణాలకు పాల్పడటం ఏమాత్రం సరికాదు. తాజాగా అలాంటి ఉదంతమే బాపట్ల జిల్లా చీరాలకు అత్యంత దగ్గరగా ఉండే పందిళ్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది.
ఓవైపు ఆర్థిక సమస్యలు.. మరోవైపు ప్రేమించిన అమ్మాయి పక్కనపెట్టేసిందన్న వేదనతో ఆత్మహత్యకు పాల్పడిన యువకుడి విషాద ఉదంతం షాకింగ్ గా మారింది. పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం డిగ్రీ చదివిన వంశీ క్రిష్ణ తాత అమ్మమ్మ వద్ద పెరిగాడు. చిన్నతనంలో తల్లి చనిపోవటం.. తండ్రి ఊరు వదిలేసి వెళ్లిపోవటంతో అతడ్ని తాతయ్య.. అమ్మమ్మలు పెంచి పెద్ద చేశారు.
డిగ్రీ చదివిన వంశీ క్రిష్ణ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక కారును కొన్నాడు. దానికి చెల్లించాల్సిన ఈఎంఐలను చెల్లించలేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాడు. దీంతో.. లోన్ తీసుకున్న సంస్థ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. ప్రేమించిన యువతి తనను నిర్లక్ష్యం చేస్తుందని ఫీలయ్యే వాడు. గతంలో మాదిరి తనతో ఆమె ఉండటం లేదన్న వేదనలోఉండేవాడు.
తాజాగా సోమవారం రాత్రి ఆమెతో చాటింగ్ చేస్తూ.. ఫోన్ స్విచ్ఛాప్ చేయొద్దని కోరాడు. ఈ క్రమంలో అతడి తీరుతో అప్పటికే తీవ్ర ఒత్తిడితో ఉన్న ఆమె.. ఇద్దరిలో ఎవరో ఒకరం చనిపోతే ప్రశాంతంగా ఉంటుందని మేసేజ్ పెట్టింది. దీంతో.. నువ్వెందుకు..నేనే చనిపోతానంటూ మెసేజ్ చేసి.. ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
ఉదయాన్నే వంశీ క్రిష్ణ ఇంటికి వెళ్లిన మేనమామ.. జరిగింది చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా అతడి ఫోన్ ను స్వాధీనంచేసుకోగా.. అందులో ఈ వివరాల్ని గుర్తించారు. ప్రేమించిన అమ్మాయి మాట అన్నదని.. పెంచి పెద్ద చేసిన వారికి వేదనను మిగులుస్తూ ఇలా చేయటం ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.